
తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని.. సొంత తమ్ముడినే అక్క చంపించింది. సదరు యువతి సినీ నటి కావడం గమనార్హం. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇదం ప్రేమమ్ జీవనమ్, ఒందు గంటేయ కథ(ఒక గంట కథ) సినిమాల్లో ప్రేక్షకులముందుకు వచ్చిన నటి శనయా కాట్వే. ఆమెకు కొంత కాలం క్రితం సెలబ్రెటీ మేనేజర్ గా పనిచేస్తున్న నియాజ్ అహ్మద్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో.. అతనితో కలిసి తిరగడం మొదలుపెట్టింది.
అయితే.. వీరి ప్రేమను శనయా కాట్వే సోదరుడు రాకేష్ వ్యతిరేకించాడు. తడికి దూరంగా ఉండమని పదే పదే నచ్చజెప్పాడు. దీంతో ఇతడు తమ ప్రేమకు అడ్డొచ్చేలా ఉన్నాడని శనయా, ఆమె ప్రియుడు నియాజ్ ఆందోళన చెందారు. అతడిని అడ్డు తొలగించాలని స్కెచ్ వేశారు.
అనుకున్నట్లుగానే నియాజ్ అహ్మద్, అతడి అనుచరులు రాకేష్‌ను దారుణంగా చంపేసి, శవాన్ని కారులో దాచిపెట్టారు. కానీ ఆ కారులో నుంచి దుర్వాసన వస్తే పోలీసులకు దొరికిపోతామని భయపడిపోయారు. దీంతో రాకేష్ శవాన్ని తల, మొండెం, కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా కోసి హుబ్బళిలోని తదితర ప్రాంతాల్లో విసిరేశారు.
కానీ రాకేష్ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడు నియాజ్ అని ఇట్టే గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. ఈ హత్య కేసులో హీరోయిన్‌కు కూడా సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది