బెంగాల్, అసోం రాష్ట్రాల్లో వర్షాలు: నలుగురి మృతి, పలువురికి గాయాలు

By narsimha lode  |  First Published Apr 1, 2024, 7:52 AM IST

బెంగాల్, అసాం రాష్ట్రాల్లో  అకాల వర్షాలు  ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి.  
 


న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఆదివారం నాడు  వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలతో  ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.  వర్ష ప్రభావిత ప్రాంతాల్లో బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇవాళ పర్యటించనున్నారు. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని  జల్పాయిగురి జిల్లాలో  తుఫాన్ కారణంగా  భారీ వర్షాలు కురిశాయి.ఈ వర్షాలతో  నలుగురు మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు.

Latest Videos

భారీ వర్షాల కారణంగా గౌహతిలోని  లోక్‌ప్రియ గోపినాథ్‌బోర్డోలోయ్  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సీలింగ్ లో కొంత భాగం కూలిపోయింది.

ఉత్తర బెంగాల్ లో తుపాన్ కారణంగా అనేక ఇళ్ళు దెబ్బతిన్నాయి. బలమైన గాలులతో వర్షం కురిసింది.  జల్పాయిగురి పట్టణంలోని చాలా ప్రాంతాల్లో  వర్షపు నీరు చేరింది.  సమీపంలోని మైనగురిలో కూడ  పలు ప్రాంతాలు నీట మునిగాయి.

ఈశాన్య భారతదేశంలో కూడ  భారీ వర్షాలు,ఈదురుగాలులు వీచాయి. దీంతో  విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాల విషయమై  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో  ఆందోళన వ్యక్తం చేశారు.  వర్షం కారణంగా  ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు మోడీ.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జల్పాయిగురి జిల్లాలో సోమవారంనాడు పర్యటించనున్నారు. విపత్తు కారణంగా  అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఐదుగురు మృతి చెందినట్టుగా  సోషల్ మీడియా వేదికగా సీఎం మమత బెనర్జీ ప్రకటించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.  అధికారులు  వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారని  సీఎం వివరించారు.

భారీ వర్షం కారణంగా గౌహాతి విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పులోకి వర్షం నీరు చేరుకోవడంతో కుప్పకూలినట్టుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని  అధికారులు ప్రకటించారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా గౌహతి నుండి కోల్ కత్తా, త్రిపురకు  ఆరు విమానాలను మళ్లించినట్టుగా గౌహతి విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.

జమ్మూ కాశ్మీర్, లడఖ్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఈ నెల  5వ తేదీ వరకు  వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల  6న  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది.

పంజాబ్, హర్యానా, ఛండీఘడ్ రాష్ట్రాల్లో  కూడ  ఈ నెల  5వ తేదీ వరకు వాతావరణంలో మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. 

పశ్చిమ బెంగాల్, అసాం రాష్ట్రాల్లో  ఆదివారం నాడు ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీని ప్రభావంతో  బెంగాల్ రాష్ట్రంలో  నలుగురు మృతి చెందారు. మరో  70 మందికి పైగా గాయపడ్డారు.  

 

click me!