క్రైమ్ సీరియల్‌ని వందసార్లు చూసి.. తండ్రి హత్య: కొడుకుని పట్టించిన ఫోన్

By Siva KodatiFirst Published Oct 29, 2020, 9:32 PM IST
Highlights

నేరస్తులు ఎంతో పకడ్బందీగా నేరాలు చేసి తమను ఎవరు పట్టించుకోరని హ్యాపీగా బయట తిరిగేస్తుంటారు. కానీ నిజం నిప్పులాంటి కదా, దాని టైం వచ్చిన వెంటనే బయటపడిపోతుంది.

నేరస్తులు ఎంతో పకడ్బందీగా నేరాలు చేసి తమను ఎవరు పట్టించుకోరని హ్యాపీగా బయట తిరిగేస్తుంటారు. కానీ నిజం నిప్పులాంటి కదా, దాని టైం వచ్చిన వెంటనే బయటపడిపోతుంది. తాజాగా తన తండ్రిని హత్య చేసిన ఓ బాలుడిని అతడి సెల్‌ఫోన్‌లోని క్రైమ్ సీరియల్ పట్టించింది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో 42 ఏళ్ల మనోజ్‌మిశ్రా ఇస్కాన్‌లో ఉంటూ విరాళాలు సేకరిస్తూ ఉండేవాడు. ఈ ఏదాడి మే నెలలో తన కొడుకును ఏదో కారణంతో అతను గట్టిగా మందలించాడు మనోజ్.

దీంతో తండ్రిపై కోపంతో రగిలిపోయిన 17 ఏళ్ల అతని కుమారుడు.. ఓ ఇనుపరాడ్‌తో తండ్రి తలపై మోదాడు. అయినప్పటికీ ఆ కుర్రాడి కసి తీరలేదు. కొన ఊపిరితో ఉన్న తండ్రి గొంతును బట్టతో గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం తల్లి సంగీత మిశ్రా సాయంతో మృతదేహాన్ని అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశాడు.

ఈ క్రమంలో సగం కాలిన మనోజ్ మిశ్రా మృతదేహం పోలీసులకు కనిపించింది. ఎంత ప్రయత్నించినా మృతుడి వివరాలు తెలియకపోవడంతో ఈ కేసుని పోలీసులు పక్కనబెట్టారు.

అయితే ఎన్ని రోజులు గడిచినా మనోజ్ మిశ్రా జాడ తెలియకపోవడంతో ఇస్కాన్‌ నిర్వాహకులు అతడి కుమారుడు, భార్యపై ఒత్తిడి చేసి పోలీసులకు మే నెలలోనే ఫిర్యాదు చేయించారు.

ఆ తరువాత పోలీసులు ఈ మృతదేహాన్ని చూపించగా.. అది మనోజ్‌దేనని చెప్పారు. అయితే ఈ కేసు విచారణకు ఆయన కుమారుడు ఎంతకు సహకరించకపోవడంతో... పోలీసులకు అనుమానం వచ్చింది.

అతడి ఫోన్ పరిశీలించడంతో... ఓ క్రైమ్ సీరియల్‌ను వందసార్లు చూసినట్టు తేలింది. పోలీసులు తమదైన స్టయిల్లో ఆ కుర్రాడిని విచారించారు. దీంతో తండ్రిని హత్య చేసినట్లు అతడు నేరం ఒప్పుకున్నాడు.

హత్య చేయడంతో పాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన అతడిపైనా, అతడికి సహకరించిన అతడి తల్లిపైనా పోలీసులు కేసు పెట్టారు. అయితే క్రైమ్ సీరియల్ చూసిన తరువాతే తండ్రి మనోజ్ మిశ్రాను చంపాలనే ఆలోచనకు అతడి కొడుకు వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.

click me!