యూపి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అసదుద్దీన్ మజ్లీస్: 100 సీట్లకు పోటీ

By telugu teamFirst Published Jun 12, 2021, 8:09 AM IST
Highlights

యూపి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తన పార్టీని దింపడానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యూపిలో వంద సీట్లకు పోటీ చేయాలనే ఆలోచనతో ఓవైసీ ఉన్నట్లు చెబుతున్నారు.

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల బరిలోకి దిగడానికి తన పార్టీని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సిద్ధం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వంద సీట్లకు మజ్లీస్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. యూపి శాసనసభలో మొత్తం 403 సీట్లు ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో యూపి ఎన్నికలు జరగనున్నాయి. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓం ప్రకాశ్ రాజ్భర్ నేతృత్వంలోని భాగిదరి సంకల్ప్ మోర్చా (బిఎస్ఎం)తో అసదుద్దీన్ ఇప్పటికే చేతులు కలిపారు. మోర్చాలో తొమ్మిది చిన్నాచితక పార్టీలు ఉన్నాయి. గ్రామీణ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో రాజ్భర్ నేతృత్వంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీని తన వైపు తిప్పుకునేందుకు బిజెపి ప్రయత్నాలు సాగిస్తోంది. 

ఎస్బీఎస్బీ తొమ్మిది చిన్న పార్టీలతో కలిపి మోర్చాను ఏర్పాటు చేసింది. ఇందులో మజ్లీస్ కూడా భాగస్వామి. ఇతర ఓబీసీ, దళిత, మైనారిటీ నాయకత్వాలకు చెందిన పార్టీలను కూడా మోర్చాలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.  రాజ్భర్ బిజెపి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా బయటకు వచ్చి పార్టీని స్థాపించారు. 

యూపిలోని 75 జిల్లాలకు అసదుద్దీన్ ఓవైసీ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2017 ఎన్నికల్లో 36 సీట్లకు పోటీ చేసిన మజ్లీస్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఇటీవలి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో 24 సీట్లను గెలుచుకుంది. యూపి అసెంబ్లీ ఎన్నికల్లో ఓవైసీ పార్టీ పోటీ చేస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. 

click me!