ట్ర‌క్కును ఢీ కొన్న ఖ‌డ్గ‌మృగం.. డ్రైవ‌ర్ కు భారీ జ‌రిమానా.. అస్సాం సీఎం ట్వీట్ వైర‌ల్

Published : Oct 10, 2022, 11:36 AM IST
ట్ర‌క్కును ఢీ కొన్న ఖ‌డ్గ‌మృగం.. డ్రైవ‌ర్ కు  భారీ జ‌రిమానా.. అస్సాం సీఎం ట్వీట్ వైర‌ల్

సారాంశం

అస్సాం కాజిరంగా నేషనల్ పార్క్ ప్రాంతంలోని ఎనిమ‌ల్ కారిడ‌ర్ లో ఓ ఖడ్గమృగాన్ని ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌పై సీఎం శర్మ స్పందించారు. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ..  డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నమ‌ని ట్వీట్ చేశారు. వన్యప్రాణుల ప్రాంతంలో నిబంధనలను ఎవరూ ఉల్లంఘించకూడదని పేర్కొన్నారు..  

నెట్టింట్లో ఓ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. వేగంగా వెళ్తున్న ఓ ట్ర‌క్కును ఆక‌స్మాత్తుగా ఓ ఖడ్గమృగం వ‌చ్చి ఢీకొట్టింది. కింద‌ప‌డిన ఆ ఖ‌డ్గ‌మృగం క్ష‌ణాల్లో పైకి లేచి అటవీలోకి ప‌రుగు పెట్టింది. ఈ ఘ‌ట‌న 
అస్సాంలోని ధుబ్రి జిల్లా కాజిరంగా నేషనల్ పార్క్ ప్రాంతంలోని నేషనల్ హైవే-37లో జరిగింది. 

వాస్త‌వానికి  ఓ హెవీ ట్ర‌క్కు జోర్హాట్ నుంచి గౌహతికి వెళ్తుంది. ఈ క్ర‌మంలో హల్లీబారిలోని కజిరంగా నేషనల్  పార్కు ఎనిమాల్ కారిడ‌ర్ లో ఆ ట్ర‌క్కు వేగంగా వెళ్తుంది. ఇంతలో ఒక్క సారిగా రోడ్డు పైకి వచ్చిన ఓ ఖడ్గమృగం ఆ ట్ర‌క్కును ఢీకొట్టింది. ఆ ఖ‌డ్గ‌మృగం కిందపడినా.. క్ష‌ణాల్లో వెంటనే పైకి లేచింది. మళ్లీ కిందపడి లేచి అటవీ ప్రాంతంలోకి ప‌రుగెత్తింది.  

కాగా, ఈ ఘ‌ట‌న‌పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన  వీడియోను త‌న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ట్రక్ డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటూ జరిమానా విధించినట్లు సీఎం ట్వీట్ చేశారు. వన్యప్రాణుల ప్రాంతంలో నిబంధనలను ఎవరూ ఉల్లంఘించకూడదని పేర్కొన్నారు.

ఖడ్గమృగాలు త‌మ‌ ప్రత్యేక స్నేహితులని, వారి భూభాగంలో ఎలాంటి ఉల్లంఘనలను అనుమతించబోమని ఆయన ట్వీట్ చేశారు. హల్దీబరీలో జరిగిన దురదృష్టకర ఘటనలో ఖడ్గమృగం ప్రాణాలతో బయటపడింది. వాహనాన్ని ఆపి జరిమానా విధించారని తెలిపారు. కాజిరంగాలోని జంతువులను రక్షించేందుకు ప్రభుత్వం 32 కి.మీ మేర ప్రత్యేక ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.

నిజానికి మౌలిక సదుపాయాల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా రోడ్డు ప్రమాదాల్లో వన్యప్రాణులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ట్రక్ డ్రైవర్‌పై త్వరితగతిన చర్యలు తీసుకున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ఖడ్గమృగం కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడపడానికి ప్రభుత్వం అనుమతించదన్నారు. 

మరోవైపు సోషల్‌ మీడియాలో వైరలయిన ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు మిశ్ర‌మంగా స్పందించారు. ఖడ్గమృగాన్ని గుర్తించిన ట్ర‌క్కు డ్రైవర్ దానిని తప్పించేందుకు ప్రయత్నించినా.. ఆ డ్రైవ‌ర్ పై జ‌రిమానా విధించ‌డ‌మేమిట‌ని ఒక‌రు ప్ర‌శ్నించారు. అసలు ఆ ప్రాంతంలో రోడ్లు వేసి..  జరిమానాలు విధించడమేమిట‌ని విమర్శించారు మ‌రొక‌రు.

ఎనిమ‌ల్ కారిడార్‌లో రోడ్డులు నిర్మించి.. జంతువులకు ఇబ్బంది కలిగిస్తున్నార‌నీ, అడ‌విని నాశనం చేస్తున్నార‌ని మరొకరు ఆరోపించారు. ఈ ప్రాంతంలో వేగ పరిమితులను ఖచ్చితంగా అమలు చేయాలంటూ ఒకరు త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.  

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్