వ్యాక్సిన్ కి భయపడుతున్న ప్రజలు.. కారణం ఇదే..

By telugu news teamFirst Published Jan 26, 2021, 3:04 PM IST
Highlights

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు విముఖత చూపుతున్న వారి సంఖ్య మూడు వారాల్లో 69 శాతం నుంచి 60 శాతానికి తగ్గిందని లోకల్‌సర్కిల్స్‌ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. 


కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు నానా అవస్థలు పడ్డాయి. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే.. ఎట్టకేలకు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో.. ప్రజలు సంతోషంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సింది పోయి.. వ్యాక్సిన్ పేరు  చెబితేనే భయపడిపోతున్నారు. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి పెద్దగా సముఖత కూడా చూపించకపోవడం గమనార్హం.

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు విముఖత చూపుతున్న వారి సంఖ్య మూడు వారాల్లో 69 శాతం నుంచి 60 శాతానికి తగ్గిందని లోకల్‌సర్కిల్స్‌ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. తక్షణమే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రస్తుతం 60 శాతం పౌరులు సిద్ధంగా లేరని ఈ సర్వే తెలిపింది. వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ పట్ల భయాలు, క్లినికల్‌ ట్రయల్స్‌లో ప్రతికూల ఫలితాలు రావడం వంటి పరిణామాలతో గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన సర్వేలో 69 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సానుకూలంగా లేరని వెల్లడైంది.

జనవరి తొలి వారం వరకూ ఈ సంఖ్య అలాగే ఉంది. జనవరి 25 నాటికి వ్యాక్సిన్‌ పట్ల విముఖత చూపేవారి సంఖ్య 60 శాతానికి తగ్గింది. వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌పై స్పష్టత కొరవడటమే వ్యాక్సిన్‌ పట్ల భయానికి ప్రధాన కారణమని సర్వే వెల్లడించింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎలా ఉంటాయనేది తెలియకపోవడంతోనే తాము వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సిద్ధంగా లేమని సర్వేలో పాల్గొన్నవారిలో 59 శాతం మంది వెల్లడించారు.

ఇక వ్యాక్సిన్‌ సామర్థ్యంపై అనిశ్చితితో తాము వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటామని 14 శాతం మంది వెల్లడించారు. ఇక కొవిడ్‌-19 ఏ క్షణంలోనైనా దూరమవుతుందని వ్యాక్సిన్‌ అవసరం లేదని 4 శాతం మంది చెప్పగా, ఇక కొత్తరకం కరోనా వైరస్‌లను ప్రస్తుత వ్యాక్సిన్లు అడ్డుకోలేవని మరో 4 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది.

click me!