స్వతంత్ర ఎంపీ, సినీ నటి నవనీత్ రాణాకు బీజేపీ టికెట్ కేటాయించింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఆమెను బరిలోకి దిపింది. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ అమరావతి విభాగం వ్యతిరేకించింది.
సినీ నటి, ఎంపీ నవనీత్ రాణాకు బీజేపీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి బరిలోకి దింపింది. ఆమె ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్నారు. దర్యాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడేతో ఆమె తలపడనున్నారు. వాస్తవానికి రాణా పేరును అమరావతి బీజేపీ విభాగం వ్యతిరేకించింది. ఆమెకు టికెట్ కేటాయించకూడదని ఆ పార్టీ సభ్యులు మంగళవారం అర్థరాత్రి ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిశారు.
కానీ దేవేంద్ర ఫడ్నవీస్.. ఆమెకు టిక్కెట్ ఇవ్వడానికే మొగ్గు చూపారు. నవనీత్ రాణా ఐదేళ్ల పోటా లోక్ సభలో బీజేపీ కోసం పని చేశారని వారం రోజుల కిందట చెప్పారు. కాగా.. ఇప్పుడు ఆమె పోటీ చేస్తున్న అమరావతి లోక్ సభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. అయితే ఆమె కుల ధృవీకరణ పత్రాన్ని కొట్టివేస్తూ బాంబే హైకోర్టు కొంత కాలం కిందట తీర్పు ఇచ్చింది. దీనపై ఆమె అప్పీలుకు వెళ్లగా.. సుప్రీంకోర్టు ఏప్రిల్ 1న విచారించ జరగనుంది.
ఇదిలా ఉండగా.. శివసేన (యూబీటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నివాసం మాతోశ్రీ ముందు ఆమె, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణా హనుమాన్ చాలీసా పఠించనున్నట్లు ప్రకటించడంతో వార్తల్లో నిలిచారు. తర్వాత ఠాక్రే హిందుత్వ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారంటూ భార్యాభర్తలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో అప్పట్లో ఆమె తరచూ వార్తలో ఉండేవారు.
అయితే వాస్తవానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాణాను అనుకున్నారు. కానీ పొత్తు చర్చల సమయంలో ఈ సీటు పాత శివసేనకు వెళ్లింది. తరువాత జరిగిన పరిణామాల వల్ల బీజేపీ శివసేన విడిపోయాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రెండేళ్ల కిందట మారిన రాజకీయ పరిణామల వల్ల శివసేన రెండుగా విడిపోయింది.
ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొంత కాలం తరువాత ఎన్సీపీలోని అజిత్ పవర్ వర్గం కూడా ఈ రెండు పార్టీలో కలిసి ప్రభుత్వంలో చేరింది. అయితే ఈ సారి శివసేన (యూబీటీ) వర్గంతో బీజేపీకి పొత్తు లేకపోవడం వల్ల అమరావతి టికెట్ నవనీత్ రాణాకు కేటాయించారు.