హంగ్ వస్తే కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్ ఎటు వైపు...

By pratap reddyFirst Published Jan 24, 2019, 3:32 PM IST
Highlights

ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 63 లోకసభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రాల్లోని బలమైన మూడు పార్టీలు బిజూ జనతా దల్, వైఎస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. 

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపాలని కంకణం కట్టుకున్న ప్రతిపక్షాలు ఇటీవల కోల్ కతాలో భారీ ర్యాలీతో తమ ఐక్యతను చాటుకున్నారు. ఈ ర్యాలీలో 20 పార్టీల నుంచి 25 మంది నాయకులు పాల్గొన్నారు. ఇటువంటి ఐక్యతా ప్రదర్శన బహుశా దేశంలో ఇదే మొదటిసారి. 

ఇదే సమయంలో మూడు ప్రధానమైన ప్రాంతీయ పార్టీలను విస్మరించడానికి వీలు లేదు. ఈ మూడు ఎన్డీయేతర పార్టీలు ఆ ర్యాలీకి దూరంగా ఉన్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 63 లోకసభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రాల్లోని బలమైన మూడు పార్టీలు బిజూ జనతా దల్, వైఎస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. 

హంగ్ లోకసభ వస్తే ఈ మూడు పార్టీలు కీలకమైన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఈ మూడు పార్టీలు కూడా ప్రస్తుతానికి తటస్థంగానే ఉన్నాయి. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందా, లేదా అనే విషయాన్ని ఈ మూడు పార్టీలే నిర్ణయించే అవకాశం ఉంది. 

బిజెడీ 1997లో ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా కాంగ్రెసు పార్టీని బలపరచలేదు. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడంతో 1998 ఎన్నికల్లో బిజెడి 9 సీట్లు గెలుచుకోగా, బిజెపికి 7 సీట్లు వచ్చాయి. ఇరు పార్టీల మధ్య దోస్తీ 2009 వరకు పటిష్టంగా కనిపించింది. 2009 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో బిజెడి 145 అసెంబ్లీ స్థానాల్లో 103 స్థానాలను, 21 లోకసభ స్థానాల్లో 14 సీట్లను గెలుచుకుంది. అప్పటి నుంచి బిజెడి కాంగ్రెసు, బిజెపిలకు దూరంగా ఉంటూ వస్తోంది. 

అయితే, బిజెపిపై అవిశ్వాస తీర్మానం సభ ముందుకు వచ్చినప్పుడు బిజెడి వాకౌట్ చేసింది. ఒడిశా కోసం ప్రధాని మంచి పనులు చేశారని ప్రశంసించింది. ఒకేసారి ఎన్నికల బిజెపి ప్రతిపాదనను సమర్థించింది. ఈ స్థితిలో బిజెడి తటస్థంగా ఉందని చెప్పలేమనే మాట వినిపిస్తోంది. 

వచ్చే లోకసభ ఎన్నికల్లో బిజెడి రాష్ట్రంలోని 21 స్థానాలను గెలుచుకుంటుందని ప్రీ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. ఒక వేళ హంగ్ లోకసభ ఏర్పడితే నవీన్ పట్నాయక్ బిజెపికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని అంచనాలు వేస్తున్నారు.  లేదంటే తటస్థంగా ఉండవచ్చునని అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు కోసం కాంగ్రెసు పార్టీ తీవ్రంగానే ప్రయత్నించినట్లు చెబుతారు. అయితే, కాంగ్రెసు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో వైఎస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు వైపు వెళ్లే అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో వైఎస్సార్ కాంగ్రెసు రాష్ట్రంలో పుంజుకుందని అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలోని 25 లోకసభ స్థానాల్లో వైసిపి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. 

ఎన్నికలకు ముందు బిజెపితో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. క్రైస్తవులు, దళితులు, ముస్లింలు ప్రస్తుతం వైసిపి వైపు ఉన్నట్లు చెబుతున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఆ వర్గాల మద్దతు పోతుందని వైసిపి భావిస్తోంది. అందువల్ల అది ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఎన్నికల తర్వాత అవసరమైతే కేంద్రంలో బిజెపికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల్లో కనీసం 15 సీట్లను కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు కేసీఆర్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ స్థితిలో అవసరమైతే కేసీఆర్ బిజెపికి మద్దతు ఇస్తారా, లేదా అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

ఈ మూడు కీలకమైన పార్టీల కారణంగా బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ మూడు పార్టీలు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ప్రతిపక్షాలకు దూరంగా ఉండడమే బిజెపికి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. 

click me!