
Devotees Throw Fire At Each Other: భారత్ విభిన్న మాతాలు, ఆచార సంప్రదాయాలు, సంస్కృతులకు పుట్టినిల్లు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కో వేడుకను ఒక్కో విధంగా జరుపుకుంటారు. చాలా కాలం నుంచి వస్తున్న ఆచారసాంప్రదాయాలను మరిచిపోకుండా జరుపుకుంటుంటారు. ఇదే క్రమంలో కర్నాటకల ఓ జాతర సందర్భంగా అక్కడి భక్తులు ఒకరిపై ఒకరు నిప్పుల వర్షం కురిపించుకున్నారు. భగభగ మండే కాగడాలు విసురుకున్నారు. ఇదేదో ఫైటింగ్ సీన్ కాదు.. అక్కడి ప్రజలు ఇప్పటికీ అనుసరిస్తున్న తమ సాంప్రదాయమని చెబుతున్నారు. భక్తులు ఒకరిపై ఒకరు మండుతున్న కాగడాలు విసురుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వివరాల్లోకెళ్తే.. కర్నాటకలోని కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జాతరలో భగభగ మండే కాగడాలు విసురుకుంటూ ఆడుతారు. ఇక్కడి ఆచారంగా భావించే ఈ ఆగ్ని క్రీడలో గాయాలైన భక్తులు వైద్యం చేయించుకోకుండా.. గాయాలపై కుంకుమ నీళ్లు చల్లుకుంటారు. ఏప్రిల్ 22న కటీల్‌లోని శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయంలో 'తూత్తేధార' లేదా 'అగ్ని ఖేళి' అనే క్రీడను జరుపుకున్నారు అక్కడి భక్తులు. దీనిలో భాగంగా భగభగ మండుతున్న కాగడాలు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. జాతరలో ఒళ్లు గగురుపొడిచేలా నిలిచిన ఈ ఘటనకు సంబంధించి అక్కడి ప్రజలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇక్కడి ప్రజలు పాటిస్తున్న ఆచారంలో భాగంగానే 'తూత్తేధార' లేదా 'అగ్ని ఖేళి' అనే క్రీడను జరుపుకుంటామని తెలిపారు. కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలు గమనిస్తే.. భక్తులు కేవలం వట్టి ఛాతీ, ధోతీ ధరించిన ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించుకున్నారు.
కొంతమంది దీనిని "సాహస క్రీడ" అని అభివర్ణించారు. మరికొందరు ఈ ఆచారం ప్రమాదకరమైనదనీ, అనేక మందిని తీవ్రంగా గాయపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దుర్గాపరమేశ్వరి ఆలయంలో 'తూత్తేధార' లేదా 'అగ్ని ఖేళి' అనే క్రీడను ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. ఇక్కడ జరిగే 8 రోజుల జాతరలో రెండవ రోజున దీనిని నిర్వహిస్తారు. ఈ ఉత్సవం మేష సంక్రాంతి రోజు ముందు రోజు రాత్రి ప్రారంభమవుతుంది. దానిలో భాగంగా అనేక నేపథ్య ప్రదర్శనలు జరుగుతాయి. వీడియోలో కనిపించే కాగడాలు.. తాటి పత్రాలు, కర్రలతో చేసినవి. వాటికి నిప్పంటించి.. భక్తులు వాటిని ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఇందులో పాల్గొనే భక్తులు రెండు సమూహాలుగా విడిపోతారు. ఈ రెండు గ్రూపులు కొద్దిగా దూరంలో ఉండి మండుతున్న కాగడాలను విసురుకుంటారు. ఒక్కొక్కరు ఐదుకు పైగా కాగడాలను విసురుతారు.
అగ్నిప్రియ దుర్గాపరమేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి ఉద్దేశించిన సంకేత సంజ్ఞగా దీనిని ఇక్కడివారు జరుపుకుంటారు. చాలా కాలం నుంచి జరుగుతున్న ఈ జతర వేడుకల్లో ఇప్పటివరకు కూడా ఎలాంటి దుర్ఘటన చోటుచేసుకోలేదనీ, ఈ పండుగ వల్ల ఎలాంటి గాయాలు జరగలేదని చెబుతున్నారు. సుదూర గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఇందులో పాల్గొంటారని పేర్కొంటున్నారు. దుర్గాపరమేశ్వరి ఆలయం నందిని నదిలో ఒక ద్వీపం మధ్యలో ఉంది. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఈ ఆలయం కటీల్‌లోని అతి పురాతనమైనది.