ఎన్నికల ఎఫెక్ట్.. వారికి జీతం రోజుకి రూ.7వేలు

By ramya NFirst Published Apr 1, 2019, 9:58 AM IST
Highlights

ఎన్నికల వేళ.. బాడీ బిల్డర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఎన్నికల పోటీలో నిలిచిన అభ్యర్థులకు భద్రత కల్పించేందుకు ఇప్పుడు బౌన్సర్లు తప్పనిసరి అయ్యింది. 

ఎన్నికల వేళ.. బాడీ బిల్డర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఎన్నికల పోటీలో నిలిచిన అభ్యర్థులకు భద్రత కల్పించేందుకు ఇప్పుడు బౌన్సర్లు తప్పనిసరి అయ్యింది. పోలింగ్‌ ముగిసేవరకూ ఆరు నుంచి ఏడుగురు బౌన్సర్లను తమ చుట్టూ తిప్పుకునేందుకు అభ్యర్ధులు, కీలక నేతలు ఆసక్తి కనబరుస్తుండటంతో జిమ్‌లు, సెక్యూరిటీ ఏజెన్సీల వద్ద సందడి నెలకొంది.

పోలింగ్‌ తేదీ వరకూ రోజూ 24 గంటల పాటు అభ్యర్ధుల వెన్నంటి ఉండేలా కండలుతీరిన దేహం కలిగిన వారిని రిక్రూట్‌ చేసుకుంటున్నామని, దీనికోసం వారికి రోజుకు ఆరు నుంచి ఏడు వేల రూపాయల వరకూ ముట్టచెపుతున్నామని ఓ పార్టీ కీలక నేత చెప్పుకొచ్చారు. బాడీబిల్డర్లు ఆహారం కోసమే రోజుకు రూ 3000 నుంచి 3500 వెచ్చిస్తారని, దాంతో పాటు ఏరియా, అతని రేటింగ్స్‌ను బట్టి బౌన్సర్‌కు రోజుకు రూ 2000 నుంచి 3000 వరకూ చెల్లిస్తామని వెల్లడించారు.

ఇంకొందరైతే రోజుకి రూ.7వేలు ఇస్తామని కూడా ఆఫర్ చేస్తున్నారు. మరోవైపు అభ్యర్ధులు, రాజకీయ నేతల చుట్టూ చేరిన బౌన్సర్లతో పోలీసులకు పెనుసవాల్‌ ఎదురవుతోంది. రాజకీయ పార్టీల ర్యాలీల సందర్భంగా బౌన్సర్ల ఆగడాలు పెరగడం, ఓటర్లు, ప్రత్యర్ధి పార్టీల కార్యకర్తలపై దురుసు ప్రవర్తనతో హింసాత్మక ఘటనలు చెలరేగుతాయనే ఆందోళన ఖాకీలను వెంటాడుతోంది. బౌన్సర్లకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు ఢిల్లీ సహా పరిసర ప్రాంత జిమ్‌లపై తనిఖీ చేపట్టారు.

click me!