
పంజాబ్‌లోని పాటియాలాలో హింసాత్మక ఘటనకు ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. నిందితుడు ముంబై నుంచి విస్తారా విమానంలో ఉదయం 7.20 గంటలకు మొహాలీకి చేరుకున్నట్లు సమాచారం రావడంతో విమానాశ్రయానికి CIA బృందం వెళ్లి అక్కడే అతడిని అదుపులోకి తీసుకుంది. శుక్రవారం పాటియాలాలో ఖలిస్థాన్ వ్యతిరేక ర్యాలీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ వర్గంపై మరో వర్గం రాళ్లు రువ్వుకున్నాయి. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి.
ఈ అల్లర్లకు కీలక సూత్రదారి వ్యక్తి బర్జిందర్ సింగ్ పర్వానా అని పోలీసులు భావించి అతడిని విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇతడు సిక్కు గ్రూపు దామ్‌దామి తక్సల్ రాజ్‌పురా అధిపతి అని సమాచారం. గతంలో కూడా పర్వానా సోషల్ మీడియా ద్వారా తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు అతను UAPA, 1984 అల్లర్లకు సంబంధించి గతంలో ప్రకటనలు చేశారు.
బర్జిందర్ సింగ్ పర్వానా అరెస్టుకు సంబంధించి పాటియాల ఐజీ ముఖ్విందర్ సింగ్ చిన్నా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఘటనలో అమాయకులెవరినీ వేధించబోమని చెప్పారు. అయితే ఇందులో ప్రమేయం ఉన్నవారిని అరెస్టు చేసి వారిపై చార్జ్ షీట్లు సమర్పిస్తామని చెప్పారు. నిందితుడిని పోలీసు రిమాండ్ లోకి తీసుకునేందుకు కోర్టు ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. కాగా ఈ ఘటనలో ప్రమేయం ఉన్న హరీష్ సింఘాల్ సన్నిహితుడు శంకర్ భరద్వాజ్‌తో పాటు మరో ముగ్గురు సిక్కు రాడికల్స్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలను పోస్ట్ చేసిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశామని తెలిపారు. సామాజిక వ్యతిరేక, దేశ వ్యతిరేక వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం భగవంత్ మాన్ ఆదేశించారని ఐజీ చెప్పారు.
ఇంటర్నెట్ సేవలు పునఃప్రారంభం
పాటియాలలో ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో పోలీసులు ముందుగా కర్ఫ్యూ విధించారు. అనంతరం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ విషయంలో భగవంత్ మాన్ వెంటనే స్పందించారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు ముగ్గురు పోలీసులు ఉన్నతాధికారులను బదిలీ చేసే వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. అయితే నేడు పరిస్థితి అదుపులోకి రావడంతో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించారు.
పాటియాల ప్రశాంతంగా ఉంది - భగవంత్ మాన్
పాటియాలలో ప్రశాంతంత నెలకొందని, పరిస్థితి మొత్తం అదుపులోనే ఉందని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. ‘‘ ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య సమస్యగా కనిపిస్తోందని, అయితే దీనిని కొందరు రెండు వర్గాల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారు ’’ అని సీఎం తెలిపారు. “ పాటియాలలో ప్రస్తుతం శాంతిగా ఉంది. అక్కడ శివసేన, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఉన్నాయి. వారి కార్యకర్తలు పరస్పరం ఘర్షణ పడ్డారు ” అని మాన్ అన్నారు. ఈ ఘర్షణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ., ఖలిస్థాన్ వ్యతిరేక మార్చ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై పంజాబ్ ప్రభుత్వం గట్టి చర్య తీసుకుందని తెలిపారు. ఇందులో ప్రమేయం ఉన్న ఎవరినీ విడిచిపెట్టబోదని చెప్పారు.