
అస్సాంలో శుక్రవారం పోలీసులు జరిపిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్ లలో ముగ్గురు అనుమానిత డకాయిట్‌లు మరణించారు. ఈ విషయాన్ని గోల్‌పరా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీష్ రాకేష్ రెడ్డి నిర్ధారించారు. గత నెల రోజులుగా డకాయిట్‌లు, హత్య నిందితుల ముఠాను ట్రాక్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ ఎన్కౌంటర్ లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి 8.30 గంటల సమయంలో గోల్‌పరాలోని అగియాలో అరెకా గింజలను రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డగించారు. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని బయటకు రావాలని కోరగా వారు నిరాకరించారు. దీంతో పోలీసులు వారి వాహనం టైర్లపై కాల్పులు జరిపారు. దీంతో అనుమానిత దొంగలు కూడా కాల్పులు జరిపారు. ఇది పోలీసులు తిరిగి కాల్పులు జరిపేలా చేసింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, వారిలో ఇద్దరు గోల్‌పరా సివిల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతులను షాజహాన్ అలీ, సుషేన్ అలీగా గుర్తించారు.
కోక్రాజార్ జిల్లాలో జరిగిన రెండో ఘటనలో 10-15 మంది డకాయిట్ల ముఠాకు నాయకత్వం వహిస్తున్న మాజీ ఎన్‌ఎల్‌ఎఫ్‌బీ ఉగ్రవాదిని చిరాంగ్ జిల్లా నుండి గురువారం అరెస్టు చేశారు. అయితే అతడు దోచుకున్న బంగారాన్నీ, డబ్బులను కొక్రాఝర్‌లోని ఉల్తాపానీ రిజర్వ్ ఫారెస్ట్‌లో దాచి పెట్టారని నిందితుడు చెప్పాడు. వాటిని వెలికి తీసేందుకు ఆ ఫారెస్ట్ లోకి అతడిని పోలీసు బృందం తీసుకెళ్లింది.
ఫారెస్ట్ లోకి వెళ్లిన వెంటనే నిందితుడు రివాల్వర్‌ను తీసుకున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అతడు కాల్పులు జరిపాడు. అనంతరం పరిగెత్తడం ప్రారంభించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అతడి కాలుకు బుల్లెట్ తగిలింది. అయితే నిందితుడిని చికిత్స కోసం కోక్రాజార్ సివిల్ ఆసుపత్రి తీసుకెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన తరువాత అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలం నుంచి బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు, 7.65 ఎంఎం పిస్టల్‌తో పాటు నాలుగు రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మాజీ ఉగ్రవాదిని సంజులా వారిగా పోలీసులు గుర్తించారు. కాగా గత ఏడాది మే 10న ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అస్సాంలో పోలీసు ఎన్‌కౌంటర్‌లు ఊపందుకున్నాయి.