
2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల (Ahmedabad serial bomb blasts case) కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలినవారిలో 38 మందికి మరణ శిక్ష విధించింది. మిగిలిన 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై గుజరాత్ హైకోర్టు (gujarat high court) ను ఆశ్రయిస్తామని డిఫెన్స్ లాయర్లు (defense lawyers)వెల్లడించారు.
డిఫెన్స్ లాయర్ల (defense lawyer)లో ఒకరైన హెచ్‌ఎం షేక్ (HM Sheikh) శుక్రవారం మీడియాతో మట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ప్రత్యేక కోర్టు తన తీర్పును ఇచ్చే సమయంలో కేవలం సందర్భోచిత సాక్ష్యం, కొంతమంది దోషుల వాంగ్మూలాలపై ఆధారపడి ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తీర్పు ప్రధానంగా సందర్భోచిత సాక్ష్యం, CrPC సెక్షన్ 164 కింద నిందితులు ఇచ్చిన నాలుగు వాంగ్మూలాలు, అప్రూవర్ (approver) ప్రకటనపై ఆధారపడిందని అన్నారు. అయితే అలాంటి సాక్ష్యాలను కోర్టు తిరస్కరించి ఉండాల్సిందని తాను నమ్ముతున్నానని చెప్పారు, అయితే తీర్పు వచ్చినందున దోషులుగా తేలిన వారు దానిని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించడం సహజమే అని ఆయన చెప్పారు. తీర్పు 7,000 పేజీలకు పైగా ఉందని ఆయన అన్నారు. అది ఇంకా తమకు అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఆ తీర్పును అధ్యయనం చేసిన తరువాత భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు.
మరో డిఫెన్స్ న్యాయవాది ఖలీద్ షేక్ (Khalid Shaikh) మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాల ప్రకారం ప్రత్యేక న్యాయస్థానం ఉదాసీనతను ప్రదర్శించి ఉండాల్సిందని అన్నారు. కోర్టు కొంత ఉదాసీనత చూపుతుందని, కఠిన శిక్షలు విధించబోదని తాము ఆశించామని అన్నారు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేయడంపై తుది నిర్ణయం తీసుకునే ముందు తీర్పు సారాంశాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తామని తెలిపారు.
56 మంది ప్రాణాలు కోల్పోయి 200 మందికి పైగా గాయపడిన అహ్మదాబాద్ వరుస పేలుళ్ల Ahmedabad serial bomb blasts)కు సంబంధించిన కేసులో ఇండియన్ ముజాహిదీన్ (Indian Mujahideen) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 38 మంది సభ్యులకు మరణ శిక్ష, మరో 11 మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఫిబ్రవరి 8న కోర్టు 49 మందిని దోషులుగా నిర్ధారించింది. 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల ఘటన 2008లో సంభవించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడింది. ఇంత మంది దోషులకు ఒకేసారి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఏ కోర్టు ఇలా విధించలేదు. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన కేసులో 26 మంది దోషులకు తమిళనాడు (tamilnadu)లోని టాడా కోర్టు (TADA Court) జనవరి 1998లో మరణశిక్ష విధించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ కేసు విచారణ ముగిసింది. అయితే ఈ కేసులో తీర్పును ప్రకటించడానికి చాలాసార్లు నోటీసు ఇచ్చినప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు శుక్రవారం తుది తీర్పు వెలువడింది. ఈ తీర్పును ప్రత్యేక న్యాయమూర్తి ఏఆర్ పటేల్ (A R Patel) తీర్పును వెలువరించారు.