తమిళనాడులో మోడీ అభిమాని దారుణహత్య, నిందితుడు డీఎంకే కార్యకర్త

By Siva KodatiFirst Published Apr 15, 2019, 11:21 AM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీకి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.

ప్రధాని నరేంద్రమోడీకి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం తంజావూరు సమీపంలోని ఒరత్తనాడు తెన్నమనాడు గ్రామానికి చెందిన గోవిందరాజ్ అనే 75 ఏళ్ల వృద్ధుడు సామాజికవేత్త.. గతంలో వెటర్నరీ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయ్యారు.

ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా గోవిందరాజ్ విడిగా ఉంటున్నారు. ఈయనకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టం. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్ధతుగా ఒరత్తనాడు పరిసర ప్రాంతాల్లో మోడీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం రాత్రి మెడలో మోడీ చిత్రపటాన్ని తగిలించుకుని గ్రామంలో దుకాణాల వెంట గోవిందరాజ్ ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ గోపినాథ్ అక్కడికి వచ్చాడు.

మోడీకి ఎలా ప్రచారం చేస్తావంటూ గోవిందరాజ్‌తో వాగ్వాదానికి దిగారు. వీరిద్దరి వివాదం తారాస్థాయికి దిగడంతో గోపీనాథ్ ఆగ్రహంతో గోవిందరాజ్‌పై దాడి చేశారు. దీంతో ఆయన స్పృహ తప్పి పడిపోయారు.

వెంటనే స్పందించిన స్థానికులు గోవిందరాజ్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. జరిగిన సంఘటనపై గోవిందరాజ్ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపీనాథ్‌ను అరెస్ట్ చేశారు.

ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలియడంతో అన్నాడీఎంకే, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఒరత్తనాడులో పోలీసులు భారీగా మోహరించారు. కాగా దాడికి పాల్పడిని బస్సు డ్రైవర్ గోపీనాథ్‌ను డీఎంకే-కాంగ్రెస్ మద్ధతుదారుడిగా భావిస్తున్నారు. 

click me!