ప్రపంచ శాంతి దినోత్సవం: మనమూ శాంతి గంటను మోగిద్దాం

By telugu team  |  First Published Sep 21, 2019, 3:09 PM IST

ఈ రోజు ప్రపంచ శాంతి దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నస్రీన్ ఖాన్ అనే కవయిత్రి ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఓ తెలుగు కవిత రాశారు. ఆ కవితను చదవండి.


పచ్చికబయళ్ళలో 
కుందేటి గంతులిచ్చే సంతోషాన్ని 
మందిరాలపైనో
బంగళాల పైనో 
రెక్కలల్లాడిస్తూ ఎగిరే కపోతాలు 
 ఇచ్చే సందేశాన్ని
శత్రువంటూ ఎక్కు పెట్టిన
ఏ మారణాయుధాలూ ఇవ్వవు

ప్రపంచమంతా 
శాంతి మంత్రం జపించే ఈ  తరుణాన
తోటి రాష్ట్రమే పచ్చి గాయాలతో 
రక్తమోడుతోందిప్పుడు

Latest Videos

పేరుకే భూతల స్వర్గమనే కీర్తి
నిత్యం అగ్ని గుండంలా భయోత్పాతమే అక్కడ
హిమ గిరుల మాటున అశాంతి తాండవిస్తోంది
పచ్చటి మైదానాలు కుంకుమ పువ్వులై రగిలిపోతున్నాయి

ఆరు బయట తూనీగలై 
విహరించే పసిపాపలు 
ఏ మందిరంలోనో 
అత్యాచారాంతమై పోతారు
అలజడులకే అలవాటైన జిందగీలు
ప్రశాంతత రుచి ఎరుగరు

చీకటి నిండిన గుండెలు
వేకువనిచ్చే సూరీడుకై కాచుక్కూర్చున్నాయ్
ఆధిపత్యమే ఆకలిని జయించింది
ప్రపంచ శాంతి ఇప్పుడు నీటి మీది రాత అయింది

ఓ ప్రపంచమా...
ఓ సారిటు చూడు
శాంతి గంటలు మాకు కావాలి
కులం మతం అని వినిపించిన 
ప్రతిసారీ మోగిస్తాం
నిరాయుధీకరణకై 
నిత్యం మోగిస్తాం

- నస్రీన్ ఖాన్

కవితలు, కథలు, సాహితీ విమర్శనా వ్యాసాలు, పుస్తక సమీక్షలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని వీలు వెంబడి ఇక్కడ ప్రచురిస్తాం. సాహితీవేత్తలు ఈ విభాగాన్ని వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తమ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నాం. మీ ఫోటో పంపించడం మరిచిపోకండి. email: pratapreddy@asianetnews.in

మరిన్ని కవితలు

తెలుగు కవిత: పార్టి జెండాలు - కండువాలు

దాసరి మోహన్ తెలుగు కవిత: అలసి పోతున్నాను...

click me!