
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం నాడుజరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 27 మంది గాయపడ్డారు. మినీ బస్సు లోయలో పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఇవాళ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుజియాన్ నుండి మండికి వెళ్తున్న బస్సు పూంచ్ జిల్లాలోని సావ్జియాన్ వద్ద లోయలో పడడంతో బస్సులోని 9మంది మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మండి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా మండి తహసీల్దార్ లతీఫ్ మీడియా కి చెప్పారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణీకులున్నారు. ఆర్మీ, పోలీసులు,స్థానికులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహయం అందించాలన ఆయన అధికారులను ఆదేశించారు.
పూంచ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షించారు.ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలు శాంతించాలని కోరారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరారు