బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఇవాళ జరిగిన పేలుడులో పది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో శనివారం నాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకుంది.ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు. విరుద్ నగర్ జిల్లాలోని ముత్తుసమయపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాణసంచా ఫ్యాక్టరీలో ఇవాళ మధ్యాహ్నం పేలుడు చోటు చేసుకుంది. వెరైటీ బాణసంచా తయారీ చేస్తున్న సమయంలో పేలుడు జరిగిందని పోలీసులు చెప్పారు. బాణసంచాలో కెమికల్స్ కారణంగా పేలుగు చోటు చేసుకుందని అధికారులు అనుమానిస్తున్నారు. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడుతో మంటలు వ్యాపించాయి.ఈ క్రమంలో ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు మృతి చెందారు. పది మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా అధికారులు గుర్తించారు. పలువురు కార్మికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సత్తూరు, వెంబకొట్టై, శివకాశీ నుండి ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సత్తూరు, శివకాశి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించారు. ఆసుపత్రుల్లో చేరిన క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.దీంతో మృతుల సంఖ్య కూడ పెరిగే అవకాశం లేకపోలేదనే అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.సంఘటన స్థలానికి రెవిన్యూ, పోలీస్ అధికారులు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలోని పలు ప్రాంతాల్లోని బాణసంచా ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయాల్లో అధికారులు హడావుడి చేయడం చేస్తున్నారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకోవడం మానేస్తారనే విమర్శలు కూడ లేకపోలేదు. నిబంధనలకు విరుద్దంగా బాణసంచా తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాణసంచా తయారీ ఫ్యాక్టరీల్లో కనీస భద్రత ప్రమాణాలు కూడ పాటించడం లేదనే విమర్శలు కూడ లేకపోలేదు. ఈ విషయాలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.