తేని జిల్లాలో భారీ విధ్వంసం.. ఎట్టకేలకు చిక్కిన అరికొంబన్ ఏనుగు..

By Sumanth KanukulaFirst Published Jun 5, 2023, 9:54 AM IST
Highlights

తమిళనాడు తేని జిల్లాలో  అరికొంబన్  అనే ఏనుగు బీభత్సం సృష్టించిన సంగతి  తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఏనుగును అధికారులు పట్టుకున్నారు. 

తమిళనాడు తేని జిల్లాలో  అరికొంబన్  అనే ఏనుగు బీభత్సం సృష్టించిన సంగతి  తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఏనుగును అధికారులు పట్టుకున్నారు. తేని జిల్లాలోని కంబం ప్రాంతంలో సంచరిస్తున్న అరి కొంబన్ ఏనుగు 2 మత్తు ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత పట్టుబడింది. సోమవారం తెల్లవారుజామున తమిళనాడులోని కంబమ్ ఈస్ట్ రేంజ్‌లో ఫారెస్ట్ వెటర్నరీ సర్జన్లు, అటవీ శాఖ అధికారుల బృందం అరికొంబన్ ఏనుగును పట్టుకునే ప్రయత్నంలో విజయం సాధించారు. 3 కుమ్కీ ఏనుగుల సాయంతో అరి కొంబన్ ఏనుగును ట్రక్కులో ఎక్కించే పనిలో అటవీశాఖ ముమ్మరంగా నిమగ్నమైంది.

పట్టుబడిన అరి క్కొంబన్ ఏనుగును తేని జిల్లాకు ఆనుకుని ఉన్న వెల్లిమలై ప్రాంతంలో విడిచిపెట్టాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఏనుగుకు చాలా గాయాలు కావడంతో.. చికిత్స కోసం తొలుత ముడుమలై అటవీ ప్రాంతానికి వెళ్లనున్నారు. ఆపై దానిని అడవిలో విడిచిపెట్టాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏనుగును ఏ ప్రాంతంలో విడుదల చేయబోతున్నారనే దానిపై అధికారికంగా సమాచారం ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది.

ఈ ఏనుగును కేరళ అటవీ శాఖ 2023 ఏప్రిల్ 29న కేరళ, తమిళనాడు అంతర్రాష్ట్ర సరిహద్దులోని పెరియార్ టైగర్ రిజర్వ్‌లో మార్చింది. అయితే ఇటీవల ఏనుగు తమిళనాడు అడవుల్లోకి ప్రవేశించిన తర్వాత.. మెగామలై లోయర్ క్యాంప్, కంబం, సురులపట్టి, యానై గజం, కూతనాచ్చి అటవీ రేంజ్‌లలో తిరగసాగింది. అయితే కంబం ప్రాంతంలో గత వారం విధ్వంసం తర్వాత అడవి ఏనుగును దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదిలేయాలని తమిళనాడు అటవీ అధికారులు ప్రణాళికలు రచించారు. 

click me!