
హనుమాన్ జయంతి ఉత్సవాలను శనివారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలు చాలా చోట్ల సవ్యంగా జరగగా.. కొన్నిచోట్ల మాత్రం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. ఢిల్లీలో చేపట్టిన హనుమాన్ జయంతి ఊరేగింపులో కూడా ఆందోళనకర వాతావరణం చోటు చేసుకుంది.
ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో శనివారం రాత్రి చేపట్టిన హనుమాన్ జయంతి శోభాయాత్రలో ఘర్షణలు జరిగాయి. ఓ వర్గం ఈ ర్యాలీపై రాళ్లు రువ్వడంతో ఇది చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆరుగురు పోలీసు సిబ్బంది, ఓ పౌరుడికి గాయాలు అయ్యాయి. ఈ వివరాలను పోలీసు వర్గాలు వెల్లడించాయి.
గాయపడిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మేధలాల్ మీనా కూడా ఉన్నారు. ఆయన చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే ఆయనని ఎవరు కాల్చారు ? ఎలా కాల్చారు అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, వీడియోలను ఉపయోగించి మరింత మంది అనుమానితులను గుర్తించామని, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
అల్లర్లు, హత్యాయత్నం, ఆయుధ చట్టం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ అధికారులు పది బృందాలను ఏర్పాటు చేశారు.హింసకు సంబంధించిన ప్రాథమిక విచారణ కుట్ర కోణంలో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
శనివారం రాత్రి పలు సున్నిత ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు. 2020లో అల్లర్లను చూసిన సీనియర్ పోలీసు అధికారి సంజయ్ సేన్ ఈశాన్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పుకార్లను తోసిపుచ్చారు. పోలీసులు శాంతిభద్రతలు, సోషల్ మీడియాలో రౌండ్లు చేస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపించామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు, పెట్రోలింగ్‌ను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లోనే ఉండాలని కోరినట్లు ఆయన ఓ మీడియా సంస్థతో తెలిపారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అస్థానా, ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేపేంద్ర పాఠక్‌తో మాట్లాడారు. ఈ విషయాన్ని సున్నితంగా పరిష్కరించాలని కోరారు. విచారణ నివేదిక కాపీని హోం మంత్రిత్వ శాఖకు కూడా పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాళ్ల దాడిని ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. “ ప్రతీ ఒక్కరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని శాంతిని కాపాడాలని విజ్ఞప్తి” అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాంతి లేకుండా దేశం పురోగమించదన్నారు. ప్రతీ ఒక్కరూ శాంతిభద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. అవసరమైతే పోలీసులు, ఏజెన్సీలు ఉన్నాయని, ఇక్కడ శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని చెప్పారు. శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు.