అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఇండియా లోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా అల్టిమేట్ బజ్ ను సొంతం చేసుకున్న స్పైడర్ మాన్ నో వే హోమ్ ఆడియన్స్ ముందుకు ఎట్టకేలకు ఈ రోజు వచ్చేసింది.
మార్వెల్ సినిమాల్లో ఇప్పటిదాకా ఏమూవీకి రానంత హైప్ ‘స్పైడర్ మ్యాన్ నో వే హోం’కి క్రియేట్ అయ్యిన సంగతి తెలిసిందే. కథలో భాగంగా నలుగురు సూపర్ విలన్లతో.. ముగ్గురు స్పైడర్‌మ్యాన్‌లు ఫైట్ చేయనున్నారనే ప్రచారంతో ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. దాంతో ఓ రేంజిలో సినిమాకు ప్రీ రిలీజ్ హైప్ ఏర్పడింది. ఒకానొక దశలో బుకింగ్ ప్రభావంతో సర్వర్‌లు సైతం క్రాష్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ హైప్ కు తగిన స్దాయిలో సినిమా ఉందా? ఈ చిత్రం స్పెషాలిటీ ఏమిటి? ,స్టోరీ లైన్ వగైరా విశేషాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
ఈ సీరిస్ కు ముందు భాగం అయిన స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రం హోం క్లైమ్యాక్స్‌లో పీటర్ పార్కర్ (Tom Holland) ఐడెంటిటీ ప్రపంచానికి రివీల్ అవుతుందనే విషయం గుర్తుండే ఉంటుంది. అప్పటి నుంచి జనం అంతా పీటర్‌ను విలన్‌లా చూడటం మొదలు పెడతారు.మీడియా కూడా అతన్ని విలన్ గా ప్రొజెక్ట్ చేస్తుంది. స్పైడర్ మ్యాన్ ఎక్కడుంటే అక్కడ వినాశనం తప్పదని ప్రచారం చేస్తుంది. ఇదంతా చూసి పీటర్ తట్టుకోలేకపోతాడు. దాంతో జనం తానే స్పైడర్ మ్యాన్ అనే విషయం మర్చిపోయేలా చేయమని పీటర్ పార్కర్.. వెళ్లి డాక్టర్ స్ట్రేంజ్ (Benedict Cumberbatch)ను కోరతాడు. అప్పుడు స్ట్రేంజ్ ...ప్రపంచం స్పైడర్ మ్యాన్ ని మర్చిపోవటం కోసం ఒక మంత్ర ప్రయోగం చేస్తాడు.
undefined
కానీ మధ్యలో ఆ మంత్ర ప్రయోగం మధ్యలో స్పైడర్ మ్యాన్ ఫలానా తన ప్రెండ్స్..తను ఇష్టపడే అమ్మాయి..ఇలా వీళ్లు మర్చిపోకూడదని కండీషన్స్ పెడుతూ అడ్డుపడతాడు. దాంతో ఆ మంత్రం వికటిస్తుంది. మల్టీవర్స్ అంటే ఇతర ప్రపంచాల ద్వారాలు అన్నీ కూడా ఓపెన్ అయ్యి ఆ లోకాల్లో స్పైడర్ మాన్ చేతిలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న విలన్స్ అందరూ ప్రస్తుతం జరుగుతున్న కథ నడుస్తున్న లోకంలోకి ఎంటర్ అవుతారు. వాళ్ళను స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు. అతనికి తోడుగా మిగతా స్పైడర్ మ్యాన్ లు వచ్చారా..తనను ప్రపంచం మర్చిపోయేలా స్పైడర్ మ్యాన్ చివరకు చేసుకోగలిగారా,ఆ క్రమంలో జరిగిన పరిణామాలు ఏమిటి... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది..
‘స్పైడర్‌మ్యాన్’ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని రక్షించడం కోసం దుష్టశక్తులతో స్పైడర్‌మ్యాన్ చేసే యుద్ధ విన్యాసాలు ప్రతిసారీ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులను అలరించేందుకు వచ్చిన సరికొత్త స్పైడర్‌మ్యాన్ చిత్రం ‘స్పైడర్‌మ్యాన్ : నో వే హోమ్’ కూడా అంతకు మించిన స్దాయిలో ఉంది.
స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఏవైతే ఆశిస్తారో అవన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది. ఇంతకు ముందు ఈ సీరిస్ లో వచ్చిన యాక్షన్ కన్నా కాస్త ఎక్కువే ఉంది. ఎమోషన్స్ కు ప్రయారిటీ ఇచ్చారు. ఇతర యూనివర్శ్ నుంచి పాత విలన్స్ అంతా రావటం...ఆ సీరిస్ లు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి పండగ. అలాగే టామ్ హోలాండ్ స్పైడర్‌మ్యాన్‌గా లీడ్ రోల్‌లో కనిపించిన ఈ చిత్రంలో.. గతంలో స్పైడర్‌మ్యాన్‌లుగా అలరించిన టోబీ మాగుయిర్, ఆండ్రూ గార్‌ఫీల్డ్ సైతం కనిపించేలా స్క్రీన్ ప్లే,సీన్స్ డిజైన్ చేసి డైరక్టర్ జోన్ వాట్స్ రెగ్యులర్ గా ఈ సీరిస్ అభిమానులకు ఆనందం కలగచేసారు. ఓ రకంగా ఈ సినిమా స్పైడర్ సినిమాలు చూసే వారికి లవ్ లెటర్ లాంటిది.
అయితే సినిమా మొత్తం మల్టీవర్స్ ,మల్టీ డైమన్షన్స్ చుట్టూ తిరిగటంతో పెద్ద నావిల్టీ అనిపించలేదు. అలాగే కథలో చెప్పుకోదగ్గ ట్విస్ట్ లు, టర్న్ లు లేకపోయినా సర్పైజ్ ఎలిమెంట్స్ మాత్రం ఉన్నాయి. అయితే ముగ్గరు స్పైడర్ మ్యాన్ లు ఒకేసారి కనిపించే సీన్స్ మాత్రం ఈసీరిస్ ని ఫాలో అయ్యేవారికి ఓ రేంజిలో ఉన్నాయి. ఎమోషనల్ కనెక్టివిటి బాగుంది. ప్రీ క్లైమాక్స్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. స్పైడర్ మ్యాన్‌గా టామ్ హోలాండ్, డాక్టర్ ఆక్టోపస్‌గా ఆల్‌ఫ్రెడ్ పోటాపోటీగా చేసారు. డాక్టర్ ఆక్టోపస్ తన మెటల్ అవయవాలతో పీటర్‌పై దాడి చేసిన ఫైట్ సీన్ సినిమా హైలెట్స్ ఒకటి. డైరక్షన్ విషయానికి వస్తే ఓ కొత్త ఎక్సపీరియన్స్ ఇవ్వగలిగాడు. అలాగే మొదట కొన్ని విజువల్స్ అనుకుని ఆ తర్వాత వాటికి తగ్గ సీన్స్ రెడీ చేసుకుని చేసినట్లుంది. తెలుగు డబ్బింగ్ కూడా నీటుగా ఉంది. స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.
ఫైనల్ థాట్
‘స్పైడర్‌మ్యాన్’తో మీకు పాత జ్ఢాపకాలు ఉంటే వాటిని ఖచ్చితంగా నిద్ర లేపుతుంది ఈ చిత్రం
--సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు...
నటీనటులు : టామ్ హాలండ్ , జెండయ, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జాకబ్ బటలన్, జాన్ ఫెవర్యూ, మరిస టొమి, జె. బీ స్మూవీ, బెనెడిక్ట్ వాంగ్, జామీ ఫాక్స్, ఆల్ఫ్రాడ్ మోలిన, విల్లెమ్ డఫో, థామస్ హడెన్ చర్చ్, రాయిస్ ఇఫాన్స్ ముఖ్య పాత్రలను పోషించారు.
రచన :క్రిస్ మెక్‌కెన్నా, ఎరిక్ సోమర్స్
దర్శకత్వం: జాన్ వాట్స్
సమర్పణ: కొలంబియా పిక్చర్స్ ,మార్వెల్ స్టూడియోస్
విడుదల: సోనీ పిక్చర్స్
నిర్మాతలు :Kevin Feige, Amy Pascal
మ్యూజిక్ Michael Giacchino
రన్ టైమ్: 2 hr 28 mins
విడుదల తేదీ:డిసెంబర్ 16, 2021