
న్యూఢిల్లీ: 62 ఏళ్ల వృద్ధుడు పింఛన్ పొందడానికి వెరిఫికేషన్ చేసుకోవడానికి గంటలతరబడి క్యూ లైన్‌లో నిలబడ్డాడు. అతని వంతు రాకముందే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికులను కదిలించింది. జమ్ము కశ్మీర్‌లోని బందిపొరాలో సోషల్ వెల్ఫఏర్ ఆఫీసులో మంగళవారం చోటుచేసుకున్నట్టు అధికారులు శ్రీనగర్‌లో తెలిపారు.
జమ్ము కశ్మీర్‌లో పెన్షన్ ప్రాసెస్ ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్ మోడ్‌కు షిఫ్ట్ అయిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా వయోధికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పెన్షన్‌ను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. వేలాది మంది వృద్ధులు ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టే పరిస్థితి వారు ఎదుర్కొంటున్నారు.
బందిపొరా మలంగమ్ నివాసి 62 ఏళ్ల సొనౌల్లా భట్ పింఛన్ పొందడానికి తన డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉన్నది. అందుకోసమే మంగళవారం ఉదయమే ఆయన తెహసీల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసుకు వెళ్లిపోయాడు. అక్కడ తన వంతు కోసం ఎదురుచూశాడని అధికారులు తెలిపారు. కానీ, తన వంతు రావడానికి ముందే ఆయన చనిపోయాడు. ఆయన మరణానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.
Also Read: ఈ రెండు ప్లాన్‌లు సీనియర్ సిటిజన్‌లకు కష్ట కాలంలో ఆసరా అవుతాయి.. ప్రతినెలా పెన్షన్ రావడం ఖాయం..
వృద్ధులకు పింఛన్ అందించడంపై మానవత్వ విలువలతో పని చేయాలని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి. భట్ మరణంపై సీపీఐ నేత మొహమ్మద్ యూసుఫ్ తరిగామి తీవ్ర కలత చెందారు. పింఛన్ ప్రాసెస్ మొత్తం సింప్లిఫై చేయాలని డిమాండ్ చేశారు.వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, ఇతర లబ్దిదారులు తమ పేరును ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం దర్భరంగా మారిందని ఆయన తెలిపారు. అంత్యత శీతలంలోనూ వారు గంటలపాటు క్యూ లైన్‌లలో కూర్చోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. అందుకే ఈ బలహీన వయోధికులు బాధాకరమైన మరణానికి గురయ్యాడని వివరించారు. భట్ కుటుంబానికి వెంటనే సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.