
ఒకప్పుడు ప్రేమ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉండేది. అందులోను పదహారేళ్ల వయసులో చిగురించిన ప్రేమ కథల మీద వచ్చిన సినిమాలే ఎక్కువగా నచ్చేవి. కానీ ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలకు అభిమానులు పెరిగిపోయారు. అందుకే ఓటీటిల్లో థ్రిల్లింగ్ కంటెంట్ ఎక్కువగా వస్తోంది. ముఖ్యంగా ఒక హత్య చుట్టూ అల్లుకున్న కథ.. చివరికి హంతకుడు ఎవరో కనిపెట్టే పజిల్.. ఇదే ఇప్పుడు ఓటిటిల్లో మెయిన్ కంటెంట్ గా మారింది.
అన్ని థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలని లేదు. ఆ సినిమాలో సస్పెన్స్ చివరి వరకు కొనసాగితేనే చూడాలన్న ఆసక్తి పెరుగుతుంది. అలా సినిమా మొత్తం సస్పెన్స్ తోనే నిండి ఉన్న మంచి థ్రిల్లింగ్ కంటెంట్ మూవీ.. పూణే హైవే. ఈ సినిమా మొదలైనప్పుడు నుంచి హంతకుడు ఎవరో తేలే వరకు సినిమా సస్పెన్స్ తోనే నడుస్తుంది.
ప్రేమ, వినోదం, హర్రర్, డ్రామా, ఫాంటసీ, యాక్షన్ సినిమాలతో పోలిస్తే ఎక్కువ మందికి ఇప్పుడు థ్రిల్లర్ కంటెంట్ ఉన్న మూవీనే నచ్చుతుంది. అలా ఈ మధ్యన వచ్చిన మూవీ పూణే హైవే. ఆ సినిమాలో మనకు తెలిసిన నటులు చాలా తక్కువ మందే.. నిజం చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకు ఎవరు తెలియదనే చెప్పాలి. కాకపోతే ఈ మధ్యనే విడుదలైన కుబేర సినిమాలో విలన్ గా నటించాడు జిమ్ సర్బ్. పూణే హైవే లో కూడా ఆయనే కనిపిస్తాడు. అలాగే ఎప్పుడో రెండు, మూడు తెలుగు సినిమాల్లో నటించింది మంజరి ఫడ్నెస్. ఆమె కూడా ఈ సినిమాలో ఒక సైడ్ రోల్లో కనిపిస్తుంది. అంతకుమించి మీకు తెలిసిన నటీనటులు ఉండకపోవచ్చు... కానీ ఆ సినిమాలోని సస్పెన్స్ చివరి వరకు మిమ్మల్ని చూసేలా చేస్తుంది.
ఇక కథ విషయానికి వస్తే నలుగురు స్నేహితుల మధ్య మొదలయ్యే కథ ఇది. ప్రమోద్, విష్ణు, నిక్కి, నటాషా.. వీరంతా ఒకే అపార్ట్మెంట్లో పెరుగుతారు. ఓసారి నటాషా లేకుండా స్నేహితులంతా కలిసి పూణే హైవే పై వెళుతూ ఉంటారు. అప్పుడు వారు ఒక హత్యను చూస్తారు. అయినా కూడా పోలీసులకు సాక్ష్యం చెప్పరు. పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్... సాక్ష్యం చెప్పమని అడిగినా కూడా వారు చెప్పేందుకు ఇష్టపడరు. ఆ తర్వాత పదేళ్లు గడిచిపోతాయి. అప్పుడే అసలైన కథ మొదలవుతుంది.
ప్రమోద్.. ప్రముఖ రాజకీయ నాయకుడైన మన్సేకర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. మన్సేకర్ కూతురు మోనా. ప్రమోద్... మన్సేకర్ దగ్గర పనిలో చేరినప్పుడు ఆమె వయసు పదేళ్ల కన్నా ఎక్కువ ఉండవు. కాబట్టి వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ప్రమోద్ మోనాను దగ్గరుండి చూసుకుంటాడు. మోనాకు ఆయనే బాడీ గార్డ్. పెద్దయ్యాక తనకి ఇష్టమైన కోర్స్ కోసం వేరే నగరానికి వెళుతుంది మోనా. ప్రమోద్ ద్వారా అతని స్నేహితులంతా పరిచయమవుతారు. కానీ హఠాత్తుగా ఓసారి మన హత్యకు గురై చెరువులో తేలియాడుతూ కనిపిస్తుంది. మోనాను ఎవరు చంపారన్నదే సినిమా కథ.
చంపిన వారిని పట్టుకునేందుకు ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఎంతగానో ప్రయత్నిస్తాడు. ప్రమోద్ స్నేహితులందరినీ అనుమానిస్తాడు. కానీ ఏదీ నిరూపించలేక పోతాడు. ఇక విష్ణు న్యాయవాదిగా.... ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తో కలిసి అసలు హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు.
ఆ హత్య ఎవరు చేశారో తెలుసుకోవడం కోసం పొరలుపొరలుగా ఒక్కొక్క నిజాన్ని బయట పెడుతూ ఉంటారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక గతం దాగే ఉంటుంది. ఒక్కొక్క అంశాన్ని బయటపెడుతున్నప్పుడు ఆ సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. మోనాను చంపిన హంతకుడిని కనిపెట్టాక ప్రేక్షకులు షాక్ తినడం ఖాయం. అది కూడా ఎందుకు చంపాడో తెలుసుకుంటే మరింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులు అమిత్ సాథ్, జిష్ణు సర్బ్, సుదీప్ మోదక్... వీరంతా మనకు తెలిసిన నటులు కాకపోవచ్చు. కానీ సినిమా చూస్తూనంత సేపు మనకి వారు తెలిసినట్టే అనిపిస్తుంది. ఆ సినిమాలో మనం కూడా లీనమైపోతాము. ఎవరు చంపి ఉంటారా? అని వెతికేందుకు కూడా ప్రయత్నిస్తాము. కానీ ఒక అంతు పట్టని రహస్యంలా హంతకుడు చివరి వరకు బయటపడడు.
ఈ సినిమా రూ మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఇది హిందీ సినిమా. హిందీని అర్థం చేసుకునేవారు ఎక్కువ మందే ఉంటారు.. కాబట్టి నేరుగా దాన్ని హిందీలో చూడవచ్చు. ఒకవేళ మీకు హిందీ రాకపోతే సబ్ టైటిల్స్ ఇంగ్లీషులో వస్తాయి. వాటిని చదువుకోవచ్చు. ఏదైనా కూడా చెరువులో తేలియాడిన ఒక అందమైన అమ్మాయి శవం.. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో రణగొణ ధ్వనులు, విపరీతమైన యాక్షన్ మ్యూజిక్ ఉండవు. చాలా సైలెంట్ గా సాగిపోతుంది. కాబట్టి ప్రేక్షకుడు సినిమాలో లీనం అయిపోతాడు.