
గత నాలుగు నెలలుగా ఉద్రిక్త పరిస్ధితులతో అట్టుడుకుతోన్న మణిపూర్‌లో మరో హింసాత్మక ఘటన నెలకొంది. ఉఖ్రుల్ జిల్లా కుక్కీతొవై గ్రామంలో భారీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. లిట్టన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కీతొవైలో కాల్పులు చోటు చేసుకున్నాయి. సమీప గ్రామాలు, అటవీ ప్రాంతంలో పోలీసులు జరిపిన గాలింపు చర్యల్లో 24 నుంచి 34 ఏళ్లు వున్న ముగ్గురు యువకుల మృతదేహాలు లభించాయి. శుక్రవారం తెల్లవారుజామున కుకీతొవై గ్రామంలోకి చొరబడిన దుండగులు.. గ్రామంలో పహారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం సైన్యం, పోలీసులు పహారా కాస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాగా.. మణిపూర్ హింసాకాండ కేసుల విచారణకు ఇద్దరు మహిళా డీఐజీ స్థాయి అధికారులు సహా 53 మంది అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నియమించింది. సీబీఐ నియమించిన అధికారులలో ఇద్దరు మహిళా డీఐజీ స్థాయి అధికారులు, ఒక పురుష డీఐజీ స్థాయి అధికారి, ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్నారు. మే 3 న మణిపూర్ హైకోర్టు రాష్ట్రంలో మెజారిటీ కమ్యూనిటీ అయిన మైతీలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన తరువాత మే 3న మైతీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మంది చనిపోయారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. మణిపూర్ రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. మణిపూర్ ప్రజలకు యావత్ దేశం అండగా నిలుస్తుందన్నారు. "అన్ని వివాదాల పరిష్కారానికి శాంతి ఒక్కటే మార్గం. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంలో శాంతి నెలకొనేలా కేంద్రం, మణిపూర్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి" అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
కాగా, ఈ నెల ప్రారంభంలో లోక్ సభలో మణిపూర్ హింసపై మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో మూడు నెలలుగా కొనసాగుతున్న హింసాకాండకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. 'వచ్చి చర్చలు జరపండి. ఇరువర్గాలు కేంద్రంతో కూర్చుని మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. జనాభాను మార్చాలని మేం కోరుకోవడం లేదు. హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదు. రాష్ట్రంలో శాంతిని తీసుకొస్తాం. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని" అమిత్ షా అన్నారు.