UP Assembly Election 2022: "బుల్డోజర్ బాబా.." సీఎం యోగికి కొత్త పేరు పెట్టిన అఖిలేష్

Published : Feb 20, 2022, 06:12 PM IST
UP Assembly Election 2022: "బుల్డోజర్ బాబా.." సీఎం యోగికి కొత్త పేరు పెట్టిన అఖిలేష్

సారాంశం

UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ కొత్త పేరు పెట్టారు. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించిన యోగికి ‘బుల్డోజర్‌ బాబా’గా అఖిలేష్ యాదవ్‌ పేరు పెట్టారు.   

UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో పార్టీల ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తునే... మ‌రో వైపు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ మ‌ధ్య  మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్ర‌మంలో అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ ఏ రాజ‌కీయ పార్టీ కూడా వదులుకోవడం లేదు. 

తాజాగా.. యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో బుల్డోజర్ల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌. సీఎం యోగి  త‌న ఎన్నికల ప్రచారంలో ప‌దే ప‌దే..  బుల్డోజర్ల విష‌యాన్ని ప్ర‌స్త‌విస్తున్నార‌ని.. ఆయ‌న‌ను సీఎం యోగి అని పిల‌వ‌డం కంటే.. బుల్డోజర్‌ బాబా అని పిల‌వ‌డం మేల‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారని విమ‌ర్శించారు. 

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం అయోధ్యలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ నేత‌లు ఏబీసీడీ లు నేర్చుకుంటున్నారని, దాని కారణంగా ప్రతిదాని పేరు మార్చాల‌ని భావిస్తున్నార‌ని విమ‌ర్శించారు. సీఎం యోగీ త‌న  ఐదేండ్ల పాలనలో పేర్లు మార్చడం తప్ప సీఎం యోగి చేసిందేమీ లేదని ఏద్దేవా చేశారు. అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా,  ఫైజాబాద్‌ని అయోధ్యగా మార్చార‌ని గుర్తు చేశారు. అందుకే సీఎం యోగికి కూడా ‘బుల్డోజర్‌ బాబా’గా పేరు మార్చార‌ని అన్నారు. 

నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ప్రజలు వెనక్కి తీసుకెళ్తారని అన్నారు. యూపీ ప్రజలు యోగీ పాల‌న‌ పట్ల అసంతృప్తితో ఉన్నారని, ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ప‌రాజ‌యం పాలు కావ‌డం ఖాయ‌మ‌న్నారు. యూపీ  ప్రజలు తమపై ఆగ్రహంతో ఉన్నారని అధికార బీజేపీ కూడా గ్రహించిందని, అందుకే వారి భాష, ప్రవర్తన మారిపోయిందని ఏద్దేవా చేశారు. 

అంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత ఒకరు.. నేరస్థుల అక్రమాస్తులను కూల్చివేసేందుకు యూపీ ప్రభుత్వం గతంలో బుల్​డోజర్లను ఉపయోగించింది. ఈ ఘ‌ట‌న‌ను గుర్తు చేస్తూ.. తన ప్రభుత్వం ఏర్పడితే.. ఇళ్ళు కోల్పోయిన‌ వారందరికీ కొత్త గృహాలు ఇస్తామని హామీ ఇచ్చారు.  బీజేపీ త‌న ఎన్నికల గుర్తు ను బుల్డోజర్‌గా మార్చుకోవాల‌ని విమ‌ర్శించారు. 

ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇళ్లను నిర్మించుకునేందుకు గ్యాంగ్‌స్టర్లను అనుమతించడంపై ఆదిత్యనాథ్ ఎస్పీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తన హయాంలో ఇలాంటి చర్యలు సాగవని తేల్చిచెప్పారు. 

గ‌త వారం మెయిన్‌పురీ ఎన్నికల ప్రచారంలో ఓ వ్య‌క్తి .. ఎన్నికల సమయంలోనూ బుల్​డోజర్లను అలా ఉపయోగించగలదా ? అని సీఎం యోగిని ప్ర‌శ్నించారు. ఆ ప్ర‌శ్న‌కు సీఎం యోగి స‌మాధానమిస్తూ.. కొన్ని సార్లు బుల్​డోజర్లకు విశ్రాంతి అవసరమ‌నీ, ప‍్రస్తుతం  బుల్డోజర్లన్నింటిని రిపేర్‌ కోసం పంపించాన‌నీ,  బుల్డోజర్ల విషయంలో చింతించాల్సిన పని లేదనీ.. ఎన్నిక ఫ‌లితాలు వెలువ‌డిన (మార్చి 10) తర్వాత.. 
 బుల్డోజర్లకు పనిచెబుతామంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తప్పు చేయాలనే ఆలోచన ఉన్న వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని యోగి హెచ్చరించారు. 

ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బుల్డోజర్ల అంశంపై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారిన‌ విషయం తెలిసిందే. యూపీలో ఉండాలంటే .. బీజేపీకి ఓటు వేయాల‌ని, ఓటు వేయని వారి కోసం  జేసీబీలు, బుల్డోజర్లు సిద్దంగా ఉన్నాయని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా తీవ్ర దూమారం రేపుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !