మూఢత్వానికి మహిళ బలి.. దెయ్యం విడిపిస్తానని తాంత్రికుడి చిత్రహింసలు.. వివాహిత మృతి

By Asianet News  |  First Published Oct 25, 2023, 7:54 AM IST

దెయ్యం వదిలిస్తానని చెప్పి ఓ తాంత్రికుడు వివాహితపై దారుణ చేష్టలకు ఒడిగట్టాడు. ఆమెను చిత్రహింసలు పెట్టాడు. మెడపై కాళ్లు పెట్టి తొక్కడంతో పాటు పైపుతో దాడి చేశాడు. దీంతో బాధితురాలు మరణించింది. ఈ ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది.


దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. సాంకేతికంగా ఎంతో ముందుకెళ్తోంది. టెక్నాలజీ పల్లెల్లోకి చేరింది. సప్త సముద్రాల దాటి ఉన్న వ్యక్తితో ఉన్న చోటు నుంచే క్షణాల్లో మాట్లాడగలుగుతున్నారు. ప్రపంచంలోని నలుమూలలకు విమానాల్లో వెళ్లగలుగుతున్నారు. కానీ దేశంలో ఇంకా మూఢనమ్మకాలను సమూలంగా నిర్మూలించలేకపోతున్నారు. మన దేశంలోని అనేక పల్లెల్లో ఈ మూఢనమ్మకాలు ఎప్పటికీ వెళ్లూనుకొని ఉంది. అమాయక ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకొని కొందరు తాంత్రికుల అవతారం ఎత్తుతున్నారు. దెయ్యాలు, భూతాలను విడిపిస్తామని చెప్పి క్యాష్ చేసుకుంటున్నారు. కొన్ని సార్లు వీళ్లు చేసే పనులు మనుషుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి.  తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 

ఓ మహిళకు దెయ్యం పట్టిందని, దానిని విడిపిస్తానని చెప్పి ఓ తాంత్రికుడు ఆమెను చిత్ర హింసలకు గురి చేశాడు. దీంతో బాధితురాలు మరణించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటావా జిల్లాలోని  పత్వారియా ప్రాంతానికి చెందిన ప్రియా సక్సేనాకు ఆరు సంవత్సరాల కిందట ఓ వ్యక్తి పెళ్లి జరిగింది. కొంత కాలం తరువాత భర్తతో విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె భర్తతో విడిపోయి, వేరేగా ఉంటోంది. 

Latest Videos

కొన్ని రోజుల కిందట ఆమెకు ఆరోగ్యం చెడిపోయింది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింది. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లి, వారితో కలిసి జీవించడం మొదలుపెట్టింది. ఈ మధ్య కాలంలో ఆ కుటుంబానికి ఓ తాంత్రికుడితో పరిచయం ఏర్పడింది. వారి కుటుంబం గురించి అతడు పూర్తి తెలుసుకున్నాడు. ప్రియ పరిస్థితిని అర్థం చేసుకొని, ఆ కుటుంబానికి మాయమాటలు చెప్పాడు. ప్రియకు దెయ్యం ఆవహిచిందని, తాను దానిని వదిలిస్తానని ఆ కుటుంబ సభ్యులతో చెప్పాడు. 

కొన్ని రోజుల నుంచి ప్రియకు ఎదురవుతున్న కష్టాలను చూసిన ఆ కుటుంబ సభ్యులు తాంత్రికుడి మాటలు నమ్మారు. హోమం చేయాల్సి ఉంటుందని చెప్పడంతో శనివారం ఆ ఇంట్లోనే దానికి ఏర్పాట్లు చేశారు. ఏవో మంత్రాలు చదువుతూ తాంత్రికుడు హోమం పూర్తి చేశాడు. తరువాత ప్రియను చిత్రహింసలు పెట్టాడు. ఆమె మెడపై కాళ్లు పెట్టి తొక్కాడు. తరువాత ఓ వైపుతో బలంగా చితకబాదాడు. ఈ హింసతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. వారం రోజుల్లో ఆమె సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి అక్కడి నుంచి తాంత్రికుడు వెళ్లిపోయాడు. 

ఆదివారం ఉదయం కూడా ప్రియ లేవలేదు. దీంతో తాంత్రికుడిని మళ్లీ పిలిపించారు. అతడు వచ్చి ప్రియను పరీక్షించాడు. కొంత సమయం తరువాత ప్రియ మామూలు మనిషి అవుతుందని నమ్మించి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే ఎంత సమయం గడిచినా.. బాధితురాలు లేవకపోవడంతో ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నారు. అనంతరం బాధిత కుటంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయం అంతా చెప్పి, తాంత్రికుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

click me!