
న్యూఢిల్లీ: హర్యానా(Haryana) ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme Court)లో ఊరట లభించింది. ప్రైవేటు రంగం(Private Sector)లోని ఉద్యోగా(Jobs)ల్లో స్థానికుల(Locals)కు 75 శాతం రిజర్వేషన్లు(Reservations) ఇవ్వాలని తెచ్చిన చట్టం గురించి ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు విధించిన స్టే ఆదేశాలను తోసిపుచ్చింది. అయితే, ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవద్దనీ ప్రభుత్వానికి సూచించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను వేగంగా విచారించాలని హైకోర్టును ఆదేశించింది. నాలుగు వారాల్లో తీర్పు వెలువరించాలని స్పష్టం చేసింది. అయితే, ఈ పిటిషన్‌లోని పార్టీలూ వాయిదాలు అడగవద్దని పేర్కొంది.
హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టార్ ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో హర్యానా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ 2020ని పాస్ చేసింది. ఈ చట్టం జనవరి 15వ తేదీన అమల్లోకి వచ్చింది. ప్రైవేటు రంగంలో రూ. 30వేల కంటే తక్కువ జీతాలు గల ఉద్యోగాల్లో రాష్ట్రంలోని నిరుద్యోగులకు 75 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈ చట్టం చెబుతున్నది. ఈ చట్టం ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగాలు పొందడానికి దోహదపడుతుందని హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతలా అన్నారు.
అయితే, ఈ చట్టంపై ప్రైవేటు కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. తమకు అవసరమైన నైపుణ్యాలు గలవారిని ఉద్యోగాల్లో నియమించుకుంటామని, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు పెట్టడం సరికాదని వాటి వాదన. ఈ వాదనతోనే హర్యానా ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ వేశాయి. ఈ పిటిషన్ విచారిస్తూ ఈ చట్టం సహజ న్యాయానికి విరుద్ధంగా ఉన్నదని హైకోర్టు పేర్కొంది. అనంతరం చట్టం అమలుపై స్టే విధించింది. ఈ స్టేను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టులో తమ వాదనలు వినకుండానే చట్టం అమలుపై స్టే విధించారని హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. విచారణ మొదలైన 90 సెకండ్లలోనే స్టే విధించారని, తమ తరఫు న్యాయవాది వాదనలు వినలేదని పేర్కొంది. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు స్టే విధించడానికి సరైన కారణాలను పేర్కొనలేదని, అందుకే స్టే ఎత్తేస్తున్నట్టు తెలిపింది. ఈ కేసులోని అంశాల న్యాయాన్ని తాము పరిశీలించడం లేదని వివరించింది. వాదనలు పూర్తిగా వినాలని, వేగంగా విచారించి నాలుగు వారాల్లో ముగించాలని హైకోర్టును ఆదేశించింది. అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యాలపై హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలు విధించవద్దని పేర్కొంది. ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఉండే అవకాశాన్నీ అవి వినియోగించుకునే వీలును ఇవ్వాలని తెలిపింది.
నెలవారి జీతం 30వేల లోపు తీసుకునే ఉద్యోగాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రైవేటు కంపెనీలు, ట్రస్టులు, భాగస్వామ్యం కింద నిర్వహించే కంపెనీలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఇందులో 30వేల జీతంలోపు ఉండే ఉద్యోగాలకు ఈ చట్టం అమలు అవుతుంది. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఈ ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలకు ఈ నిబంధనలు వర్తించవు.
కాగా, ఈ చట్టంపై ప్రైవేటు కంపెనీలు అగ్గిమీద గుగ్గిళం అవుతున్నాయి. ఇది రాజ్యాగానికే విరుద్ధమైన చట్టం అని వాదిస్తున్నాయి. ఒక వ్యక్తి ఏ రాష్ట్రంలోనైనా ఉపాధి వెతుక్కునే హక్కు కలిగి ఉంటాడని చెబుతున్నాయి. అంతేకాదు, కంపెనీలకు, వాటి యాజమాన్యాలకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులనూ కాలరాస్తున్నదని అంటున్నాయి. ఇలాంటి చట్టాలు కంపెనీల మధ్య పోటీతత్వాన్ని దెబ్బతీస్తాయని, ఈ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని హర్యానాలోని పారిశ్రామిక సంఘాలు పేర్కొన్నాయి. అందులో భాగంగానే గుర్గావ్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ పంజాబ్, హర్యానా హైకోర్టులో ఓ పిటిషన్ వేసింది.