
ముస్లిం వివాహాలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొదటి భార్య, పిల్లలను పోషించే సామర్థ్యం లేకుంటే ముస్లిం పురుషుడు ఖురాన్ ప్రకారం మరో మహిళను పెళ్లి చేసుకోలేడని హైకోర్టు పేర్కొంది. మొదటి భార్య ఇష్టానికి వ్యతిరేకంగా.. మరో మహిళనుపెళ్లి చేసుకన్న వ్యక్తితో ఆమెను కలిసి జీవించమని కోర్టు ఒత్తిడి చేయరాదని పేర్కొంది. ఒకవేళ ఆమెను అలా బలవంతం చేయడం 'అసమానత్వం' అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. తన మొదటి భార్యకి సంబంధించి దావాను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఒక ముస్లిం వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ సూర్య ప్రకాష్ కేసర్వాణి, జస్టిస్ రాజేంద్ర కుమార్-IV లతో కూడిన ధర్మాసనం ఈ విధంగా పేర్కొంది.
ఈ కేసు విషయానికి వస్తే.. ఓ వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తన మొదటి భార్యకు వెల్లడించలేదు. అయినప్పటికీ.. అతడు ఇద్దరు భార్యలతో కలిసి జీవించాలని కోరుకున్నాడు. మొదటి భార్య అతనితో కలిసి జీవించడానికి, అతని కన్సార్టియంను మరొక మహిళతో పంచుకోవడానికి నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ పిటిషన్‌ను దాఖలు చేశాడు. ఈ క్రమంలోనే ఇరువర్గాల వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు ఆ వ్యక్తి పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అతడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.
అయితే అన్ని అంశాలను పరిశీలించిన అలహాబాద్ హైకోర్టు.. అతని అప్పీల్‌ను కొట్టివేసింది. ఫిర్యాదుదారుడు తన మొదటి భార్య నుంచి ఈ వాస్తవాన్ని అణచివేస్తూ రెండవ వివాహం చేసుకున్నప్పుడు.. మొదటి భార్య పట్ల అతని ప్రవర్తన క్రూరత్వానికి సమానం అని హైకోర్టు ప్రత్యేకంగా గమనించింది. అయితే, భర్త క్రూరత్వానికి సంతృప్తికరమైన రుజువు లేనప్పటికీ.. భర్తకు అనుకూలంగా తిరిగి చెల్లించే డిక్రీని కోర్టు ఆమోదించదని తెలిపింది. సాక్ష్యం ప్రకారం..అతనితో కలిసి జీవించమని ఆమెను బలవంతం చేయడం అన్యాయం, అసమానమైనదని పేర్కొంది.
"సురా 4 అయత్ 3 (ఖురాన్) యొక్క మతపరమైన ఆదేశం ముస్లిం పురుషులందరికీ కట్టుబడి ఉంది. ఇది ముస్లిం పురుషులందరూ అనాథలతో న్యాయంగా వ్యవహరించాలని నిర్దేశిస్తుంది. వారు తమకు నచ్చిన ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు స్త్రీలను వివాహం చేసుకోవచ్చు.. కానీ ఒక ముస్లిం పురుషుడు వారికి న్యాయం న్యాయంగా వ్యవహరించలేనని అనకుంటే ఒకరినే చేసుకోవాలి. పవిత్ర ఖురాన్ యొక్క పై ఆదేశం ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్య, పిల్లలను పోషించే సామర్థ్యం లేకుంటే, అతను ఇతర స్త్రీని వివాహం చేసుకోలేడు’’ అని అలహాబాద్ హైకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా పేర్కొంది.