నాలుగేళ్ల చిన్నారినపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎప్పటిలాగే స్కూల్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో వ్యాన్ పార్క్ చేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ప్రస్తుత సమాజంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువయ్యింది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. కామంతో కళ్లు మూసుకుపోయి సొంత వాళ్లే చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొందరు చిన్నారులు స్కూల్ లో సిబ్బందితో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఇలాంటి ఘటనే జరిగింది.
నర్సరీ చదివే చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని బాధితురాలు తల్లికి వివరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ లోని ఓ కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఆ బాలిక తన కాలనీకి దూర ప్రాంతంలో ఉన్న స్కూల్ లో నర్సరీ చదువుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ప్రతీ రోజు చిన్నారిని స్కూల్ కు తీసుకెళ్లి, తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఓ వ్యాన్ ను మాట్లాడుకున్నారు.
ఆ వ్యాన్ డ్రైవర్ ప్రతీ రోజు ఉదయం 11:30 గంటలకు బాలికను తీసుకెళ్లి సాయంత్రం 5:30 గంటలకు ఇంటికి డ్రాప్ చేసేవాడు. ఎప్పటిలాగే బుధవారం కూడా బాలికను ఇంట్లో నుంచి తీసుకెళ్లి స్కూల్ కు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి తీసుకువచ్చేందుకు వ్యాన్ లో ఎక్కించుకున్నాడు. కానీ ఓ నిర్మానుష్య ప్రదేశంలో వ్యాన్ ను పార్క్ చేసి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అనంతరం ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. దీంతో బాధితురాలు తల్లికి జరిగిన విషయం చెప్పింది. వ్యాన్ డ్రైవర్ తనపై జరిపిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతో చిన్నారిని తల్లి మరుసటి రోజు ఉదయం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. దీంతో బాలికపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని ఆమె ధృవీకరించారని ఏసీపీ తుషార్ సింగ్ తెలిపారు.
అనంతరం తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. నిందితుడైన సుమిత్ కశ్యప్ పై ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారని ‘టైమ్ప్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. అతడిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. కశ్యప్ కు చెందిన వ్యాన్ ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం సీజ్ చేశారు.