దొరికినంత దోచుకున్నరు.. ప్రమాదానికి గురైన కారు నుంచి లిక్కర్ బాటిళ్లు ఎత్తుకెళ్లిన జనం.. వీడియో వైరల్..

By Asianet NewsFirst Published Nov 1, 2023, 2:22 PM IST
Highlights

మద్యం తరలిస్తున్న వాహనం ప్రమాదానికి గురైతే.. స్థానికులు అందులో ఉన్న బాటిళ్లను ఎత్తుకెళ్లారు. కారులో ఉన్న వ్యక్తులు పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

అక్రమంగా విదేశీ మద్యం (foreign liquor) తరలిస్తున్న ఓ వాహనానికి ప్రమాదం జరిగింది. వెంటనే అందులో ఉన్న వారిని కాపాడేందుకు అక్కడికి జనం పరిగెత్తారు. అయితే తాము ఎక్కడ దొరికిపోతామేమో అనే భయంతో అప్పటికే కారులో ఉన్న వారు పారిపోయారు. అక్కడికి వెళ్లిన జనానికి కారు నిండి విదేశీ మద్యం కనిపించింది. ఇంకేముంది చేతిలో పట్టినన్ని బాటిళ్లను తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. కొన్నేళ్లుగా మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ లో ఈ విచిత్ర ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ లోని గయ జిల్లాలో సోమవారం (అక్టోబర్ 30) ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గయ నుంచి ధోబీ-ఛత్రా వెళ్లే జాతీయ రహదారి 99లోని ఛత్రా మలుపు వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. కారు నిండా విదేశీ తయారీ మద్యం ఉన్నాయి. కారులో ఉన్న వారిని కాపాడేందుకు జనం పరుగులు తీశారు. కానీ మద్యం నిషేధం అమలో ఉన్న నేపథ్యంలో తాము దొరికిపోకూడదనే ఉద్దేశంతో కారులో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. 

शराबबंदी!

बिहार के गया में कार का एक्सीडेंट हुआ, कार में शराब भरी हुई थी. फिर लोगों ने क्या किया, देखिए. pic.twitter.com/F6qvY1Nm3a

— Utkarsh Singh (@UtkarshSingh_)

అయితే కారు దగ్గరికి వెళ్లిన జనం డోర్లు ఓపెన్ చేసి చూశారు. దీంతో వారికి సీన్ మొత్తం అర్థం అయ్యింది. ఇంకేముంది కారులో ఉంచిన మద్యం బాటిళ్లను తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. వీరిని చూసి, అటుగా వెళ్లే వాహనదారులు కూడా బాటిళ్లను తీసుకెళ్లారు. దీనిని అక్కడున్న పలువురు వీడియో తీశారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది. 

ఈ వీడియోలు చూసిన స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు. మద్యం రవాణా చేస్తున్న వ్యక్తులు, వాటిని ఎత్తుకెళ్లిన వ్యక్తులపై కూడా చర్యలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. బీహార్ లో మద్య నిషేధం అమలులో ఉంది. రాష్ట్రంలో మద్యం అమ్మకం, వినియోగం రెండూ శిక్షార్హమైన నేరం. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మద్యపాన నిషేధం రాష్ట్రంలో ఆ నిషేధం అమలు తీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

click me!