మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు

By telugu teamFirst Published May 30, 2019, 10:45 AM IST
Highlights

భారతదేశ ప్రధానిగా నరేంద్రమోదీ రెండో సారి బాధ్యతలు చేపడుతున్నారు. గురువారం సాయంత్రం 7గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

భారతదేశ ప్రధానిగా నరేంద్రమోదీ రెండో సారి బాధ్యతలు చేపడుతున్నారు. గురువారం సాయంత్రం 7గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గురువారం రాత్రి 7 గంటలకు కొత్త మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేస్తారు. 

ఈ ప్రమాణస్వీకారంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. సుమారు 8,000 మంది అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.  సాధారణంగా రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.  ప్రత్యేకంగా ఉండాలని... అంతేకాకుండా వైభవంగా ఉండాలనే ఉద్దేశంతో  రాష్ట్రపతి భవన్‌ ముందున్న బహిరంగ ప్రాంతంలోకి మార్చారు.

ప్రమాణస్వీకార అతిథులు వీరే...

ఈ ప్రమాణస్వీకారానికి విదేశాల నుంచి కూడా అతిథులు హాజరౌతున్నారు. మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్‌, కిర్గిజ్‌ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్‌, బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌, శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన, నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి, మయన్మార్‌ అధ్యక్షుడు యు విన్‌ మైంట్‌, భూటాన్‌ ప్రధాని లోటయ్‌ సెరింగ్‌, థాయ్‌లాండ్‌ ప్రత్యేక దూత గ్రిసాద బూన్‌రాచ్‌లు హాజరుకానున్నారు. 
మోదీ ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా రానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లు కూడా హాజరుకానున్నారు.

రాజకీయనాయకులు కాకుండా.. రాహుల్ డ్రావిడ్, సైనా నెహ్వాల్, రజినీకాంత్, షారూక్ ఖాన్, కంగనా రనౌత్, కరణ్ జోహార్, సంజయ్ లీలా బన్సాలీ లు కూడా ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటాలు కూడా హాజరుకానున్నారు. 

అతిథులకు ప్రత్యేక విందు భోజనం...

ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిథులకు ప్రత్యేకంగా నోరూరించే వంటలను తయారు చేయిస్తున్నారు. వేడి వేడి టీతో పాటు సమోసా, శాండ్‌విచ్‌, లెమన్‌ టార్ట్‌ లాంటి స్నాక్స్‌, ప్రముఖ బెంగాలీ స్వీట్‌ రాజ్‌భోగ్‌ (రసగుల్లా లాంటి స్వీట్‌) కూడా పెట్టనున్నారు. ఇక రాత్రి డిన్నర్‌లో వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ వంటకాలు ఏర్పాటు చేశారు. 

వీటితోపాటు... రాష్ట్రపతి భవన్‌ పాపులర్‌ వంటకమైన ‘దాల్‌ రైసినా’ను వడ్డించనున్నారు. దాల్‌ రైసినా రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకమైన వంటకం. మినపగుళ్లతో చేసే ఈ పదార్థాన్ని సుమారు 48 గంటల పాటు తక్కువ మంటపై నెమ్మదిగా వండుతారట. ఇవాల్టి మెనూలో దాల్‌ రైసినా కూడా ఉండటంతో మంగళవారం రాత్రి నుంచే దీన్ని వండటం మొదలుపెట్టినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

click me!