సీఎం తనయుడు ఓడిపోవడం పక్కా: తేల్చేసిన ఎగ్జిట్ పోల్ రిజల్స్ట్

By Nagaraju penumalaFirst Published May 21, 2019, 9:11 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తున్న షాక్ లతో ఎప్పుడు తన ప్రభుత్వం ఎలా ఉంటుందో చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్న కర్ణాటక సీఎం కుమారస్వామికి మరో తలనొప్పి వచ్చి పడిందట అది కుమారుడి రూపంలో. 
 

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తున్న షాక్ లతో ఎప్పుడు తన ప్రభుత్వం ఎలా ఉంటుందో చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్న కర్ణాటక సీఎం కుమారస్వామికి మరో తలనొప్పి వచ్చి పడిందట అది కుమారుడి రూపంలో. 

కుమారుడు నిఖిల్ ఓడిపోతారంటూ వస్తున్న సర్వేలు ఆయనకు మింగుడుపడటం లేదు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాండ్యా నుంచి ఆయన తనయుడు నిఖిల్ పోటీ చేశారు. సినీనటుడు, మాజీ ఎంపీ అంబరీష్ మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన భార్య, సినీ నటి సుమలత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. 

కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఈ స్థానంపై కన్నేసిన జేడీఎస్ ఏకంగా సీఎం కుమారస్వామి తనయుడునే రంగంలోకి దింపారు. ఇద్దరూ సినీనటులే కావడం, ఒకేసారి రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఫలితంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. 

మాండ్యా ఫలితంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కర్ణాటక సీఎం కుమార స్వామికి చేదు వార్తను అందించాయి. న్యూస్9-సీఓటర్ సర్వేలు సుమలతకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం రేపుతోంది. 

మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి సుమలత గెలిచే అవకాశముందని ఈ సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌లో అంచనా వేయడంతో జేడీఎస్ శిబిరంలో ఆందోళన నెలకొంది. దళిత ఓట్లలో కొన్ని, మహిళల ఓట్లు, మైనార్టీ గ్రూప్స్ ఓటర్లు సుమలత వైపు మెుగ్గు చూపారని ఆమెకే ఓటు వేశారని సీ ఓటర్స్ తన సర్వేలో స్పష్టం చేసింది. 

దీంతో మాండ్యా లోక్‌సభ స్థానం ఫలితం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ కర్ణాటకలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. న్యూస్ 9-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై సరికొత్త చర్చ మెుదలైంది. మాండ్య నుంచి సీఎం తనయుడు ఓడిపోతాడని స్పష్టం చేసిన సర్వే, కల్బుర్గి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే సైతం ఓడిపోతారంటూ చెప్పుకొచ్చింది. 

కర్ణాటకలో బీజేపీ 18 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని అలాగే కాంగ్రెస్ 7, జేడీఎస్ 2 చోట్ల గెలిచే అవకాశం ఉందని తెలిపింది. న్యూస్9-సీఓటర్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లో ఆందోళన మెుదలైంది. ఎప్పుడు ఫలితాలు విడుదల అవుతాయా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

click me!