
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వంశపారంపర్య రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాగల్‌కోట్ జిల్లాలోని తెరాల్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కర్ణాటలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ర అభివృద్ధి "రివర్స్ గేర్"లో ఉంటుందని విమర్శించారు.
‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజవంశ రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటాయి. కర్ణాటక అల్లర్లతో అతలాకుతలం అవుతుంది’’ అని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి విపరీతంగా పెరిగిపోతుందని విమర్శించారు. కర్ణాటకలో రాజకీయ సుస్థిరత కోసం బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. జేపీ మాత్రమే రాష్ట్రాన్ని ‘‘న్యూ కర్ణాటక’’ వైపు నడిపించగలదని అన్నారు.
ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్‌ను తొలగించాలనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి అమిత్ షా మద్దతు ఇచ్చారు. ‘‘మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని మేము నమ్ముతున్నాము’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ ఎన్నికలు కర్ణాటకను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడానికి, ఇక్కడ రాజకీయ స్థిరత్వాన్ని కూడా తీసుకురావడానికి’’ అని అమిత్ షా అన్నారు. జేడీ(ఎస్)కి ఓటేయడం అంటే కాంగ్రెస్‌కు ఓటు వేయడమేనని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు పడకూడదనుకుంటే.. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలపునిచ్చారు.