
భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు తదుపరి జన గణన డేటా దోహదపడుతుందని కేంద్ర హోంమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ఖచ్చితమైన డేటా అవసరమని కూడా ఆయన అన్నారు. ఖచ్చితమైన డేటా అందుబాటులో ఉన్నప్పుడే అభివృద్ధి ప్రణాళికలను రూపొందించవచ్చనీ, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో తదుపరి జనాభా గణన డేటా సహాయపడుతుందని తాను విషయాన్ని ఖచ్చితంగా అనుకుంటున్నాను.
జనాభా లెక్కలకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తీసుకురానున్నట్టు కూడా కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అన్ని రకాల డేటా ఆన్‌లైన్‌లో నమోదు చేయబడుతుంది. జనాభాకు సంబంధించిన ప్రతి సమాచారం ఆన్‌లైన్‌లో ఉంటుంది. జనాభాకు సంబంధించిన అన్ని అంశాలను బిల్లులో పొందుపరుస్తారు.
ఈ సందర్భంగా జనన మరణాల నమోదు కోసం రూపొందించిన వెబ్ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. అలాగే.. పౌరుల డేటా, ఓటరు జాబితాలు, లబ్ధిదారుల మదింపులు వంటి వివిధ డేటాను నిర్వహించాల్సిన అవసరం ఉన్నందున, ఏ దేశానికైనా జనన మరణాల నమోదు ముఖ్యమైనదని షా అన్నారు. అలాగే 1981 జనాభా లెక్కల నుంచి ఇప్పటి వరకు జరిగిన సమాచారంతో కూడిన పుస్తకాన్ని విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ ప్రక్రియలో ఒక వ్యక్తికి 18 సంవత్సరాలు నిండినప్పుడు.. అతని లేదా ఆమె పేరు స్వయంచాలకంగా ఓటర్ల జాబితాలో చేర్చబడుతుంది. అదేవిధంగా.. ఒక వ్యక్తి మరణించినప్పుడు, ఆ సమాచారం స్వయంచాలకంగా ఎన్నికల కమిషన్‌కు వెళుతుంది. ఇలా ఓటర్ల జాబితా నుండి పేరును తొలగించే ప్రక్రియను ప్రారంభమవుతోందని తెలిపారు.
అలాగే.. జనన మరణాల నమోదు చట్టం 1969ని సవరించడం వల్ల డ్రైవింగ్ లైసెన్స్ , పాస్‌పోర్ట్ పొందే ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నుండి వ్యక్తులు వివిధ ప్రయోజనాలను పొందగలుగుతారని, అదనంగా ఇతర ప్రయోజనాలను కూడా చేకూరుతాయని తెలిపారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల డేటాను ప్రత్యేక పద్ధతిలో భద్రపరిచినట్లయితే, జనాభా లెక్కల మధ్య సమయాన్ని అంచనా వేయడం ద్వారా, అభివృద్ధి పనుల ప్రణాళికను సక్రమంగా చేయవచ్చని తెలిపారు.