
Assam Floods: అసోం రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అసోంలోని పలు ప్రాంతాల్లో వరదలు వరదలు పోటెత్తుతున్నాయి. దాంతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మరణించారు.
అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అందించిన నివేదికల ప్రకారం, రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 395 గ్రామాలు తీవ్ర వరదల్లో చిక్కుకున్నాయి. ఊర్లకు ఊర్లే చెరువులుగా మారిపోవడంతో వేలాది మంది వరదల్లో చిక్కుకుపోయారు. FRIMS విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 12 జిల్లాలు బజలి, బార్‌పేట, బిస్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, గోల్‌పరా, జోర్హాట్, కమ్రూప్, లఖింపూర్, నల్బరీ, సోనిత్‌పూర్, తముల్‌పూర్ లలో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో వరదలు పోటెత్తుతున్నాయి. వరదల కారణంగా దాదాపు 65 వేల జంతువులు కూడా ప్రభావితమయ్యాయి.
ఏజెన్సీ విడుదల చేసిన నివేదికలో.. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటివరకు మొత్తం ఏడుగురు మరణించారని తెలిపింది. 5 జిల్లాల్లో మొత్తం 5 వైద్య బృందాలను మోహరించారు. వరదల కారణంగా మొత్తం 12 జిల్లాల్లో 82,000 మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమతున్నారు. అయితే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిలో స్వల్ప మెరుగుదల ఉంది.
అదే సమయంలో వరదల కారణంగా బార్‌పేట జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రధానంగా అస్సాంలోని బార్‌పేట జిల్లాలో పరిస్థితి భయంకరంగా మారింది. బార్‌పేట జిల్లాలోని 93 గ్రామాలలో 67,000 మంది ప్రజలు ప్రభావితులయ్యారు. ASDMA నివేదిక ప్రకారం.. బార్‌పేట జిల్లాలో ప్రస్తుతం 225 హెక్టార్ల పంట భూమి మునిగిపోయింది. జిల్లాలో గత రెండు రోజుల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.