
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఎంపీ పదవికి అఖిలేష్ యాదవ్ రాజీనామా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ (Azamgarh) నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి బరిలో నిలిచిన అఖిలేష్.. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఈ క్రమంలోనే ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి రావడంతో.. అఖిలేష్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు అఖిలేష్ యాదవ్.. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.
దీంతో అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో అఖిలేష్.. మండలి సభ్యునిగా కొనసాగారు. అయితే ఇటీవలి యూపీ ఎన్నిల బరిలో నిలిచిన అఖిలేష్.. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల పోరులో నిలిచినట్టయింది. అయితే తాజాగా ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అఖిలేష్ నిర్ణయించుకోవడంతో.. సమాజ్‌వాద్ పార్టీ తరఫున ఆయన అసెంబ్లీలో పక్షనేతగా కొనసాగనున్నారు. బీజేపీ సర్కార్‌పై అసెంబ్లీ వేదికగా పోరాడాలనే నిర్ణయంతోనే అఖిలేష్ ఎమ్మెల్యేగా ఉండేందుకు మొగ్గు చూపినట్టుగా సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక, మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేష్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి SP Singh Baghelపై 67,504 ఓట్ల ఆధిక్యం సాధించారు. అఖిలేష్‌కు మొత్తం 1,48,196 ఓట్లు రాగా, బాఘెల్‌కు 80,692 ఓట్లు వచ్చాయి. ఎస్‌పీకి కంచుకోటగా చెప్పుకునే కర్హాల్‌లో అఖిలేష్‌కు 60.12 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇక, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 నియోజకవర్గాలకు గాను 255 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చూసిన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాద్ పార్టీకి తీవ్ర పరాభవమే మిగిలింది. అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అయితే గత ఎన్నికలతో పోల్చితే మెరుగైన ఫలితాలను సాధించింది. మొత్తం 111 అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు.