విభిన్న పార్శ్వాల కొత్త కోణం " బోల్డ్ & బ్యూటిఫుల్"

By telugu teamFirst Published Apr 24, 2021, 3:17 PM IST
Highlights

అపర్ణ తోట కథా సంపుటి " బోల్డ్ & బ్యూటిఫుల్"  పై యడవల్లి శైలజ ( ప్రేమ్) అందించిన సమీక్ష ఇక్కడ చదవండి.

'బోల్డ్ & బ్యూటిఫుల్ ' పుస్తకం పేరు వినగానే మనకు కొంచెం అర్థమై పోతుంది.  ఉన్నది ఉన్నట్టు వాస్తవికతను వెల్లడి చేస్తాయి ఈ కథలన్నీ అని.  డొంక తిరుగుడు లేకుండా ఉన్నది ఉన్నట్టు రచన చేసి పాఠకులను మెప్పించడం అనేది ఏ రచయితకైనా కాస్త కష్టమైన పని.   నిజాన్ని నిర్భయంగా రాయడానికి కూడా ఆలోచించుకునే సందర్భాలు ఉంటాయి.  కానీ ఈపుస్తక రచయిత్రి  అపర్ణ తోట  కుండ బద్దలు కొట్టినట్టు ఈ సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య ఉన్న స్త్రీ, పురుష సంబంధాలను,  వారు పడే మానసిక వేదనను,  స్త్రీ పురుషులు ఏర్పరచుకున్న లైంగిక సంబంధాలను  వారి జీవితాలను కళ్ళకు కట్టినట్లు తన కలంతో మనకు చూపించారు. 

 ఒక్కొక్క కథ ఒక్కొక్క వ్యథ.   రచయిత్రి కూడా ప్రేమ, పెళ్లి అనే బంధాలలో జరిగే దోపిడీని తివాచీ కింద దాచిపెడ తాము అని తన మాటలో మనకు ఆమె గళాన్ని వినిపిం చారు.  " బోల్డ్ & బ్యూటిఫుల్ " ఈ పుస్తకంలో మొత్తం 15 కథలున్నాయి.  "అన్ని కథలు ఒక్కొక్క పచ్చి నిజాన్ని మోస్తూ ఇంకా ఆరని గాయాల పచ్చి వాసనను వెదజల్లుతున్నాయి. "

మద్యపానం కుటుంబ వ్యవస్థను ఆర్థికంగానే కాకుండ, భార్యా భర్తల మధ్య ఉండే శారీరక, మానసిక సంబంధాలను కూడా అగాధంలోకి పడేసిన సంసారాలు ఎన్నో ఉన్నాయి.  ఇందుకు ' పునీత ' కథే ఒక ఉదాహరణ.  మద్యపానం వల్ల నరాల బలహీనతకు లోనై భార్యను సుఖపెట్టక లేక తిరిగి ఆమెనే బూతులు తిట్టి అతని చేతగానితనాన్ని కప్పి పుచ్చుకుంటాడు. నెపం ఆమెపైకి నెట్టి వేస్తాడు.  రాజేసి వదిలేసిన నిప్పు ఆమెను దహించి వేస్తుంటే దాన్ని చల్లార్చుకునేందుకు ప్రత్యమ్నాయంగా తన కూతురంత వాడైన అల్లుడు మురళీతో శారీరక సంబంధం పెట్టుకుని నెలసరి రాకపోవడంతో అలజడికి గురై పడుకున్నప్పుడు కూడా అదే కలగనడంతో తన తప్పు ముప్పులా ముంచేస్తున్నట్టు ఉలిక్కిపడి లేచి నైటీ కింద ఎర్రని మరక చూసి అతనికి చెప్పాలని చూసి లేకపోతే ఇక తప్పదని మానసిక వేదన ఓ నిట్టూర్పు. 

' పరిధి '  ఆడపిల్ల జీవితాన్ని ఖరీదైన బహుమతులతో బంధించి ఆమె ఖరీదైన జీవితాన్ని అత్త, భర్త , కుటుంబానికే పరిమితం చేసి  మూల్యాంకనం  చెల్లించే కథ. 

మెటీరియల్ లైఫ్ అందులో వైఫ్ తో కూడా మెకానికల్ గా గడిపే మగాళ్ళు ఎంతో మంది భార్య అంటే వండడం, కడగడం, అవసరాలు తీర్చడం అంతవరకే అనుకుంటారు.   కొంతమంది ఆమె మనసు గుర్తించరు.  ఆమె ఉనికిని కూడా పట్టించుకోరు . త్యాగంకు మారుపేరు ఆమెనే కావాలి ' ఇంటర్మిషన్ ' కథ ఇది అందరి మహిళల కథ. 

" ఏడో ఋతువు " కథ పేరులోనే వైవిధ్యభరితంగా, ఆకర్షణీయంగా ఉంది.   ఇద్దరి ఆడవాళ్ళ మధ్య ఏర్పడిన సున్నితమైన బంధం జీవితాంతం కలిసి ఉందాం అనిపించేంత దగ్గరితనం కావడం.   దీప వదిలి వెళ్లిన తర్వాత మేసేజ్ చేయడం,  దీప వెళ్ళినందుకు మాధురి బాధపడడం, పెళ్ళి చేసుకున్న భర్తతో లేని ఆత్మీయత, అనురాగం మాధురి దగ్గర చవిచూడటం కథకు తగిన ప్రాధాన్యత ఉన్న పేరు.

అపర్ణ తోట   కథల పేర్లు పెట్టడంలో చాలా శ్రద్ధ చూపించారు.  కథపేరు చూడగానే మనసు కూడ కథలో లీనమవ్వమని తొందరపడుతుంది.  "రంగు వెలసిన జ్ఞాపకాలు"  కథ చదువుతుంటే కొన్ని వాక్యాల దగ్గర కళ్ళను కాసేపు ఆగిపోయేలా చేస్తాయి.  కదిలిన కళ్ళను మళ్ళీ వెనక్కు మళ్ళిస్తాయి .  " నీకేం కావాలి?" "ప్రస్తుతానికేం వద్దు." " యాభైయ్యేళ్ల జీవితం " 
ఇవి చదవగానే ఆమె కోల్పోయిన జీవితం కోసం ఎంత తపించిపోతుందో అని అర్థమవుతోంది.  ఆమె మళ్ళీ తనే తన సమయాన్ని ప్రేమ కోసం వృధా చేసే బదులు కాలాన్ని సరిగా ఉపయోగించి ఉంటే ఒక గొప్ప కళనో, జ్ఞానాన్నో, పరికరాన్నో సాధించేదాన్నే మోనని నిట్టూర్చుతుంది. 

ఈ కింది వాటిని చూద్దాం ఒక్కసారి.....

" కాదు. ఇవన్నీ ముగిసిపోయిన ప్రేమలు.  కానీ ఇంకా 
కొనసాగుతూనే ఉన్నాయి. "
" ముగిసిన కథలు కావూ అవి?"  " ప్రేమ కథలకు ముగింపు ఉంటుందేంటే పిచ్చిదానా?  జ్ఞాపకాలు తట్టినప్పుడు ప్రతి ప్రేమ కథ మొదలవుతూనే ఉంటుంది.  నిజంగా పచ్చి నిజం ఇది. 

కథ ముగింపులోను గుండెతడి చేసే భావుకత. 

"తలుపుతీసి లోపలికి వెళ్లబోతూ ఒక్కసారి ఆగి మళ్లీ వెనక్కొచ్చి చూసిందామె.  ఆ బెంచీలు గోడమీద చిత్రంలో కలిసిపోయాయి.  వాటిమీదా, పక్కనా కూర్చొనీ, నుంచునీ, విసుగ్గా, ఇష్టంగా, చిరాకుగా, నవ్వుతూ, మొఖం చిట్లిస్తూ ఆ గోడంతా రంగురంగుల చిత్రాలుగా నిండిపోయిన మనుషులు.  విరిగిపోయిన తన మనసు ముక్కలు. 

కథకు ముగింపు కూడా ఆయువు పట్టు.  ఆ విషయంలో కూడా రచయిత్రిగా తన శైలిని కనబరిచారు అపర్ణ తోట. 

ఒక అతడు  - ఒక ఆమె,  గుడ్ మార్నింగ్ అదితి ఈ రెండు కథలు భర్తలు దగ్గరున్నా మనసులు దూరంగా ఉంటున్న ఆ మానసిక వేదనను దూరం చేసుకునే ప్రయత్నమే మరొక మగాడితో శారీరక సంబంధాలకు కారణం. 

"ప్రతి కుటుంబం అని చెప్పలేం కాని దాదాపు జరిగిన కథలు, జరుగుతున్న కథలు ఇవి ఇంత మంచి కథలు అనలేం ఎందుకంటే ఇవి కన్నీటి కథలు కనుక. చదివే ప్రతి ఒక్కరి మనసు కలిచివేస్తుంది. " 

"ప్రేమికుల మధ్య కాని, భార్యా భర్తల మధ్య కాని  ప్రేమ, పరవశం, పులకరింత, కలవరింత, ఆ దగ్గరితనం, అనురాగం, ఆప్యాయత, ఒకరి స్పర్శ మరొకరిని తడిపిన జ్ఞాపకం.  ఎందుకో మరి ఒకప్పుడు తన్నుకొని వచ్చిన అనుభూతులు ఇప్పుడున్న అనుబంధాలలో కనుమరుగైపోతున్నాయి.  దగ్గరగా ఉండి దూరంగా ఉంటున్న బంధాలు ఇప్పుడు కనబడుతున్నాయి.  అంతా యాంత్రికం అయిపోయింది.

ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ఇది.  ఎటువంటి భయం, సంకోచం లేకుండా వాస్తవికమైన కథలను మన ముందుంచిన  అపర్ణ తోట   ఇంకా మరెన్నో కథలను మనకు అందించాలని కోరుకుంటూ రచయిత్రికి శుభాభినందనలు.

ప్రతులకు: 

thota.aparna@gmail.com 
Mobile: 9985427122

click me!