ఆ కథనం అవాస్తవం , నిరాధారం : ‘‘ cash for kidney ’’ ఆరోపణలను ఖండించిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్

By Siva KodatiFirst Published Dec 5, 2023, 5:04 PM IST
Highlights

మయన్మార్‌లోని పేద ప్రజల నుండి కిడ్నీలను అక్రమంగా కొనుగోలు చేసిన "క్యాష్ ఫర్ కిడ్నీ" రాకెట్‌లో ప్రమేయం ఉందంటూ తమ సంస్థపై వస్తున్న ఆరోపణలను ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IMCL) ఖండించింది.

మయన్మార్‌లోని పేద ప్రజల నుండి కిడ్నీలను అక్రమంగా కొనుగోలు చేసిన "క్యాష్ ఫర్ కిడ్నీ" రాకెట్‌లో ప్రమేయం ఉందంటూ తమ సంస్థపై వస్తున్న ఆరోపణలను ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IMCL) ఖండించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మయన్మార్‌లోని పేదల నుంచి కొన్న కిడ్నీలను సంపన్న రోగులకు విక్రయించినట్లుగా కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఐఎంసీఎల్ దేశంలోని అతిపెద్ద హాస్పిటల్ గ్రూపులలో ఒకటైన అపోలో హాస్పిటల్స్‌లో భాగం. 

డిసెంబర్ 3 నాటి నివేదిక ప్రకారం.. లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రఖ్యాత ‘‘ ది టెలిగ్రాఫ్’’ వార్తాపత్రిక ఐఎంసీఎల్‌పై ఒక కథనాన్ని ప్రచురించింది. మయన్మార్‌లో నిరాశా నిస్పృహాలకు గురైన వారు, పేదలు డబ్బుల కోసం తమ అవయవాలను విక్రయిస్తున్నారనేది ఆ వార్త సారాంశం. ఇందుకోసం వారు ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి వెళ్లి .. అక్కడ ధనవంతులైన బర్మీస్ రోగులకు వారి కిడ్నీలను దానం చేసి డబ్బులు తీసుకుంటున్నారని పేర్కొంది. 

Latest Videos

ఈ ఆరోపణలపై ఐఎంసీఎల్ ప్రతినిధి స్పందిస్తూ.. తమ సంస్థపై అంతర్జాతీయ మీడియా చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమన్నారు. ఇవి నిరాధారమైనవి కావడంతో పాటు తప్పుదారి పట్టిస్తాయని.. అన్ని వాస్తవాలను సంబంధిత జర్నలిస్ట్‌తో పంచుకున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని మార్గదర్శకాలతో పాటు రోగులు, దాతల సమ్మతి, తమ అంతర్గత నిబంధనలను అనుసరించి అవయవాల మార్పిడి జరుగుతుందని.. చట్టం , నైతికతకు ఐఎంసీఎల్ కట్టుబడి వుందని సదరు ప్రతినిధి స్పష్టం చేశారు. 

ప్రతి దాత తమ దేశంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ నోటరీ చేయబడిన ‘‘ఫారం 21’’ని అందించాల్సి వుంటుందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఆ ఫారం విదేశీ ప్రభుత్వం నుంచి దాత, గ్రహీతలు సంబంధం కలిగి వున్నారని ఇచ్చే ధృవీకరణ పత్రం. ఐఎంసీఎల్‌లో ప్రభుత్వం నియమించిన ట్రాన్స్‌ప్లాంట్ ఆథరైజేషన్ కమిటీ  ఈ ధృవీకరణ పత్రంతో పాటు ప్రతి కేసుకు సంబంధించిన పత్రాలను సమీక్షిస్తుందని .. దాత, గ్రహీతలను ఇంటర్వ్యూ చేస్తుందని ప్రతినిధి చెప్పారు. అనంతరం దేశంలోని సంబంధిత రాయబార కార్యాలయంతో పత్రాలను మళ్లీ ధృవీకరిస్తామని.. రోగులు, దాతలు జన్యుపరీక్ష సహా అనేక వైద్య పరీక్షలు చేయించుకుంటారని సదరు ప్రతినిధులు చెప్పారు. 

ఈ దశలు, చట్టాల ప్రకారం దాత, గ్రహీతలు నిజంగా సంబంధం కలిగి వున్నారా లేదా అనేది ఆరా తీస్తామన్నారు. ఐఎంసీఎల్ అత్యున్నత నైతిక ప్రమాణాలకు కట్టుబడి వుందని, అందరికీ అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణను అందించడానికి మా మిషన్ కట్టుబడి వుందని ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా.. భారత మానవ అవయవాల మార్పిడి చట్టం ప్రకారం.. జీవిత భాగస్వాములు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, మనువలు వంటి దగ్గరి బంధువులు అవయవాలను దానం చేయవచ్చు. చట్టం అనుమతించిన మానవతా కేసుల్లో మినహా మిగిలిన సమయంలో అపరిచితుల నుంచి అవయవాలు తీసుకోవడం పరిమితం చేయబడింది. 
 

click me!