'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీ రివ్యూ!

By tirumala AN  |  First Published Jul 18, 2019, 5:35 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి టేకింగ్ కి రామ్ ఎనర్జీ యాడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

---(Review By సూర్య ప్రకాష్ జోశ్యుల)


 ఓ సిఐఏ ఏజెంట్ తను చేస్తున్న సీక్రెట్ ఆపరేషన్ లో కీలకమైన కొన్ని రహస్యాలు తెలుసుకుని చనిపోతాడు. దాంతో అతని పై అధికారులు...ఆ రహస్యాలు చనిపోయిన అతనితోనే సమాధి కాకూడదని, అవేంటో తెలుసుకోవాలని అతని జ్ఞాపకాలని ఓ క్రిమినల్ లోకి ఎక్కిస్తారు. ఆ సీఐఏ ఏజెంట్ జ్ఞాపకాలతో లేచిన క్రిమినల్ ...ఆ ఆపరేషన్ ని పూర్తి చేయటానికి బయిలుదేరతాడు. ఇది మూడేళ్ల క్రితం హాలీవుడ్ లో వచ్చిన Criminal (2016)సినిమాలోది. ఐడియాగా అదిరిపోయిన సైన్స్ ఫిక్షన్ (అనొచ్చా) క్రైమ్ డ్రామా కథ లాంటిది మన తెలుగులోనూ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన పూరికి వచ్చినట్లుంది. కొంచెం అటూ ఇటూలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ దిగిపోయాడు. ఇలాంటి ప్రయోగాత్మక ఆలోచనని మాస్ సినిమాగా ఎలా పూరి మలిచారు. తెలుగులో ఈ కథ ఏ రకంగా మారింది. మన తెలుగు వాళ్లకు నచ్చుతుందా.. పూరి చేసిన ఈ బ్రెయిన్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి..? :

Latest Videos

undefined

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో డబ్బుకోసం ఏదైనా చేసే చిన్న సైజు రౌడీ ఉస్తాద్ శంకర్‌ (రామ్‌ పోతినేని) . రెండు ఫైట్స్, నాలుగు సెటిల్మెంట్స్ చేసుకుంటూ బ్రతుకుతున్న అతను ఓ డీల్ నిమిత్తం వచ్చిన చాందిని (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. జీవితం, ప్రపంచం ఇంకా బాగుందనిపిస్తుంది. ఆమెతో గోవాలో స్టేప్స్ వేస్తూ , హ్యాపీగా డ్యూయిట్స్ పాడుకుంటూ కాలక్షేపం చేస్తూంటాడు.అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అతని దగ్గరకు వచ్చిన ఓ కిల్లింగ్ కాంటాక్ట్ అతని జీవితాన్ని మార్చేస్తుంది. తన వృత్తిలో భాగంగా పొలిటీషియన్ కాశీ రెడ్డి (పునీత్ ఇస్సార్)ని చంపి , దొరికిపోయి జైలుకు వెళ్తాడు. ఆ జైలు నుంచి తప్పించుకోబోతూ పెద్ద ఫైట్ చేసి , చివరకు సీబీఐ కు దొరికి వాళ్ల చేసిన ఓ ఎక్సపరిమెంట్ లో ఇరుక్కుంటాడు. వాళ్లు సైంటిస్ట్‌ పింకీ (నిధి అగర్వాల్‌) సాయింతో శంకర్ మైండ్ లో ఓ సీబీఐ అధికారి అరుణ్ (సత్యదేవ్‌) జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. అసలు ఆ జ్ఞాపకాలు ఏంటి ? సిబీఐ వాళ్లు ఎందుకా పనిచేసారు. ఇప్పుడు శంకర్ పరిస్దితి ఏమిటి ? శంకర్ లవర్ చాందిని ఏమైంది, కాశీ రెడ్డి వెనక ఏమన్నా మిస్టరీ ఉందా...అసలు ఈ కథలో విలన్స్ ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..? :

ఆ మధ్యన రామ్ చ‌ర‌ణ్ – అల్లు అర్జున్ కలిసి న‌టించిన‌ `ఎవ‌డు` (వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు) త‌ర‌హాలోనే ఇదో ప్ర‌యోగాత్మ‌క క‌థాంశం. ఒకరి జీవితంలోకి మరొకరు ప్రవేశించటం అనేది ఇంట్రస్టింగ్ ఎలిమెంటే. ఇస్మార్ట్ శంకర్ ..స్టోరీ లైన్ గా చాలా చిన్నది. దాన్ని పూరి తన మార్క్ క్యారక్టరైజేషన్, డైలాగ్స్, సీన్స్ తో హాలీవుడ్ పాయింట్ ని అచ్చ తెలుగు మాస్ మూవీగా మార్చేసాడు. ఆయన రచనా అనుభవం అందుకు బాగానే పనికొచ్చింది.

అయితే అదే సమయంలో ఆ అనుభవమే మరీ పరమ రొటీన్ సినిమా గా వెరైటీ పాయింట్ ని సైతం మార్చేలా చేసేసింది. దాంతో మెమరీ ట్రాన్సఫర్ అనే పాయింట్ తప్పిస్తే అంతా ఇంతకు ముందు చూసిన సినిమాలాగానే అనిపిస్తుంది. పూరీ మార్క్ హీరోయిజం.. తెలంగాణ మాట‌లు.. గ్లామ‌ర్ షో మాత్రం మాస్ ని టార్గెట్ చేయటంలో సక్సెస్ అయ్యాయి.

ఇంకా చెప్పాలంటే ఈ మధ్యన వరసపెట్టి వదిలిన పూరీ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇస్మార్ట్ శంక‌ర్ వెయ్యిరెట్లు నయం. రామ్ కూడా తెలంగాణ యాస‌లో తన ఎనర్జీని అంతా పెట్టి నటించేసాడు. రామ్ క్యారక్టరైజేషన్, .. రామ్ మేకోవ‌ర్ కొత్తగా క‌ట్టి ప‌డేస్తాయి. క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ లుక్ లో కూడా రామ్ ఎక్సపెక్ట్ చేయని విధంగా ఉన్నాడు. రామ్ ..యాక్షన్ చేస్తే మనం మనకు చేతనైంది చేద్దాం అన్నట్లుగా నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ ఏ మాత్రం డిస్కౌంట్ లేకుండా అందాల ప్రదర్శన(అర్దనగ్న అనాలేమో) చేసేసారు.

అదే మైనస్ :

మొదటే చెప్పుకున్నట్లు రొటీన్ ట్రీట్మెంట్ ఈ సినిమాకు ఇబ్బందిగా మారింది. దానికి తోడు నెక్ట్స్ ఏం జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది ముందే ఊహించేయ‌గ‌ల‌గ‌డం.. క్లైమాక్స్ ను సైతం చాలా ప్రెడిక్టుబుల్ ఉండటంతో తేలిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఫస్టాఫ్ బాగుందనిపించినా,సెకండాఫ్ మరీ ప్లాట్ గా నడుస్తుంది. ఇంటర్వెల్ లో పెరిగిన ఇంట్రస్ట్ ,సెకండాఫ్ పూర్తి స్దాయిలో సస్టైన్ చేయలేకపోయింది.

రామ్ కు కలిసొస్తుందా..? :

రామ్ కు కెరీర్ ప్రారంభంలో దేవదాసు వంటి మాస్ సినిమాలు పడ్డాయి కానీ ఆ తర్వాత రెడీ వంటి కామెడీలు,నేను శైలజా వంటి కూల్ లవ్ స్టోరీ లు వచ్చాయి. అయితే ఈ సినిమా అతనికి మాస్ హీరో ఇమేజ్ ని తెచ్చిపెడుతుంది. కాకపోతే దాన్ని కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.

మణిశర్మ లేకపోతే.. :

చాలా కాలం తర్వాత మళ్లీ మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు ప్రాణం పోసింది. తన రీరికార్డింగ్ తో సీన్స్ ఎలివేట్ చేశాడు .పాటలు బాగున్నా.. కథలో కలవలేదు. అలాగే సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. రేసీగా కథనాన్ని పరుగెత్తించటంలో ఎడిటింగ్ కలిసొచ్చింది. ప్రొడక్షన్స్ వాల్యూస్ అద్బుతం కాదు కానీ సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.

ఫైనల్ థాట్ : సారు..మాస్ సెంట‌ర్లకు స్టార్

Rating: 2.5/5

 

click me!