యూపీలో రసవత్తర రాజకీయం.. 48 గంటల్లో బీజేపీని వీడిన ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు

By Mahesh KFirst Published Jan 13, 2022, 1:13 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. పార్టీ ఫిరాయింపులు ఖంగు తినిపిస్తున్నాయి. 48 గంటల్లో ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడనున్నట్టు ప్రకటించారు. ఇందులో ఇద్దరు మంత్రులు కీలకమైన ఓబీసీ నేతలు కావడం బీజేపీలో కలవరం కలిగిస్తున్నట్టు సమాచారం. ఈ ఆరుగురితోపాటు సోమవారం ఓ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే బీజేపీ వీడి ఎస్పీలో చేరారు. అంతకు ముందే అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యే బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరడం గమనార్హం.
 

లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Assembly Election) షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల్లోకెల్లా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోనే దేశ రాజకీయాలు జరుగుతున్నాయి. దేశ ప్రజల్లో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ ఎన్నికలపైనే ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణ విషయం. అయితే, అసెంబ్లీ ఎన్నికలో ఏ పార్టీకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటే.. ఆ పార్టీకి వలసలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఒక్కసారిగా పరిస్థితులు ఎదురుతిరిగినట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేవలం 48 గంటల్లో ఒక క్యాబినెట్ మంత్రి, మరో ఐదుగురు BJP ఎమ్మెల్యేలు పార్టీ వీడనున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఢిల్లీలో బీజేపీ మేధోమధన చర్చ జరపాల్సి ఉన్నది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కీలక నేతలు ఇందులో పాల్గొని అసెంబ్లీ ఎన్నికలపై చర్చించాలని షెడ్యూల్ ఖరారైంది. కానీ, ఈ మీటింగ్‌కు ఒక్క రోజు ముందే మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య(Swamy Prasad Maurya) క్యాబినెట్ మంత్రిగా రాజీనామా చేశారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ ప్రకటనతో ఢిల్లీలో తలపెట్టిన సమావేశం రద్దయిపోయింది. స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసిన 24 గంటల్లోనే మరో మంత్రి దారా సింగ్ చౌహాన్ కూడా రాజీనామా చేశారు. వీరిద్దరూ యూపీలో ప్రముఖ ఓబీసీ నేతలు. వీరిద్దరి రాజీనామాతో బీజేపీకి ఓబీసీ బలంగా దారుణంగా పడిపోయిందని తెలుస్తున్నది. ఈ 48 గంటల వ్యవధిలోనే మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నట్టు ప్రకటనలు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే అవతార్ సింగ్ భదానా బుధవారం బీజేపీని వీడారు. త్వరలోనే ఆయన సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ దళ్‌లో చేరనున్నారు. కాగా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ పార్టీకి తమ రాజీనామాలు ప్రకటించారు. ఈ ముగ్గురూ మౌర్యకు మద్దతుగానే రాజీనామా చేసి ఉంటారని యోచిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే బ్రజేష్ ప్రజాపతి, రోషన్ లాల్ వర్మ, భగవతి సాగర్‌లు తమ రాజీనామాలు ప్రకటించారు. వీరితోపాటు సోమవారం బీజేపీ ఎమ్మెల్యే రాధా క్రిష్ణ శర్మ కూడా రాజీనామా చేశారు. ఆయన సమాజ్ వాదీ పార్టీలో చేరారు. అంతకు ముందే దిగ్విజయ్ నారాయణ్ చౌబే కూడా బీజేపీని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. వీరిద్దరూ బీజేపీలోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు. 

కాగా, బీజేపీని వీడటమే కాదు.. ఈ 48 గంటల్లోనే ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఒక కాంగ్రెస్ నుంచి మరొకరు సమాజ్ వాదీ పార్టీ నుంచి బీజేపీలో చేరారు.

శాసన సభా గడువు ముగుస్తున్న ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అసంబ్లీ ఎన్నికల నిర్వహణ నుంచి వెనుకడుగు వేయడం లేదని వివరించింది. నిన్ననే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలన ప్రకటించింది. యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్  రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఏడు షెడ్యూల్‌లలో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఒక్క యూపీలో మాత్రమే ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కరోనా కేసుల నేపథ్యంలో జనవరి 15వ తేదీ వరకు ఎన్నికల ర్యాలీలపై నిషేధం విధించింది. ఆ తర్వాతే ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షిస్తామని తెలిపింది.

click me!