శైలజ బండారి కవితా సంకలనం చేతి చివర ఆకాశంపై ప్రముఖ సాహితీవేత్త శ్రీరామోజు హరగోపాల్ సమీక్ష చేశారు. ఆమె కవిత్వంలోని లోతుపాతులను ఆయన తరిచి చూశారు. తెలుగు సాహిత్యంలో దాని స్థానం ఏమిట ో చెప్పారు.
ఈ కవితా సంకలనం అక్కపల్లి లక్ష్మీకాంత(అమ్మ) కు అంకితం.
అమ్మను తలచుకుంటే ఆకాశం గుర్తొస్తుంది. నోస్టాల్జియా. ‘ఆమె జ్ఞాపకం చేతులెత్తి పిలుస్తున్న ఆకాశం’ అని రాసింది.
ఎందుకు కవిత్వం? ‘మానసిక సాంత్వన కోసం నేను ఎంచుకున్న మార్గం కవిత్వం’. అంటుంది బండారి శైలజ. కవిత్వం సాంత్వన ఇస్తుందా? ఇస్తుంది. It is an expressive outlet. కవిత్వం ఒక కళాత్మకత నిట్టూర్పు. వేదనను బయటికి పంపే చర్య. ‘నిలువనీయని బాధేదో వెంటాడినపుడు నిలువలేక రాయాలకునే కవుల కోవకే చెందిన కవయిత్రి బండారి శైలజ. ‘నేను ఆలపించిన గుండెపాట నా కవిత్వం’ అంటున్నది తను.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన శిలాలోలిత ఆ ఆకాశం శైలజే అంటున్నది. ఆకాశమే ఆమె కవిత్వమవుతున్నది.
మనిషి స్వీయానుభూతులు సమాజానికి పరాయివేం కాదు. మనిషి తనను తాను సమాజం నుంచి వెలివేసుకుని, పరదాలు కట్టుకుని వేరుగా వున్నాననుకోవడం పరాయితనం. మనిషి సామాజికత ఎన్నటికీ మారదు. జీవితలక్ష్యాన్ని, ఆదర్శాన్ని నిలుపుకుని రాసే కవిత్వం అభివ్యక్తి వేరే. ఎంచుకొన్న దారిలో తనను, తన సృజనను నిలుపుకుంటు పోయేవాళ్ళు వేరే. నమ్మిన బతుకును బతికేవాళ్ళు చావో,రేవో తేల్చుకోవాల్సిన సందర్భాలేన్నో. కొందరు తప్పించుకుని బతుకుతుంటారు. కొందరు దారి తప్పక నిల్చుంటారు.
శైలజ కవిత్వంలో ఇది తొలి అడుగే కావచ్చు. తన కవిత్వంలో మానవతత్వాల్ని, మానవత్వాన్ని ప్రేమించే స్వభావముంది. శ్రీశ్రీ అన్నట్టు కష్టజీవికి ముందు వెనక నిలిచే అవగాహన వుంది.
మట్టిమనిషి అనే కవితలో రైతును గురించి
‘ అతను తొలిపొద్దు అయి పొడుస్తూ పుడమితల్లిని నిద్రలేపుతాడు
అందరి ఆకలి తీర్చడానికి ఏరువాకపాటై సాగిపోతాడు
అతని ఒంట్లోని ఒక్కో స్వేదం రాలుస్తూ
బంగారుపంటై పండుతాడు
పదిమందికీ అన్నం పెడతాడు’
మరో కవిత సిగ్నేచర్ లో
‘మట్టే జీవితం అయినవాడు
మట్టిమనిషిగా
మట్టిలో శ్రమ సంతకంగా
మిగిలిపోతాడు’ అంటుంది...ఇదే శైలజ కవిత్వానికి సిగ్నేచర్. ఇట్లాంటి సామాజికస్పృహతో రాసిన కవితలు చాలానే వున్నాయి. వీటిలో అస్తిత్వవాద కవితలు, స్త్రీవాద కవితలున్నాయి.
బతుకుచిత్రం అక్షరాలతో వేసిన పెయింటింగు వంటి కవిత. మార్మిక వర్ణాలతో జీవనసంధ్యను చిత్రించిన కాన్వాస్.
‘మనువు చేసిన మానని గాయాన్ని మాన్పుతుందనే రేపటిఆశ
రేకులు తొడిగినట్టే తొడిగి
ఆకాశానికి రెక్కలు విప్పార్చి ఎగిరిపోయింది
ఎప్పటిలాడే ఏడుపుకొట్టంలో కట్టివేయబడి
వాస్తవానికి, భవిష్యత్తుకు మధ్యన చెరో పడవపై పయనిస్తూ
చుట్టూ మనుషుల మధ్య
మనసునిండా నిండిపోయిన ఖాళీతనంలో
దిగులు నీడ వెంట నడుస్తున్నది’- ఈ కవితను చదువుతున్నపుడు ఫైజ్ కవిత గుర్తొస్తున్నది.
‘ముఝె షిక్వాహై మేరే భాయీ కె తుమ్ జాతే జాతే
లేగయే సాథా మేరే ఉమ్ర్ గుజిష్తాకి కితాబ్’
( భాయి సాహెబ్, ఇట్ల చేసినవేంది? నాబతుకు పుస్తకాన్ని తీసుకునిపోయావు. అందులో చాలావిలువైన బొమ్మలున్నాయి.)
కలలు కనడం సహజం. సామాజిక జీవితంలో కలలు, వాస్తవాలు వేర్వేరు. స్త్రీ జీవితంలోనైతే మరీ దుర్మార్గం. మగవాడు పెళ్ళి చేసుకుంటాడు. ఆమె బతుకును లాగేసుకుంటాడు. భగ్నమైన స్వప్నాలతో ఆమె బతుకునదిలో ఒంటరిపడవ. శైలజ కవిత్వంలో ఇమేజరీ వుంది. మార్మికత వుంది.
క్షమయా ధరిత్రీ కవితలో తొలుత పురుష పాశవికత్వంపై క్రోధావేశాన్ని ప్రకటించింది. ముగింపులో కొచ్చే సరికి క్షమయాధరిత్రిలా మారిపోయింది. నరకాసుక వధ కొంచెం భీకరంగానే వుండాలి.
మా 8ఇంక్లైన్ కాలనీ కవితలో కవయిత్రి
‘నేననే ఒంటరితనం వుండదు
మనమనే మధురామృతం తప్ప’ అంటుంది. సామాజికతత్వమే అటువంటిది. సామూహికజీవన తత్వంలని ఆనందమే అది. ఈ కవిత తన సొంతింటి యాది. ఆ కాలనీ జీవనచిత్రాన్ని మాటలతో చిత్రించారు.
‘‘I believe the style of our poetry is but a reflection of our life style ’’ – NA Sudan అన్నా ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ శిలాలోలిత కవయిత్రికి జీవితం, జీవనం పట్ల స్పష్టమైన అవగాహన, ఆర్తి, తపన, జ్ఞానం వుందనేది స్పష్టం అని రాసారు.
ప్రతి కవితకు సొంత వాతావరణం వుంటుంది. అట్లే సింగరేణి కవిత...
తాను పుట్టిపెరిగిన గోదావరిఖని బొగ్గుగనులు జీవితాల వాతావరణమంతా ఆ కవితలో వుంది.
‘అక్కడ శ్రమకు నిర్వచనం దొరుకుతుంది
కార్మికుల చెమట బిందువుల్లో’... అంటుంది... ఇంతకన్నా సింగరేణి గురించి ఏం చెప్పగలరు. తెలంగాణ నుదుట సింధూరం సింగరేణి, ఒక శ్రామికగీత సింగరేణి.
ప్రపంచంలో ప్రజాస్వామ్యం, పాలన, ప్రజాహితం కావు. వుత్త వ్యాపారాలుగా మార్చి, ప్రపంచాన్ని మార్కెట్టుగా చేసిన పెట్టుబడిదారులు చేయని దారుణాలు లేవు. మనవన్ని అంగడిబతుకులై పోయినయి. ‘మొబైల్ సిమ్ములు ఫ్రీగా యిస్తరుగని, బియ్యం 50 రూ.లకు కిలో. మనం కొనే చెప్పులు ఏసీ రూముల్లో. తిండి రోడ్డుమీద. ఫ్యాక్టరీలకు 24గం.ల కరెంటు. రైతులకు వుండదు. ప్రాధమ్యాలు మారిపోయినయి. మానవసహజ స్పందనలకు కరువు. డబ్బే మనల్ని ఏలుతున్నది.
ఒక గిరిజన బాలికను సరోగేట్ మదర్ గా మార్చిన వైద్యవ్యాపారకుట్రను వెల్లడించిన కవితసరోగేట్ మదర్
తనకు తెలియకుండానే
బేరసారాల వ్యాపారవలయంలో చిక్కి
ఆమె మాతృత్వం కిరాయికడుపుగా మారిపోయింది
బతుకంతా శిశోత్పాదనాయంత్రమై
అసహాయ మాతృమూర్తిగా’ ఎంత దౌర్భాగ్యం? ఇదేం వ్యాపారం. ఈ కవితే ఒక ఎన్కౌంటర్.
‘‘Every word is a wayout for an Encounter often cancelled And it is than a word is true, when it insists on the encounter’’----Ritsos
శైలజ కవిత్వం మనుషులందరి తరపున ప్రశ్నించే ధిక్కారస్వరం కావాలి. భాస్వరపదాలు రాయాలి.
బండారి శైలజ కవిత్వంలో స్వీయాత్మభావన ఎక్కువ. చాలాచోట్ల అబలగా ఆవేదన చెందడం కన్పిస్తుంటుంది. దుఃఖముంది. దుఃఖపడాలి.బాధలున్నాయి.బాధపడాలి. అణిచివేతలున్నాయి, కాని అణిగివుండాల్సిన అవసరంలేదు. ఆత్మవిశ్వాసంతో ప్రకటించాలి కవిత్వాన్ని. తన కవిత్వంలో కవితల నిర్మాణం, శైలి, అభివ్యక్తి ఇంకా మెరుగ్గా వుండాలని శిలాలోలిత ఆకాంక్షించింది. కవితల్లోని డ్రాగింగ్ అనేది ఎకానమీ ఆఫ్ వర్డ్స్ వల్ల తగ్గిపోతుంది. శైలజ ఇంకా గొప్పగా రాయగలదు. ‘గుండెపాట’ ఎంత బాగుంది. లోలోపలి సంఘర్షణను కవిత్వంగా రూపుకట్టించినతీరు అభినందనీయం.
నిశ్శబ్దంగా నిలబడివున్న నేను
నాలోకి తొంగి చూస్తూ
కదలని నీడనై
నిశ్చేష్టపు ప్రతిబింబాన్నై
అనుభవించిన దుఃఖపుభారం
ప్రవహించే స్మృతుల శృతులు
పుప్పొడివర్ణాలు
దూదిపింజ బరువెక్కినట్టు
గుండె బరువెక్కుతున్నది... మంచి ఇమేజరీలతో కవిత బాగుంది.
కవి శివారెడ్డి అన్నట్లు - కవి సినిక్ కాకూడదు. కవికి పాజిటివ్ భావనలుండాలి. ఒక పాజిటివ్ అంశం వుండాలి.
బండారి శైలజ కొత్త కవితాసంకలనం త్వరగా తేవాలని, అందులో కన్నీళ్ళుండొద్దని, వాటికి సమాధానాలే వుండాలని ఆకాంక్ష.
మరింత Emotional integrity, గొప్ప Driving force, Right direction…. కోరుకుంటూ...
--శ్రీరామోజు హరగోపాల్
నోట్: కవితలు, కథలు, సాహితీ విమర్శనా వ్యాసాలు, పుస్తక సమీక్షలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని వీలు వెంబడి ఇక్కడ ప్రచురిస్తాం. సాహితీవేత్తలు ఈ విభాగాన్ని వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తమ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నాం. మీ ఫోటో పంపించడం మరిచిపోకండి. email: pratapreddy@asianetnews.in