బంగాళాఖాతంలో చిక్కుకున్న 600 మంది గంగాసాగర్ యాత్రికులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

By Sumanth KanukulaFirst Published Jan 16, 2023, 4:36 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లో సముద్రంలో దాదాపు 600 మంది గంగాసాగర్ యాత్రికులు చిక్కుకున్నారు. వారు గత రాత్రి నుంచి సముద్రంలోనే ఉన్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

పశ్చిమ బెంగాల్‌లో సముద్రంలో దాదాపు 600 మంది గంగాసాగర్ యాత్రికులు చిక్కుకున్నారు. వారు గత రాత్రి నుంచి సముద్రంలోనే ఉన్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాలు.. మకర సంక్రాంతి సందర్భంగా హుగ్లీ నది బంగాళాఖాతంలో సంగమించే గంగాసాగర్‌లో పెద్ద సంఖ్యలో యాత్రికులు పవిత్ర స్నానం ఆచరిస్తుంటారు. అయితే యాత్రికులు ఆదివారం సాయంత్రం గంగాసాగర్‌కు వెళుతుండగా సముద్రంలో ఆటుపోట్లు, దట్టమైన పొగమంచు కారణంగా వారి పడవలు కక్‌ద్వీప్ సమీపంలో సముద్రంలో చిక్కుకున్నాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పశ్చిమ బెంగాల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకుపోయిన యాత్రికులను రక్షించేందుకు  ఇండియన్ కోస్టు గార్డు రెండు హోవర్‌క్రాఫ్ట్‌లను మోహరించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోస్ట్ గార్డు సిబ్బంది సమన్వయంతో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే యాత్రికులందరూ సురక్షితంగానే ఉన్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఇక, గత కొన్ని రోజుల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రం, దేశం నలుమూలల నుండి 51 లక్షల మంది యాత్రికులు గంగాసాగర్‌ను సందర్శించారని పశ్చిమ బెంగాల్ మంత్రి అరూప్ బిశ్వాస్ తెలిపారు. మరో 10 లక్షల మంది సాగర్ ద్వీపానికి వెళ్తున్నారని చెప్పారు.

click me!