దారుణం : డాక్టర్ల కోసం ఎదురుచూపులు, చివరికి తల్లి చేతుల్లోనే ప్రాణం వదిలిన చిన్నారి

By Siva KodatiFirst Published Sep 1, 2022, 9:41 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కోసం ఎదురుచూసి చివరికి తల్లి చేతుల్లోనే ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 

భారతదేశంలో పేదల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వాసుపత్రులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా అక్కడి వైద్యులు, సిబ్బందిని మాత్రం బాగు చేయలేకపోతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తూ మరో చోట ప్రాక్టీస్ చేసే వైద్యులు ఎందరో. అలాగే సమయానికి విధులకు హాజరుకాకపోవడంతో పాటు సరిగ్గా చికిత్స అందించని ఘటనలు కూడా ఎన్నో. వైద్యుల నిర్లక్ష్య ఫలితంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో వైద్యం అందక ఓ చిన్నారి తల్లి ఒడిలోనే కన్నుమూశాడు. 

వివరాల్లోకి వెళితే.. జబల్‌పూర్ జిల్లాలో వున్న ఓ ప్రభుత్వాసుపత్రికి ఓ తల్లి అనారోగ్యంతో వున్న తన ఐదేళ్ల బిడ్డను తీసుకొచ్చింది. అయితే డాక్లర్లు సమయానికి అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బంది కాసేపు వెయిట్ చేయమని చెప్పారు. దీంతో చేసేది లేక గంటల తరబడి ఆసుపత్రి బయటే తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ఎదురుచూసింది. సమయం గడుస్తున్నా ఒక్క డాక్టర్ కూడా విధులకు హాజరుకాలేదు. చివరికి వైద్యం అందక ఆ పసిబిడ్డ తల్లి చేతుల్లోనే కన్నుమూశాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

దీనిపై చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. తాము ఎంతసేపు ఎదురుచూసినా ఒక్క డాక్టర్ కూడా తన బిడ్డకు వైద్యం చేయలేదని, తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై డాక్టర్‌ను ప్రశ్నించగా.. ముందు రోజు రాత్రి తన భార్య ఉపవాసం వుండటం వల్ల ఆసుపత్రికి రాలేదని సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనతో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. 
 

click me!