హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లకు ముహూర్తం ఖరారు.. ఎక్కువ లబ్దిదారులు భారతీయులే: అమెరికా

Published : Jan 30, 2022, 06:42 PM IST
హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లకు ముహూర్తం ఖరారు.. ఎక్కువ లబ్దిదారులు భారతీయులే: అమెరికా

సారాంశం

అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా గురించి కీలక ప్రకటన చేసింది. మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు హెచ్-1బీ వీసా ప్రాథమిక స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా నమోదు ప్రక్రియ పైన తెలిపిన తేదీల్లో పిటిషనర్లు, వారి ప్రతినిధులు పూర్తి చేసుకోవాలని ఆ ప్రకటనలో సూచించింది. ఈ వీసాలు పొందేవారిలో ఎక్కువగా భారతీయులే ఉంటారని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.

న్యూఢిల్లీ: అమెరికా(America) వెళ్లాలనుకునే భారత(Indians) టెకీల చూపు ఎక్కువగా హెచ్-1బీ వీసా(H-1B Visa)పైనే ఉంటుంది. ఉన్నత నైపుణ్యాలతో కొంత కాలం అమెరికాలోని సంస్థల్లో సేవలందించడానికి ఉపకరించే ఈ వీసాలపై భారత సంస్థలు ఎక్కువగా ఆసక్తి చూపుతాయి. అమెరికాలోని తమ అనుబంధ సంస్థలు, ఇతర సంస్థల్లో పని చేయడానికి ఇక్కడి నుంచి ఎంపిక చేసి ఉద్యోగులను పంపుతుంటారు. అమెరికా సంస్థలూ విదేశాల నుంచి తమ సంస్థల్లో కొంత కాలం పని చేయడానికి ఉన్నత నైపుణ్యాలు గల సిబ్బందిని ఈ వీసా ఆధారంగా రప్పిస్తుంటాయి. అమెరికాలో ఉన్నత చదువులకూ ఈ వీసా ఉంటుంది. హెచ్-1బీ వీసా గురించి అమెరికా కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా ప్రాథమిక నమోదు ప్రక్రియ(Registration)కు ముహూర్తం ఖరారు చేసింది.

2023 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల కోసం మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రాథమిక స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతుందని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా నమోదు ప్రక్రియ పైన తెలిపిన తేదీల్లో పిటిషనర్లు, వారి ప్రతినిధులు పూర్తి చేసుకోవాలని ఆ ప్రకటనలో సూచించింది. సమర్పించిన ప్రతి రిజిస్ట్రేషన్‌కు ఒక కన్ఫర్మేషన్ నెంబర్‌ను అసైన్ చేస్తామని తెలిపింది. అయితే, ఆ నెంబర్ ద్వారా అధికారులు మాత్రమే ట్రాక్ చేయగలరని పేర్కొంది. ఆ నెంబర్‌ను ఇతరులు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ట్రాక్ చేయడానికి ఉపయోగించలేరని స్పష్టం చేసింది. 

హెచ్-1బీ పిటిషనర్లు, లేదా వారి రిప్రజంటేటివ్‌లు మై యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాను వినియోగించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఈ ఆన్‌లైన్ ఖాతా ద్వారా ప్రతి ఒక్క లబ్దిదారుడు సాంకేతికంగా సెలెక్షన్ ప్రాసెస్ కోసం నమోదు చేసుకోవాలని వివరించింది. ఇందుకు రిజిస్ట్రేషన్ రుసుము 10 అమెరికన్ డాలర్లు ఉంటుందని పేర్కొంది. వీసా కోసం దరఖాస్తులు సమర్పించే పిటిషనర్లు రిజిస్ట్రాంట్ ఖాతాలను ఉపయోగించి ఈ ప్రనక్రియకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఫిబ్రవరి 21వ తేదీ  మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రాంట్లు కొత్త అకౌంట్లను సృష్టించుకోవచ్చని వివరించింది. అమెరికా సంస్థల యాజమాన్యాలు, ఏజెంట్లను కలిపి సంయుక్తంగా రిజిస్ట్రాంట్లు అని పిలుస్తారు.

మార్చి 18వ తేదీ డెడ్‌లైన్ లోపు సరిపడా రిజిస్ట్రేషన్లు అందగానే.. తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తామని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. ర్యాండమ్‌గా సెలెక్షన్ ప్రక్రియ చేపడుతామని, ఆ సెలెక్షన్ నోటిఫికేషన్‌ను యూజర్లకు మైయూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ అకౌంట్ల ద్వారా తెలియజేస్తామని వివరించింది.

అమెరికా కంపెనీలు, ఇతర యాజమాన్యాలు విదేశాల నుంచి నైపుణ్యవంతులైన సిబ్బందిని తాత్కాలికంగా తమ వద్ద పని కోసం రప్పించుకోవడానికి ఈ హెచ్-1బీ వీసాలు ఉపకరిస్తాయి. అమెరికాకు వచ్చే ఆ ఉద్యోగులకు నైపుణ్యపరమైన కొన్ని షరతులు ఉంటాయి. ప్రతి ఏడాది అమెరికా 65 వేల హెచ్-1బీ వీసాలను అందరి కోసం జారీ చేస్తుంది. 20వేల వీసాలను అడ్వాన్స్‌డ్ యూఎస్ డిగ్రీల కోసం విడుదల చేస్తుంది. ఈ వీసాల లబ్దిదారులు ప్రధానంగా భారత్ నుంచే ఉంటారు. హెచ్-1బీ వీసాలు పొందే వారిలో సుమారు 75 శాతం మంది భారతీయులే ఉంటారని అమెరికా ప్రభుత్వం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?