వారెవ్వా.. కరెంట్ షాక్ కు గురైన 4 ఏళ్ల చిన్నారిని చాకచక్యంగా కాపాడిన వృద్ధుడు.. వీడియో వైరల్

Published : Sep 27, 2023, 02:13 PM IST
వారెవ్వా.. కరెంట్ షాక్ కు గురైన 4 ఏళ్ల చిన్నారిని చాకచక్యంగా కాపాడిన వృద్ధుడు.. వీడియో వైరల్

సారాంశం

కరెంట్ షాక్ కు గురై, నీటిలో పడిపోయి తల్లడిల్లుతున్న ఓ బాలికను వృద్ధుడు చాకచక్యంగా ఆలోచించి, పెద్ద ప్రమాదం నుంచి తప్పించారు. ఈ ఘటన యూపీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ చిన్నారికి నాలుగేళ్లు ఉంటాయి. కరెంట్ షాక్ కు గురై నీటిలో పడిపోయింది. ఏం జరిగిందో అర్థంకాక ఆ నీటిలో తల్లడిల్లుతోంది. దీనిని అటుగా వెళ్తున్న పలువురు గమనించారు. అందులో యువకులు కూడా ఉన్నారు. కానీ ఆ బాలికను కాపాడేందుకు ముందుకు రాలేదు. అదే సమయంలో ఓ వృద్ధుడు అక్కడికి వచ్చి చాకచక్యంగా ఆ బాలికను కాపాడారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వివరాలు ఇలా ఉన్నాయి. అది యూపీలోని వారణాసి పట్టణం. మంగళవారం ఉదయం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అంతకు ముందు రాత్రి కురిసన వర్షం కారణంగా రోడ్డుపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ఉంది. ఈ క్రమంలో సిటీలోని ఓ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఓ చిన్నారి కరెంటు వైర్ ను తాకడంతో షాక్ కొట్టింది. వెంటనే కింద నీళ్లు నిలిచి ఉన్న రోడ్డుపై పడిపోయింది.

అటుగా వెళ్తున్న పలువురు వాహనదారులు ఆ చిన్నారి పడిపోవడాన్ని గమనించారు. ఎలా కాపాడాలో ఏంటో వారికి అర్థం కాలేదో ఏమో గానీ వారు అలాగే చూస్తూ ఉండిపోయారు. అదే సమయంలో ఆ రోడ్డుపైకి ఆటో వచ్చింది. పరిస్థితిని అర్థం చేసుకున్న డ్రైవర్ ఆటోను వెనక్కి తీసుకున్నాడు. అందులో నుంచి ఓ వృద్ధుడు దిగి బాలికను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ కరెంట్ షాక్ తగలడంతో ఆయన వెనక్కి వచ్చారు. కొన్ని క్షణాల్లోనే అక్కడికి మరో వృద్ధుడు వచ్చారు. 

పరిస్థితి మొత్తం అర్థం చేసుకున్న ఆయన వేగంగా స్పందించారు. అటూ, ఇటూ తిరిగి ఓ కర్రను తీసుకున్నారు. ఆ కర్రను పట్టుకోవాలని బాలికకు సూచించారు. కొన్ని క్షణాల తరువాత ఆ బాలిక కర్రను పట్టుకుంది. దీంతో ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు లాగారు. దీంతో ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చాకచక్యంగా ప్రతిస్పందించి, బాలికను కాపాడిన ఆ వృద్ధుడిని నెటిజన్లు అభినందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

80వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech
ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సిల్స్ | Red Fort Independence Day rehearsal