మళ్లీ కర్ణాటకతో సరిహద్దు వివాదం తెరపైకి తెచ్చిన మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఏమన్నారంటే ?

Published : May 01, 2022, 12:01 PM IST
మళ్లీ కర్ణాటకతో సరిహద్దు వివాదం తెరపైకి తెచ్చిన మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఏమన్నారంటే ?

సారాంశం

చివరి మరాఠీ గ్రామాన్ని మహారాష్ట్రలో కలిపేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఎన్ సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. శనివారం మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కర్ణాటకతో సరిహద్దు వెంబడి ఉన్న అనేక మరాఠీ మాట్లాడే గ్రామాలు మ‌హారాష్ట్ర‌లో లేక‌పోవ‌డంతో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విచారం వ్యక్తం చేశారు. శ‌నివారం మహారాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శివాజీనగర్ లోని పూణే సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ విధంగా వ్యాఖ్య‌లు చేశారు. 

‘‘ ఈ మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బెల్గాం, నిపాయ్. కార్వార్‌తో సహా రాష్ట్ర సరిహద్దులోని అనేక మరాఠీ మాట్లాడే గ్రామాలు ఇంకా మన రాష్ట్రంలో భాగం కాలేకపోయినందుకు మేము ఇప్పటికీ చింతిస్తున్నాము. మహారాష్ట్రలో భాగం కావడానికి ఈ గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి మేము మద్దతు ఇస్తూనే ఉంటామని నేను మీకు హామీ ఇస్తున్నాను ’’ అని పూణేలో జెండా ఎగురవేసిన కార్యక్రమం అనంతరం అజిత్ పవార్ అన్నారు.

బొంబాయి పునర్వ్యవస్థీకరణ చట్టం- 1960 అమలుల్లోకి రావడంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రెండు రాష్ట్రాలు మే 1న ఆయా రాష్ట్రాల వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాయి. అయితే సరిహద్దు విష‌యం చాలా కాలంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. బెళగావి సరిహద్దు జిల్లా భాషా ప్రాతిపదికన మునుపటి బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమని మహారాష్ట్ర వాదిస్తోంది. అయితే ప్ర‌స్తుతం ఇది కర్ణాటకలో భాగంగా ఉంది. 800 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని మహారాష్ట్ర ఏకకరణ్ సమితి (గతంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు నివేదిక సమర్పించింది) పోరాడుతోంది.

కాగా మహాజన్ కమిషన్ నివేదిక ద్వారా సరిహద్దు వివాదాన్ని ఇప్పటికే పరిష్కరించినట్లు కర్ణాటక నొక్కి చెబుతోంది. ‘‘ ఈ విధంగా ప్రాంతీయవాదం, భాషా శాస్త్రం విషయంలో మాట్లాడటం దేశ ఐక్యతకు హానికరం. కర్ణాటకలో మరాఠీలు కన్నడిగులతో కలిసి జీవిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని కన్నడిగులు మరాఠాలతో కలిసి జీవిస్తున్నారు’’ అని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు.

ఈ వివాదానికి సంబంధించి ఇరు రాష్ట్రాల నేతల మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతోంది. గతేడాది డిసెంబరులో బెల్గాంలో హింసాత్మక ఘటనలు చేసుకున్నాయి. దీంతో అక్క‌డ కఠిన ఆంక్షలు విధించారు. మహారాష్ట్రలో ప్ర‌భుత్వంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న శివ‌సేన పార్టీ కూడా ఈ సరిహద్దు జిల్లాను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని గతంలో డిమాండ్ చేసింది. మరాఠీ మాట్లాడే ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆ పార్టీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. గత ఆ పార్టీ అధికారిక ప‌త్రిక అయిన సామ్నాలో ‘మ‌రాఠీల‌పై దౌర్జన్యాలు ఆగకుంటే కేంద్రం బెల్గాం జిల్లాను ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి’ అంటూ క‌థ‌నం రాసుకొచ్చింది. 

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర, గుజరాత్‌ల ఆవిర్భావ దినోత్సవం నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మహారాష్ట్ర ప్రజల శ్రేయస్సు, గుజరాత్ ప్ర‌జ‌ల పురోగతి కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. “ మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం సాటిలేని కృషి చేసింది. మహారాష్ట్ర ప్రజలు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. రాష్ట్ర ప్రజలు శ్రేయస్సును కోరుకుంటున్నాను’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?