అంతా బూటకం అని చెప్పే `రంగమార్తాండ`

By Aithagoni Raju  |  First Published May 7, 2023, 1:18 PM IST

దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన `రంగమార్తాండ` చిత్రం కమర్షియల్‌గా సత్తాచాటలేకపోయింది. కానీ ఎంతో మంది ప్రశంసలందుకుంది. నిజ జీవితాన్ని ఆవిష్కరించిన చిత్రంగా ప్రశంసలు పొందింది. మార్చిలో విడుదలైన ఈ చిత్రానికి సంబంధించి తనదైన శైలిలో సమీక్ష అందిజేశారు ప్రముఖ విశ్లేషకులు డా. సిద్దెంకి యాదగిరి. మీరు ఓ లుక్కేయండి.


"నటుడైన నటరాజయినా చివరకు మిగిలేది స్మశాన వసంతమే" -

"చోటు మారితే ఆట మారుతుందా
మహాభారతమైనా
మనిషి జీవితం అయినా విషాదాల సమాహారమే"

Latest Videos

undefined

"రంగులు వేసి నటించిన అంత ఈజీ కాదు రా
రంగులు లేని ప్రపంచంలో బ్రతకడం"

"చిటికెడంత నవ్వి చూడు
ఏడుపంతా వెళ్లిపోతది"

"అక్షరాలను పొడిగా వాడుకు
దాని వెనుకున్న తడిని చూడు" - రంగమార్తాండ


చిత్రం: రంగమార్తాండ
తారాగణం: ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, జయలలిత, అనసూయ, ఆదర్శ్, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, భద్రం తదితరులు
కెమెరా: రాజ్ కె నల్లి
మాటలు: ఆకెళ్ల శివప్రసాద్
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: కాలిపి మధు, ఎస్ వెంకట రెడ్డి
దర్శకత్వం: కృష్ణవంశీ

విడుదల అయిన తేదీ: 22 మార్చ్ 2023.

జీవిత తత్వాన్ని, మనిషి జీవితంలో ఆఖరి మజిలీని, చివరకు మిగిలిన వైరాగ్యాన్ని అద్భుతంగా చిత్రించిన సినిమా రంగమార్తాండ.

నిర్మాత కొడుకు సిద్దు.  రాఘవ రాజుకు సిద్దు నాన్న ఇచ్చే గౌరవాన్ని చూసి సిద్దు ఈర్ష పడతాడు. సిద్దుని హీరో చేయాలనే ఉద్దేశంతో సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు కలుగజేసుకొని ఆ హీరో సిద్దూ మనస్తత్వాన్ని మార్చిన గొప్ప నటుడు రాఘవ రాజు.

ఒకరోజు సిద్ధూ రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు ఒక హోటల్లో ఆగి టిఫిన్ చేస్తుంటాడు అన్నీ కోల్పోయిన అనాధగా జీవితమెల్లదీస్తున్న రాఘవ రాజు టిఫిన్ చేస్తూ నేలపాలు చేస్తాడు. దానికి హోటల్ యజమాని కోప్పడతాడు. రాఘవ రాజు మీరే కదా మీ వల్ల నా జీవితమే మారిపోయిందని సిద్దు గుచ్చి గుచ్చి అడుగుతాడు. చివరకు తన జీవితంలోని ఉత్థాన పతానాలను దయనీయ పరిస్థితులను సిద్దుకు తెలియజేయడమే కథా సారాంశం.

నాటకంలో రిటైర్ అవుతూ రాఘవ రాజు రంగమార్తాండ అనే బిరుదు పొందారు. అదే రోజు అతని భార్యకు తెలియకుండా ఉన్న ఆస్తిని కొడుకు రంగాకు, కూతురు బంగారంకు దారాదత్తం చేస్తాడు. ఇంతలో ఒక రోజున  నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను అంటూ సిప్లిగంజ్ రాహుల్ వచ్చాడు. బిడ్డ మాట కాదనలేక రాఘవ రాజు బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాడు.

రాఘవ రాజు ముక్కుసూటితనం, కచ్చితత్వం ఎవరికి మింగుడు పడది.  కొడుకు కోడలు ఉన్న ఆస్తిని తీసుకొని మీ చాందసవాదాన్ని మేము భరించలేకున్నాము అని చెప్పడంతో గమ్యం తెలియని పయనం సాగిస్తుంటాడు రాఘవ రాజు.

స్నేహితుడు చక్రి సహాయంతో బస్టాప్ నుంచి  బిడ్డ అల్లుడి ఇంటికి వెళ్తాడు రంగమార్తాండ రాఘవ రాజు. అల్లుడు సిప్లిగంజ్ రాహుల్ కు పాటలు పాడడమే వృత్తి. నాటకం యొక్క అనుభవాన్ని రంగరించి జానపద బానీల్లోంచి గొప్ప పాటల్ని అందిస్తాడు రాఘవ రాజు. అనేకమైన మెలోడీలు సూపర్ హిట్ అవుతాయి. పరోక్షంగా ధన సంపాదనను అల్లుడికి బిడ్డకు సమకూరుస్తాడు.

చక్రి భార్య చనిపోతుంది. ఒంటరిగా ఉన్నాను, నన్ను వదిలి పోకురా రాజు అని చక్రి దీనంగా వేడుకున్నా చెప్పకుండానే వెళ్ళిపోతాడు రాఘవ రాజు.  మరొక రోజు చక్రిని చూడడానికి వచ్చిన రాఘవ రాజుని 'నువ్వు ఒక చెత్త నటుడివిరా దొంగ నా కొడకా ' అని తిట్టి గట్టిగా చెంప దెబ్బ వేసి బాధపడతాడు చక్రి. ఆ బాధలోనే హైపర్ టెన్షన్తో హాస్పిటల్ పాలవుతాడు.

రంగులు వేసుకొని నటించినంత ఈజీ కాదు రంగులు వేసుకోక బతకడం  అని ఓడిపోతున్న పరిస్థితులను, అమితంగా ప్రేమించే కొడుకు బిడ్డ కూడా తనను
ఈసడించుకుంటున్న  విషయాన్ని తెలియజేస్తాడు రాఘవ రాజు.

చక్రి (పాత్ర పోషిస్తున్న బ్రహ్మానందం) "ఒరేయ్ రాజు చావు కైనా, బ్రతుకైనా ఎదురుచూడడం నరకంగా ఉందిరా" అని చక్రి రాఘవ రాజుతో తన నిస్సహాయతను వ్యక్తంచేస్తాడు.
చక్రి ఆజ్ఞను శిరసావహిస్తూ రంగ మార్తాండ అన్ని గోలీలు నీటిలో కలిపి ఒక్కసారిగా తాగిస్తే చక్రి చనిపోతాడు. ఈ సన్నివేశం చూస్తుంటే మనసును పొడి బట్ట చేసి పిండినట్టుగా అనిపిస్తుంటది.

రాఘవ రాజు వజ్రం, జాతిరత్నం అని పిలుచుకునే తన  బిడ్డ బంగారం తనపైనే దొంగతనం ఆరోపణ చేస్తుంది. అంతకుముందే భార్య కోసం రంగమార్తాండ బిరుదు ప్రధానం చేసిన రోజు తొడిగిన కంకణాన్ని అమ్మి తెచ్చిన డబ్బులు లెక్కిస్తుంటే దొంగతనం ఎందుకు చేసావు అని బిడ్డ కోప్పడుతుంది. చెప్పినా వినిపించుకోదు.

నేను రాజుగా, భటుడిగా.... రకరకాల వేషం వేశాను కానీ ఇప్పటివరకు వేయనివేషం నీవు వేయిస్తున్నావు అదే దొంగ వేషం. సంతోషం అని బాధపడతాడు రాఘవ రాజు.

రంగమార్తాండ దొంగనా? నాటకాలు వేసి కోట్లు సంపాదించాను. అనేక మందికి పంచి పెట్టాను. నన్నే దొంగగా చేస్తే..... అని బాధపడతాడు. తప్పు తెలుసుకుని బిడ్డ అల్లుడు ఎంత బతిమాలిన వినని రాఘవ రాజు దంపతులు రాత్రికి రాత్రే చెప్పకుండా వెళ్ళిపోతారు ఇంటి నుండి. పోతూ పోతూ ఒక చెట్టు కింద రాఘవ రాజు భార్య పడుకున్నది పడుకున్నట్టుగానే చనిపోతుంది.

నేనెవరిని నేను ఎవరిని అని తనను తాను ప్రశ్నించుకుంటున్న రంగ మార్తాండ రాఘవ రాజు వద్దకు  కొడుకు కూతురు వస్తారు.  ఎవరిని దగ్గరికి రానివ్వడు.  భారీ డైలాగులు చెప్పుతూ కుప్పకూలిపోతాడు - జీవితం చివరకు స్మశాన వసంతం అని.

ఈ నిలయం నీది
నర్తనశాలే కాదా?
నీ కొలువేది
విరాట పర్వం కాదా?
ఏం తెలుసయ్యా సమరం ఏం పొందావు విజయం ?
అంతా వినరమే కానీ అనుమానం
నీ యుద్ధం నీలో నుండి నిన్నోడిందా? బ్యాక్ గ్రౌండ్ పాటతో ముగిసిపోతుంది.

ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ పోటీపడి నటించారు. నటించడం కంటే జీవించడం అంటే సబబుగా ఉంటుంది అని నా అభిప్రాయం. ప్రతి డైలాగ్ లో జీవం  ఉంది. కొన్ని తెలుగు కవుల కవితా పంక్తులు గుర్తు తెచ్చే విధంగా ఉన్న ప్రతి డైలాగు స్వతంత్రంగా రాయబడింది.

అనేకమైన కళాఖండాలను అందించిన కృష్ణవంశీ  సినిమా  చాలా రోజుల తర్వాత సంతృప్తిగా చూసే అవకాశం కలుగుతుంది. ఇళయరాజా  సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు.

తల్లిదండ్రుల కోరికల్ని గౌరవించడం. వారి ఆశయాన్ని కొనసాగించడం. చివరి సమయంలో వారికి అండగా ఉండడం నేటి యువతకి, పిల్లలకి ఇచ్చే సందేశంగా ఈ సినిమా ఉంది. ఈ సినిమా ఆంగ్ల భాషా వ్యామోహాన్ని ధిక్కరించింది. పాశ్చాత్య పాప్ సంగీతాన్ని తులనాడింది. విలియం షేక్స్పియర్ కంటే ముందే రాసిన నాటక కర్తలైన కాళిదాసు దండి బలిజేపల్లి లక్ష్మీకాంతం, గుర్రం జాషువా ఎంతో మంది నాటక కర్తలను కవులను మరొకసారి గుర్తు చేసింది.

- సమీక్షః డా. సిద్దెంకి యాదగిరి

click me!