2జీ స్పెక్ట్రం కేసు: ఆగ్రహించిన కోర్టు...15 వేల మొక్కలు నాటాలంటూ శిక్ష

By Siva KodatiFirst Published Feb 8, 2019, 8:40 AM IST
Highlights

మాటికి మాటికి గడువు అడుగుతున్న ప్రతివాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు వారికి 15 వేల మొక్కలు నాటాల్సిందిగా శిక్ష విధించింది. 

మాటికి మాటికి గడువు అడుగుతున్న ప్రతివాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు వారికి 15 వేల మొక్కలు నాటాల్సిందిగా శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే... దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో కేంద్ర మాజీ టెలికాం మంత్రి ఏ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేలుస్తూ 2017 డిసెంబర్ 21న ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెల్లడించింది.

అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ 2018 మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ అప్పీల్‌పై తమ స్పందన తెలియజేయాల్సిందిగా నిర్దోషులను కోర్టు ఆదేశించింది. వీరిలో ఇద్దరు వ్యక్తులు మూడు కంపెనీలు ఇంతవరకు న్యాయస్థానం ఆదేశాలను పాటించలేదు.

తమకు కొంత గడువు కావాలంటూ స్వాన్ టెలికాం ప్రయివేట్ లిమిటెడ్ ప్రమోటర్ షాహిద్ బల్వా, కుసేగావ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్, డైనమిక్ రియాల్టీ, డీబీ రియాల్టీ లిమిటెడ్, నిహారిక కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో పలుమార్లు న్యాయస్థానాన్ని కోరారు.

తాజాగా గురువారం మరోసారి జరిగిన విచారణలో మరోసారి సమయం కావాలని అడటంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కొక్కరు 3000 మొక్కల చొప్పున 15 వేల మొక్కలు నాటాలని శిక్ష విధించింది. ఫిబ్రవరి 15న అటవీ అధికారుల ఎదుట హాజరై శిక్షను పూర్తి చేయాలని ఆదేశించించింది. అలాగే స్పందన తెలియజేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని, తదుపరి విచారణను మార్చి 26కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. 

click me!