నేడే ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు.. నరాలు తెగే ఉత్కంఠ

By sivanagaprasad kodatiFirst Published Dec 11, 2018, 6:36 AM IST
Highlights

రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. తద్వారా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.

రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. తద్వారా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 1.70 లక్షల ఈవీఎంలో నిక్షిప్తమైయున్న అభ్యర్థుల భవితవ్యం తేటతెల్లం కానుంది. ఐదు రాష్ట్రాల్లోనూ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు.

తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఎన్నికలు కేంద్రంలో అధికార బీజేపీకి చావో రేవో అన్నట్లుగా తయారయ్యాయి.. వీటిలో మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని... మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి రావొచ్చు లేదంటే హంగ్ ఏర్పడవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది.

మిజోరంలో అధికార కాంగ్రెస్‌కు, విపక్ష మిజో నేషనల్ ఫ్రంట్‌కు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని జాతీయ మీడియా సంస్థల సర్వేలో వెల్లడైంది.

అయితే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం ప్రజాకూటమిదే విజయం అంటున్నారు. దీంతో తుది ఫలితం కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నానికి అన్ని రాష్ట్రాల్లో విజేతలెవరో..? పరాజితులెవరో తేలిపోతుంది. 

click me!