Ashok Vihar fire accident : ఢిల్లీలో మ‌ళ్లీ అగ్ని ప్ర‌మాదం.. ఒక‌రు మృతి..

By team teluguFirst Published May 18, 2022, 6:55 AM IST
Highlights

ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఐదు రోజుల కిందట ముంద్కా ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో 27 మంది చనిపోయారు. ఈ ప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత నరేలాలోని ప్లాస్టిక్ గ్రాన్యులేషన్ ఫ్యాక్టరీ మంటలు చెలరేగాయి. తాజాగా అశోక్ విహార్ ప్రాంతానికి సమీపంలోని బాంక్వెట్ హాల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 

వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతానికి సమీపంలోని బాంక్వెట్ హాల్‌లో మంగళవారం సాయంత్రం అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఇందులో ఒక‌రు మృతి చెందార‌ని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. జీటీ కర్నాల్ రోడ్‌లోని అట్లాంటిస్ బాంక్వెట్ హాల్‌లో అగ్నిప్రమాదంపై త‌మకు సాయంత్రం 5.47 గంటలకు కాల్ వ‌చ్చింద‌ని, వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి 10 ఫైర్ ఇంజ‌న్లు పంపించామ‌ని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. 

మంటలు చెలరేగినప్పుడు బాంక్వెట్ హాల్‌లో ఎలాంటి కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది. మొద‌ట‌గా స్టేజ్ సమీపంలోని హాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. త‌రువాత‌ ఆపై భవనంలోని నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి.  

Delhi | Fire breaks out in Atlantis Banquet Hall at GT Karnal Road. 12 fire tenders have rushed to the spot. The process of extinguishing the fire is underway. Further details awaited: Delhi Fire Service pic.twitter.com/dIXGhy6j5F

— ANI (@ANI)

ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో బాంక్వెట్ హాల్ మేనేజర్ హర్ష్ చోప్రా భవనం మొదటి అంతస్తులో ఇరుక్కుపోయాడు. మంట‌ల ప్ర‌భావం వ‌ల్ల ఆయ‌న అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో ఆయ‌న‌ను వెంటనే ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. కానీ అత‌డు అప్ప‌టికే మృతి చెందాడ‌ని డాక్ట‌ర్లు నిర్దారించారు. ఫైర్ ఇంజ‌న్లు ప్ర‌య‌త్నాలు ఫ‌లించి మంట‌లు కొంత స‌మ‌యం త‌రువాత అదుపులోకి వ‌చ్చాయి. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా మూడు రోజుల కింద‌ట ఢిల్లీలోని నరేలాలోని ప్లాస్టిక్ గ్రాన్యులేషన్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్ర‌మాదంలో ఎవ‌రూ చ‌నిపోలేదు. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో రాత్రి 9.10 గంటలకు అగ్నిప్రమాదం ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో స్థానికులు వెంట‌నే ఫైర్ సిబ్బందికి స‌మాచారం అందించారు. వెంట‌నే 22 ఫైర్ ఇంజ‌న్లు అక్క‌డికి చేరుకున్నాయి. తెల్ల‌వారుజాము వ‌ర‌కు మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. 

ఇది మీడియం మీడియం కేటగిరీ అగ్నిప్రమాదంగా అధికారులు ప్రకటించారు. కాగా ఢిల్లీలోని ముండ్కాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 27 మంది మరణించిన ఒక రోజు తరువాత ఇది జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు తెలుగువారు కూడా ఉన్నారు.  ముండ్కా అగ్నిప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే విద్యుత్ పేలుడు కారణంగానే ఈ ఘటన జరిగిందని ఢిల్లీ అగ్నిమాపక అధికారి తెలిపారు. విద్యుత్‌ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ చీఫ్‌ ఆఫీసర్‌ అతుల్‌ గార్గ్ చెప్పారు. 

click me!