కొంకణి కథ 'ఓ రే చిరుoగన్ మేరే' ను హిందీ నుంచి తెలుగులోకి డా. రూప్ కుమార్ డబ్బీకార్ 'ఓ నా చిట్టి తండ్రీ …' గా అనువదించారు. తల్లి ప్రేమకై తపించే 'ఓ నా చిట్టి తండ్రీ …' కథను ఇక్కడ చదవండి.
అమ్మ చనిపోయి రెండు రోజులు దాటింది. ఆమె యాదిలో నాకు ఏడుపు తెర్లు తెర్లుగా ముంచుకొస్తోంది. నాన్న తల మీద చెయ్యి ఆనించి ఓ మూలకు విచారంగా కూర్చున్న దృశ్యాన్ని చూస్తే నాకు అమ్మ జ్ఞాపకం మరింతగా పీడించేది. ప్రతి రాత్రి నన్ను అమ్మ తన దగ్గరే పడుకోబెట్టుకునేది. అమ్మ పోయిన ఈ రెండు రాత్రులు, సురoగ్ తన గుడిసెలోనే పడుకోబెట్టింది. ఆమె పక్కన చిన్న పసికందులా మూల్గుతూ నిద్రపోయేవాణ్ణి. కానీ, ఈ రోజు నాన్న నా పక్కను తన గుడిసెలో వేయించాడు. సురoగ్ నన్ను తీసుకోవడానికి వచ్చినపుడు "ఇక్కడే పడుకోనీ అతన్ని, ఒంటరిగా వున్న నన్ను ఈ ఖాళీ గుడిసె తినేస్తుంది" అన్నాడు.
సురంగ్ దగ్గరికి వెళ్ళడానికి నా మనసు తండ్లాడతది. ఐనప్పటికీ నేను మౌనంగానే ఉండిపోయాను. రాత్రి ఒంటరిగా పక్క మీద దొర్లుతూ చీకట్లో చేతులు చాపి వెతుకులాడుతుంటే అమ్మ వెలితి కనిపించి గట్టిగా ఏడవాలనిపించింది. కనీసం నాన్న తన దగ్గరైనా నన్ను పడుకోబెట్టుకుంటే బావుంటుంది కదా యని నాన్నను పిలవాలని నోరు తెరిచాను. అంతలోనే నాకు ఆయన ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. ఆయనకు కూడా అమ్మ యాదికొస్తుండొచ్చు, అని తలుచుకొని నేను వెక్కి వెక్కి ఏడవసాగాను. "అమ్మా! అమ్మా ! " అని గట్టిగా ఏడుస్తూ ఒక్కసారిగా నాన్న పక్క మీద వాలిపోయాను. ఆయన నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నేను ఆయన భుజాల చుట్టూ చేతులు వేసి గట్టిగా అల్లుకున్నాను. నాన్న కన్నీళ్లు నా చెంపలపై టప టపా రాలిపడసాగాయి. నా వీపు, తలా నిమురుతూ వుండిపోయాడు. అమ్మ కూడా అలాగే చేసేది.
మరుసటి రోజు చిన్నమ్మ వచ్చింది. వస్తూ వస్తూనే నన్ను కౌగిలించుకొని ఏడవడం మొదలెట్టింది. ఆమె ఒళ్ళో తల దాచుకొని నేనూ ఏడవసాగాను. చిన్ని బట్టలనుంచి మంచి పూల పరిమళం రాసాగింది. కానీ , అమ్మ బట్టలు ఎప్పుడూ పొగచూరిన వాసన కొట్టేవి. చిన్ని బట్టలు కూడా అలా పొగ చూరిన వాసన వేస్తె ఎంత బాగుండేది, అన్న కోరిక మనసులో కలిగింది.
సమయానికి కబురు పంపక పోవడంచే చిన్ని కోపం పట్టలేక నాన్నతో వాదానికి దిగింది. అమ్మను గుర్తు చేసుకొని ఆమె ముఖం కూడా ఎర్రబడిపోయింది. చిన్ని, పోలికల్లో ఏ విధంగా చూసినా అమ్మలా ఉండేది కాదు. మాయమ్మ కాస్త చామనఛాయ. చిన్ని తెల్లగా వుంటుంది. మధ్యాహ్న సమయంలో చిన్ని నాన్నతో అంది, "రఘును నాతొ పాటు మా ఇంటికి తీసికెళ్తాను. ఇక్కడ అతని పెంపకం సరిగా సాగదు."
నాన్న ఏమీ అనలేదు. "మీరు పని మీద బయటికెళ్తే అతను ఒంటరి వాడై పోతాడు. ఆలనా పాలనా ఎవరు చూసుకుంటారు."
నాన్న నా వైపు తిరిగి చూసాడు.
"ఒకవేళ అతన్ని పంపించి వేస్తే, ఒంటరిగా నా రోజులు ఎలా గడుస్తాయి?"
"మీరు మగవాళ్ళు. ఒకసారి పనుల్లో మునిగిపోతే అన్నీ మరిచిపోతారు. పాపం వీడు బాధపడుతూ వుండాలి!"
నేను కూర్చొని ఇద్దరి ముఖాలు చూస్తూ వుండిపోయాను. నాకు వెళ్లాలని కూడావుంది. మరోవైపు ఇక్కడే వుండి పోవాలని వుంది. చివరికి నాన్న నావి రెండు కమీజులు, ప్యాంట్లు సంచిలో సర్దేసి చెప్పాడు "రఘు, నువ్వు మీ చిన్నితో పాటు వెళ్లు.”
ఎప్పుడైతే 'వెళ్లు' అన్నాడో అప్పుడు నా మనసు వెళ్ళడానికి అంగీకరించలేకపోయింది. నాన్న నన్ను గారాబం చేసేవాడు. నన్ను వెంటబెట్టుకొని పక్కనే వున్న చిన్న వంతెన దగ్గరికి చేపలు పట్టడానికి తీసుకెళ్లేవాడు . అలా మేము పట్టుకొచ్చిన చేపలను అమ్మ నిప్పుల్లో చక్కగా కాల్చేది. శనివారం రోజు చౌరస్తా దగ్గర సంత జరిగేది. నాన్న అక్కడ చిన్నవి, పెద్దవి తాళ్లు అమ్మడానికి కూర్చునేవాడు. నేను తోడుగా కూర్చునేవాణ్ణి . ఎండ ముదిరినపుడు నాన్న గొడుగు విప్పితే దానికింద గంభీరంగా ఇద్దరం కూర్చునేవాళ్ళం. అక్కడ నాన్న శనగలు, పల్లీ విత్తనాలు పెట్టేవాడు.
ఈ రోజు కూడా శనివారం. కానీ నాన్నవెళ్ళ లేదు. అమ్మ పోయిన తర్వాత ఆయన చాలా మారిపోయాడు. నాకైతే అమ్మ జ్ఞాపకాలతో అసలు ఊపిరాడకపోయేది .
"నాన్న, నువ్వు కూడా రాకూడదూ?"
"వెర్రివాడా, ముందు నువ్వెళ్లు"
"మరి, నువ్వెప్పుడొస్తావ్?"
"వస్తాను!"
"కానీ, ఎప్పుడు?"
"ఒక రోజు వస్తాను కదా!"
"తొందరగా రా ?"
నాన్న వూరకుండిపొయాడు .
"త్వరగానే వస్తావు కదా? " ఇంకోసారి గుర్తు చేసా. దానికి ఆయన తల వుపాడు .
చిన్ని వేలు పట్టుకొని గుడిసె బయటికి వచ్చాను. నాన్న తలుపు వరకు వచ్చాడు. జువాంవ్ సారా దుకాణం చేరే వరకు వెనక్కి తిరిగి చూస్తూనే వున్నాను. నాన్న అక్కడే నిలబడి వున్నాడు. ఉత్తమ్ దుకాణం తర్వాత గుడిసె కనుమరుగయ్యింది. నాన్న కూడా మరుగైపోయాడు. చిన్ని చెయ్యి వదిలించుకొని నాన్న దగ్గరికి పరిగెత్తుకు పోవాలని పించింది. నేను చెయ్యి విడిపించుకున్నా, చిన్ని నా చెయ్యి గట్టిగా పట్టుకుంది .
"రఘు నువ్వు మంచి పిల్లాడివి గదూ! అవునా , కాదా ?"
నేను అవునన్నట్లు తలవూపి మౌనంగా ఆమె వెంట నడిచాను.
"మనం బస్సులో వెళదాం"
"బస్సులోనా!?"
"ఔను .."
నాన్న, అమ్మ , నేను ఓ సారి జాతరకు వెళ్లాం. అప్పుడు బస్సులోనే వెళ్లాం. మళ్ళీ ఈ రోజు బస్సులోని మెత్తటి సీటులో కూర్చొని వెళ్లే అవకాశం దొరికింది కదా యని మనసులోనే సంతోషంతో పొంగిపోయా. చిన్ని చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకున్నాను.
చిన్ని ఇల్లు తెల్లగా సున్నం వేయబడి, మా గుడిసె కన్నా పెద్దగా వుంది. ఆ రాత్రి ఒకటే జోరుగా వర్షం. అంత కురిసినా ఎక్కడా చుక్క నీరు కారలేదు. మా గుడిసెలోనైతే మూల మూలకు వర్షపు నీరు కారేది . అన్నిచోట్లా గిన్నెలు పెడుతూ అమ్మ అలసటతో విసుగెత్తి పోయేది. వర్షపు నీరు కారడం మరీ ఎక్కువైతే నాన్న నిచ్చెన వేసి పైకప్పు మరమ్మతుకు సిద్ధపడేవాడు. నేను, అమ్మ ఇద్దరం దీపం పట్టుకొని, "ఇక్కడ కారుతుంది , అక్కడ కారుతుంది” అంటూ చూపించేవాళ్ళం.
ఈ రోజు ఒకవేళ గుడిసె కప్పు కారడం మొదలెడితే నాన్నకు దీపం పట్టుకొని ఎవరు చూపుతారు? చిన్ని పక్కలో పడుకున్న నాకు ఆలోచనలు రాసాగాయి.
"చిన్నీ..” పిలిచాను.
"గమ్మున పడుకో .." అని నన్ను ఇంకాస్త దగ్గరికి తీసుకొని వీపు మీద చేత్తో తడుతూ పడుకోబెట్టసాగింది. ఆమె చీర వాసన నా ముక్కుకు చేరింది. అమ్మ ఒళ్ళో పడుకుంటే వచ్చే పొగచూరిన వాసన మంచిగా అనిపించేది. అలాగే సురoగ్ చీర కూడా అదే వాసన వేసేది. అమ్మ చీర వాసనలా భావిస్తూ చిన్ని ఒళ్ళో దూరాను .
చిన్ని, నన్ను అక్కడి బళ్ళో చేర్పించింది. నా మొదటి బడి దీనికన్నా చాలా బాగుండేది . అక్కడ బడికి ఎదురుగానే మర్రి చెట్టు ఉండేది. దాని ఊడలు పట్టుకొని అటూ ఇటూ ఊగే వాళ్ళం . అలాగని ఈ బడికి వెళ్లే దారిలో ఒక చింతచెట్టు వుండేది. చింతకాయలకు కొరతే లేదు. జేబునిండా చింతకాయలు నింపుకునే సమయంలో షిరీ, బెందిత్ లు గుర్తుకు వచ్చేవారు.
మా గుడిసె దగ్గర ఒక కాలువ పారేది. ఎన్నోసార్లు మేమక్కడికి వెళ్ళేవాళ్ళం. డుబుక్ డుబుక్ మని డుబ్కీలు కొడుతూ తానం చేసేవాళ్ళం. చిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కాలువ లేదు. కానీ చేద బావి వుంది. చిన్ని, సర్ర్, సర్ర్ మని తాడు లాగుతూ చిన్న బిందెతో నీళ్లు తోడి నా నెత్తి మీద గుమ్మరించేది. ఒళ్ళంతా సబ్బు రుద్దేది. ఇంటి దగ్గర నేనొక్కణ్ణే స్నానం చేసేవాణ్ణి. అమ్మను కూడా తాకనిచ్చే వాణ్ని కాదు. నేనేం చిన్న పిల్లవాణ్ణా? కాని, చిన్ని నా మాట వినేది కాదు. నాకు విపరీతంగా కోపం వచ్చేది.
"ఏడేళ్ల గుర్రంలా ఎదిగావ్, కాకిలా స్నానం చేస్తావ్! మురికి వెధవ", అంటూ చిన్ని సబ్బుతో రుద్దేసేది. కళ్ళలో నురుగు పోయి కళ్ళు మండేవి. కోపంతో చిన్నిని గిచ్చాలనిపించేది. కానీ ఎప్పుడూ అలా చేయకపోయేవాడిని. అమ్మను ఎన్నిసార్లు అలా గిచ్చి విసిగించానో !
నాన్నతో కలిసి అప్పుడప్పుడు నదికి కూడా వెళ్ళేవాణ్ణి. అక్కడ మేమిద్దరం గులక రాతి పలకలు తీసుకొని ఒకరి వీపు మరొకరు రుద్దుకునేవాళ్ళం. ఆ సంఘటనలు యాదికి రాగానే మళ్లీ నాన్న దగ్గరికి వెళ్లిపోవాలన్న ఆలోచన సతాయించేది. చిన్ని నా తడి నెత్తిని తుడుస్తూ వుంటే నేను కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ వుండేవాడిని.
చిన్నికి పిల్లలు లేరు. చిన్ని, చిన్నాన్న, వాళ్ళ అమ్మ మాత్రమే ఉండేవారు. పొరుగున కూడా నా ఈడు వాళ్ళెవరూ లేరు. వయసులో నా కంటే పెద్ద వాళ్ళు . నన్ను వాళ్లతో కలువనిచ్చేవారు కాదు. నేను చాలా విసుగెత్తి పోయేవాణ్ణి . అప్పుడు చిన్ని తన పని వదిలేసి నాతో ఆడుకునేది.
చిన్నికి రాతి పలకల ముక్కలు పేర్చి ఆడడం తెలియదు. ఐదు గచ్చకాయలతో చాలా బాగా ఆడేది. పిట్, పిట్ మని గచ్చకాయలు ఎగిరేసి పట్టుకునేది. చిన్ని దగ్గర చాలా గచ్చకాయలుoడేవి. చిన్నితో ఆడుతూ వుంటే సమయమే తెలియదు. ఆటలో నేను మోసం చేసినా చిన్ని, చూసి చూడనట్లు ఉండేది. ఆట మొత్తం అయిపోయ్యాక నేను గెలిచానని చెప్పి నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని, "నా రాజా బేటా, చాలా హుషారు" అని పొగుడుతూ మురిసిపోయేది.
బడికి వెళ్లే సమయంలో తాను వాకిట్లో నిలబడి నన్నుచూస్తూ వుండిపోయేది. "జాగ్రత్తగా వెళ్ళు" అని చెప్పేది.
" అలాగే చిన్ని" అని జవాబిచ్చేవాణ్ణి.
చింతకాయల ఆశతో నా కాళ్ళు వడివడిగా ముందుకు సాగేయి. చిన్ని ఇంటిముందు వున్న దారి నేరుగా వెళ్తుంది. తర్వాత మలుపు దగ్గర ఒక మామిడి చెట్టు వుంది. అక్కడికి వెళ్ళేదాకా నేను వెనక్కి తిరిగి చూసుకుంటూ పోయేవాణ్ణి. ఇంకా చిన్ని వైపు చెయ్యి ఊపుతూ చింతచెట్టు వచ్చేదాకా పరుగులు తీసేవాణ్ని. నేను చెయ్యి ఊపేంతవరకు చిన్ని వాకిట్లోనే నిలబడి వుంటుంది. ఒకసారి నేను చేయి వూపడం మరిచిపోయాను. చిన్ని అందుకు అలిగిపోయింది . బడినుండి వచ్చేసరికి వెంటనే అడిగేసింది -
"రఘు, ఈ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూడనే లేదు"
"ఎప్పుడు చిన్నీ?"
"బడికి వెళ్లే సమయంలో!"
"మర్చిపోయాను "
"అలా ఎలా మర్చిపోయావు. నీకు నేనంటే ఇష్టమే లేదు. నేనే నువ్వంటే పడి చస్తున్నాను." చిన్ని కళ్ళలో నీరు ఉప్పొంగింది. నాకు చాలా బాధ అనిపించింది. వెనక్కి తిరిగి చూడనంత మాత్రాన చిన్నికి అంత బాధపడాల్సిన అవసర మేముంది. ఇదే ఆలోచిస్తూ వుండేవాణ్ణి. ఆ రోజునుండి మామిడి చెట్టు దగ్గరికి రాగానే మర్చిపోకుండా వెనక్కి తిరిగి చూసేవాణ్ణి .
రాత్రుళ్ళు చిన్ని కథలు వినిపించేది. ఆ రాత్రి నాకు 'చిరుoగన్' కథ వినిపించింది.
"ఒక చిరుoగన్ ఉండేవాడు. చాలా చిన్నవాడు. ఒక రోజు అతని తల్లి చనిపోయింది. దాంతో చిరుoగన్ గూడులో ఒంటరి వాడై పోయాడు. చిరుoగన్ కు ఒక చిన్నివుండేది. ఆమె ఎoతో ప్రేమతో తన రెక్కలకింద నీడ నిచ్చింది. పెంచి పెద్ద చేసింది. నేను చిన్నిని అడిగా --" చిన్ని, ఆ చిరుoగన్ చిన్నమ్మకు పిల్లలు లేరా?"
"లేరు నాన్న. ఆ పక్షికి పిల్లలు లేరు. చాలా దురదృష్టవంతురాలు".
"మరి"
"చిరుoగన్ చిన్నమ్మ అతని మంచిచెడ్డలు చూడసాగింది. ఎoతో ప్రేమగా ముద్దు చేసేది. తన స్వంత బిడ్డలా చూసుకునేది. చిరుoగన్ ను ఎగరడం నేర్పించింది. పిల్ల పక్షికి రెక్కలొచ్చాయి. అది పొగరు గలదై ఎగరసాగింది. చిన్నమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఒకరోజు చిరుoగన్ గూడు వదిలి బయటికి వచ్చింది. ఎగిరి చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. చిన్నమ్మ చిరుoగన్ ను మర్చిపోలేక ఎదురు చూస్తూ, చూస్తూ పలవరించేది .
"ఓ రే నా చిట్టి చిరుoగన్
ఎప్పుడొస్తావు నువ్వు ?
నువ్వంటే ప్రాణం ఇచ్చేదాన్ని, నిన్నెంతో ప్రేమగా చూసుకునేదాన్ని
కానీ, నువ్వు నన్ను మర్చిపోయావు కదరా!"
అలా చిరుoగన్ ను యాది చేసుకుంటూ చిన్నమ్మ గూడులో ఒంటరిగా ఏడుస్తూ వుండేది .
కథ వినిపిస్తూ, వినిపిస్తూ చిన్ని తాను ఏడవడం మొదలెట్టింది. ఆమె ఏడుస్తూ వుండడం చూసి నేనూ ఏడవ సాగాను. చిన్ని, నన్ను తన ఒళ్ళో పడుకోబెట్టి నెమ్మది స్వరంతో పాడసాగింది.
"ఓ నా చిట్టి చిరుoగన్ ..."
మా ఆరు నెలల పరీక్షలు ముగిశాయి. కానీ, నాన్న ఒక్కసారి కూడా చిన్ని ఇంటికి రాలేదు. నాకు ఆయన, అమ్మ చాలా చాలా యాదికొచ్చేవారు. ఆదివారం పూట అప్పుడప్పుడు చిన్నాన్న వెంట బస్టాoడ్ కు వెళ్ళేవాడిని. అప్పుడు ఏదైనా బస్సునుండి నాన్న దిగుతాడేమో అన్న ఆశతో బస్సుల వైపు చూసేవాణ్ణి. కానీ నాన్న రాలేదు. నేను ఆయనతో చెప్పాను , "త్వరగా రావాలి " అని. చాలా ఎదురు చూసా. ఒక రోజు అకస్మాతుగా దిగాడు. బడికి సెలవులు. నేనొక్కణ్ణే వాకిట్లో ఏడు పెంకులాట ఆడుకుంటున్నాను. ఎదురుగా ఎవరో నిలుచున్నారు. తలెత్తి చూస్తే ఎదురుగా నాన్న. వెంటనే ఆట వదిలేసి, నాన్న నడుం చుట్టూ చేతులు వేసి అల్లుకున్నాను .
"చిన్నీ నాన్నొచ్చాడు "
నాన్న నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నా ముఖం ఆనందంతో విప్పారింది. చిన్ని బయటికి వచ్చింది.
చాయ్ తాగుతూ నాన్న - "నేను రఘును తీసుకుపోవడానికి వచ్చాను" అన్నాడు. చిన్ని చేతిలో వున్న చాట కింద పడిపోయింది. అందులో వున్న బియ్యం చెల్లా చెదురుగా పడిపోయాయి. చిన్ని ఒక్కసారిగా నోట మాట రాక అలాగే ఉండిపోయింది. చాటను కూడా సరిగ్గా పట్టుకోలేని స్థితి.
"మీరు పనిమీద వెళ్తారు. రఘు ఒంటరిగా వుండిపోతాడు. అప్పుడు వాడి సంగతేమిటి? “
"అతనొక్కడే ఏమీ వుండడు."
"ఎలా ఒక్కడే వుండడు!?"
"నేను రెండో పెళ్లి చేసుకున్నాను" - నాన్న నెమ్మదిగా జవాబిచ్చాడు .
" ఏమిటీ! 'మోగ్రు' పోయి ఆరునెలలు కూడా కాలేదు. మీరేమో ..!"
" ఏం చేయగలను. ప్రపంచంలో బతకాలి గదా? చాలా కష్టంలోవుంటి. ఆఖరుకు రఘును ఇక్కడ ఎంతకాలం వుంచగలను?"
చిన్ని మొహం వెలవెలాబోయింది. "రఘు పేరు ఎత్తకండి. అతన్ని అక్కడికి తీసుకెళ్లి, సవతి తల్లి పంచన వదిలేస్తారా? ఎప్పటికీ నేనతన్ని పంపను."
చిన్ని కోపావేశాలతో చెప్పుకుంటూ పోతోంది. నేను వారిద్దరి మొహాలు చూస్తూ వుండిపోయాను.
సవతి తల్లి? చిన్ని సవతి తల్లి కథలు చాలా వినిపించింది. అందులో సవతి తల్లులందరూ చాలా చెడ్డవాళ్ళు. ఆ విషయం నాకు తెలుసు. నాన్న నా కోసం సవతి తల్లిని తెచ్చాడా? ఈ విషయం తెలిసి ఏడుపొచ్చింది. అమ్మ గుర్తుకొచ్చి వెక్కిళ్లు పెట్టి ఏడవసాగాను .
"రఘుకు సవతి తల్లితో ఎలాంటి సమస్యలు రావు. ఆమె కూడా అతన్ని ప్రేమగానే చూసుకుంటది ."
"ఈ విషయం మీరు నాతొ ఏం చెప్పనవసరంలేదు. మీ కప్పుడే ఎలా తెలిసిపోయింది..?"
"ఆమె పొరుగునే వుండేది. మన రఘు అంటే ఆమెకు చాలా ఇష్టం."
“ఎవరామె ?"
"సురంగ్…"
"సురంగ్? నా కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. చాలు, సురంగ్ ఎప్పుడైనా సవతి తల్లిలా మారగలదా? ఆమె ఎంత మంచిది. ఆమె వొడిలో పడుకుంటే అమ్మ ఒళ్ళో పడుకున్నట్లే అనిపించేది.
నేను ఒక్కసారిగా నవ్వేసాను. ఒక్క గంతువేసి నాన్న దగ్గరికి చేరాను .
"నాన్న నేనొస్తాను!"
నాన్న నవ్వుతూ నా తల నిమరసాగాడు. చిన్ని మౌనంగా ఖాళీ చాటను తీసుకొని లోపలికెళ్ళిపోయింది.
"చిన్నీ, నా కమీజు ఎక్కడ? ప్యాంటు ఎక్కడా? " అంటూ ఆమె వెనకాలే పరిగెత్తాను .
చిన్ని వంటింట్లో వుంది. ఆమె మొహం ఎర్ర బారివుంది.
"రఘు, నిజంగానే నువ్వు వెళ్ళిపోతావా?"
"నిజంగా అంటే? ఏమడుగుతుంది. అమాయకురాలు. చిన్నికి ఏమీ తెలియదు. నేను తల వూపాను, ‘అవునన్నట్లు.’
"ఇక్కడ నీకు మంచిగనిపించడంలేదా? "
"నాకిక్కడ బాగానే వుంది. కానీ , నాన్న తోడువుంటే ఇంకా బావుంటుంది “ - అలా చిన్నితో చెప్పాను .
"నేనే పిచ్చిదాన్ని" అలా చెప్తూ, చెప్తూ చిన్ని చాటలో బియ్యం వేయసాగింది .
"చిన్నీ , బయట బియ్యం పడిపోయివున్నాయి. అలాగే పడివున్నాయి గదా !"
"ఆఁ తెలుసు. బియ్యం చెదిరి కింద పడివున్నాయి."
"నేను దగ్గరికి చేసి తీసుకురానా ?"
"అఖ్ఖర్లేదు రఘు, నా చేతినుండి పడిపోయాయి. నేనే ఎత్తుకుంటాను, వదిలేయి" అని చిన్ని బయటి కెళ్ళిపోయింది.
మధ్యాహ్నం భోజనాలయ్యాక చిన్ని నా బట్టలన్నీ సంచిలో సర్దేసింది. నాకిష్టమైన పిప్పరమెంట్లు నా జేబులో నింపింది. కొన్ని లడ్డు వుండలు కట్టింది.
"వస్తూ వుంటావుగా అప్పుడప్పుడూ ?"
"నేను తల ఊపాను." నాన్న సిద్దమవడానికి ముందే నేను చెప్పులు కూడా వేసుకొని వాకిట్లోకి వచ్చి నిలబడ్డా. చిన్ని నన్ను గట్టిగా హత్తుకుంది. ముద్దులు పెట్టింది. నాన్న ఎక్కడ చూస్తాడోనని నేను సిగ్గుతో ఎర్రబడిపోయాను .
నాన్న చెయ్యి పట్టుకొని నడవసాగాను .
"నాన్న, కాలువలో నీళ్లు పారుతున్నాయి కదా?"
"నాన్న, చిన్న వంతెన మీద చేపలు పట్టడానికి వెళ్తాం , ఔనా ? "
" సురంగ్ , ఇప్పుడు మనతో కలిసి వుంటుందా?"
నాలో చాలా విషయాలు తెలుసుకోవాలనే కుతూహాలం పెరిగింది. నాన్న నవ్వుతూనే అన్నింటికీ జవాబులిస్తూ పోయాడు. బెందిత్ ఇంకా షిరీ లకు చాలా, చాలా విషయాలు చెప్పాలి. జేబులో వున్న చింతకాయలు ఇవ్వాలి. ఇంటికి ఎప్పుడు చేరుకుంటామా , అని ఆతృతగా వుంది?
ఆనందంతో బస్సు ఎక్కాను. బస్సు బయల్దేరింది. మాటలు చెబుతూ, చెబుతూ జేబులో చెయ్యి పెట్టి చూసాను. చిన్ని ఇచ్చిన పిప్పరమెంట్లు చేతికి తాకాయి. వెంటనే నాకు యాదికొచ్చింది --
మామిడి చెట్టు దగ్గరికి రాగానే , వెనక్కి తిరిగి చిన్నికి చెయ్యి ఊపుతూ పలకరించాలన్న విషయం మరిచిపోయాను. పూ.. ర్తి... గా .. మర్చిపోయాను ...!
హిందీ అనువాదం: లీలా గాయ్ తోండే
తెలుగు అనువాదం: డా. రూప్ కుమార్ డబ్బీకార్